హ్యాండ్‌బాల్ సుప్రీంగా జ‌గ‌న్‌ మోహన్ రావు

Jagan Mohan Rao From Telangana Elected As Handball Supremacist For HIF  - Sakshi

జాతీయ‌ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవ ఎన్నిక‌

వైరి ప‌క్షాల‌తో కూడా జైకొట్టించుకున్న‌ తెలుగోడు

క్రీడా సంఘానికి జాతీయ అధ్య‌క్షుడైన తొలి తెలంగాణ వ్య‌క్తి

హ్యాండ్‌బాల్ అభివృద్ధే ధ్యేయం: జ‌గ‌న్‌

సాక్షి, హైద‌రాబాద్ ‌: జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడ‌రేష‌న్ (హెచ్ఎఫ్ఐ) ఎన్నిక‌ల్లో తెలంగాణ‌కు చెందిన అరిశెన‌ప‌ల్లి జ‌గ‌న్ మోహ‌న్‌రావు విజ‌య దుందుభి మోగించారు. ఈనెల 18న‌ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభమ‌వ‌గా అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌గ‌న్ ఒక్క‌రే నామినేష‌న్ వేయ‌డంతో ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. లక్నో లోని హెచ్‌ ఎఫ్ ఐ ప్ర‌ధాన కార్యాల‌యంలో జాతీయ అధ్య‌క్షుడిగా  జ‌గ‌న్ మోహ‌న్ రావు ప్ర‌మాణ స్వీకారం చేశారు.జాతీయ కార్య‌వ‌ర్గంలోని ఇత‌ర ప‌ద‌వుల‌కు ముందు ఒక‌టి కంటే ఎక్కువే నామినేష‌న్లు ప‌డ్డా ఎన్నిక‌లు ఏక‌గ్రీవ‌మ‌య్యేలా జ‌గ‌న్ మంత్రాంగం న‌డిపారు. భార‌త ఒలింపిక్ సంఘం కోశాధికారి, హ్యాండ్‌బాల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆనందీశ్వ‌ర్ పాండే స‌హ‌కారంతో అసోసియేష‌న్ పై ప‌ట్టు సంపాదించిన జ‌గ‌న్ స్వ‌ల్ప కాలంలోనే అధ్య‌క్ష స్థాయికి ఎదిగారు.

2018లో క్రీడారంగం‌లోకి ప్ర‌వేశం..
జ‌గ‌న్ స్వ‌స్థ‌లం రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలోని  దండుమైలారం. స్వ‌త‌హాగా పారిశ్రామిక వేత్త అయిన జ‌గ‌న్ క్రీడ‌ల‌పై ఆస‌క్తితో వాటి అభివృద్ధికి న‌డుం బిగించారు. 47 ఏళ్ల జ‌గ‌న్ 2018లో జ‌రిగిన తెలంగాణ టీ20 లీగ్ నిర్వ‌హ‌ణ‌లో కీల‌క‌పాత్ర పోషించ‌డంతో పాటు మెద‌క్ మేవ‌రిక్స్ జ‌ట్టు య‌జ‌మాని కూడా. ఆ టోర్నీలో మేవ‌రిక్స్ జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. 

ఆసియా హ్యాండ్ బాల్ పోటీల ద్వారా..
ఒలింపిక్ క్రీడైన హ్యాండ్‌బాల్ కార్య‌క‌లాపాల్లో 2018 నుంచి క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ మోహ‌న్‌రావు 2019లో తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం ప్రెసిడెంట్‌గా ఎన్నిక‌య్యారు. ఆ వెంట‌నే ఆసియా హ్యాండ్ బాల్, ఇంట‌ర్ డిస్ట్రిక్ట్ జాతీయ హ్యాండ్‌బాల్ ఛాంపియ‌న్‌షిప్‌ను హైద‌రాబాద్ వేదిక‌గా విజయవంతంగా నిర్వ‌హించి జాతీయ స్థాయిలో అంద‌రి దృష్టి ఆక‌ర్షించారు. ఈ పోటీలను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంతో జాతీయ ఫెడ‌రేష‌న్ ఉపాధ్యక్ష ప‌ద‌విని జ‌గ‌న్‌కు క‌ట్ట‌బెట్టారు. 

టార్గెట్ ఒలింపిక్స్‌గా ప‌నిచేస్తాం: జ‌గ‌న్‌
ముందుగా నా మీద ప్రేమ, ఆప్యాయ‌త‌ల‌తో హ్యాండ్‌బాల్ జాతీయ అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న 29 రాష్ట్ర సంఘాల‌కు హృద‌య‌పూర్వ‌క‌ కృత‌జ్ఞ‌తలు తెలుపుతున్నా. నా మీద న‌మ్మ‌కం ఉంచి ఇంత‌టి గురుత‌ర బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించినందుకు శ‌క్తి వంచ‌న లేకుండా హ్యాండ్‌బాల్ అభివృద్ధికి కృషి చేస్తా.‌ మన దేశంలో గ్రామీణ స్థాయి నుంచి హ్యాండ్‌బాల్‌కు మంచి క్రేజ్ ఉంది. అయితే, వాణిజ్య‌ప‌రంగా పోలిస్తే క్రికెట్‌, బ్యాడ్మింట‌న్ కంటే చాలా వెన‌క‌ప‌డి ఉండ‌టంతో ఒక లెవ‌ల్ వ‌ద్ద‌ే నిలిచిపోయింది. ఇండోర్‌ గేమ్ అయిన హ్యాండ్‌బాల్ మౌలిక‌వ‌స‌తుల లేమి కారణంగా మెట్రో న‌గ‌రాలు మొద‌లు గ్రామాల వ‌ర‌కూ అవుట్‌డోర్ స్పోర్ట్‌‌లా మారిపోయింది. 

*హ్యాండ్ బాల్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా కొత్త‌ కార్యవర్గం
ప్రెసిడెంట్ : అరిశెనపల్లి జ‌గ‌న్ మోహ‌న్ రావు
సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ : డాక్ట‌ర్ ఆనందీశ్వ‌ర్ పాండే,డాక్ట‌ర్ ప్ర‌దీప్ కుమార్ బలంచు (జార్ఖండ్)
వైస్ ప్రెసిడెంట్స్ : ప‌ద్మ‌శ్రీ స‌త్త్ పాల్, అమ‌ల్ నారాయ‌ణ్ ప‌టోవ‌ని, రీనా స‌వీన్
జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ : ప్రీత్ సింగ్ సలూరియా
జాయింట్ సెక్రెట‌రీ : తేజ్ రాజ్ సింగ్, బ్రిజ్ కుమార్ శ‌ర్మ‌, ఎన్.కె.శ‌ర్మ‌, వీణా శేఖ‌ర్
ట్రెజ‌ర‌ర్ : విన‌య్ కుమార్ సింగ్ (గుజ‌రాత్)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top