జూలై రెండో వారంలో ఇంటర్‌ పరీక్షలు!

Inter Exams In The Second Week Of July - Sakshi

కసరత్తు చేస్తున్న ఇంటర్‌ బోర్డు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు

సగం ప్రశ్నలకే సమాధానాలు రాసేలా ఏర్పాట్లు.. పరీక్ష సమయం కూడా 90 నిమిషాలకు కుదింపు

వారంలో నిర్ణయం తీసుకునే చాన్స్‌!

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలను జూలై రెండో వారంలో నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా పరీక్షలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతోంది. జూన్‌ నెలాఖరుకు పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, కార్యదర్శులతో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిర్వ హించిన వర్చువల్‌ సమావేశంలో ప్రభుత్వం వెల్ల డించింది. అయితే జూన్‌ నెలాఖరుకు కరోనా అదు పులోకి వస్తుందో లేదోనన్న భావన అధికారుల్లో నెలకొంది.

మరోవైపు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కూడా జూలైలో 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ జూలై రెండో వారంలో పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించినట్లు తెలిసింది. దీనిపై వారం రోజుల్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించి, తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రభుత్వం మాత్రం జూన్‌లో పరీక్షల నిర్వహణ వైపు మొగ్గు చూపుతుందా? జూలైలో పరీక్షల నిర్వహణకు అనుమతిస్తుందా? అన్న అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది.

సగం ప్రశ్నలకే జవాబులు
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ప్రశ్న పత్రాలను కూడా ముద్రించింది. కరోనా కారణంగా ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. తర్వాత వీలైనప్పుడు నిర్వహిస్తామని పేర్కొంది. ఇప్పుడు జూలైలో ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలకు ఇప్పటికే ముద్రించిన ప్రశ్న పత్రాలనే వినియోగించాలని భావిస్తోంది.

అయితే కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఉండేలా చర్యలు చేపడుతోంది. ప్రశ్న పత్రంలో ముద్రించిన ప్రశ్నల్లో అన్నింటికీ కాకుండా సగం చాయిస్‌ ఉండేలా చర్యలు చేపడుతోంది. అంటే విద్యార్థులు సమాధానాలు రాసిన సగం ప్రశ్నలకు వేసే మార్కులను రెట్టింపు చేసి తుది మార్కులు ఇవ్వాలని భావిస్తోంది. అలాగే పరీక్ష సమయం కూడా 90 నిమిషాలకే కుదించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ఆప్షన్‌గానే ఫస్టియర్‌ పరీక్షలు..
జూలైలో ద్వితీయ సంవత్సర విద్యార్థులతో పాటు ప్రథమ సంవత్సర విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. విద్యార్థుల పరీక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినందున, జూలైలో నిర్వహించే పరీక్షలను విద్యార్థులకు ఆప్షన్‌గానే నిర్వహించే అవకాశం ఉంది. ప్రథమ సంవత్సరం విద్యార్థులందరినీ 45 శాతం కనీస మార్కులతో పాస్‌ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఆ మార్కులు తక్కువగా ఉన్నాయని ఎవరైనా భావిస్తే.. పరీక్షలకు హాజరై మార్కులు పెంచుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అందుకోసమే ప్రథమ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని యోచిస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top