
కరీంనగర్ జిల్లా రాళ్లపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసుకున్న లబ్ధిదారు
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి వెనుకాడుతున్న పేదలు
చేతిలో చిల్లిగవ్వ లేదంటూ వాపోతున్న వైనం
‘ఇంటి విస్తీర్ణం’, పరిమితి కూడా ప్రతిబంధకంగా మారుతున్న తీరు
600 ఎస్‌ఎఫ్‌టీ ఇల్లు మాకొద్దంటున్న మరికొందరు
47,235 ఇళ్లకు అనుమతిస్తే.. పనులు ప్రారంభించింది 17,982 మందే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు ఊపందుకోవడం లేదు. చేతిలో చిల్లి గవ్వ లేని నిరుపేద లబ్ధిదారులు ముగ్గు పోసుకునేందుకు ముందుకు రావడం లేదు. గృహ విస్తీర్ణాన్ని 600 చదరపు అడుగులకు పరిమితం చేయ డం కూడా ఈ పథకం ప్రగతికి ప్రతిబంధకమవు తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటికి తోడు సిమెంట్, ఇటుక, స్టీలు వంటి వాటి ధరలు భారీగా పెరగడంతో లబ్ధిదారులు పనులు ప్రారంభించేందుకు వెనుకాముందు అవుతున్నారు.
నిరు పేదల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇళ్ల నిర్మాణానికి అనుమతి ప త్రాలు పొందిన 47,235 మంది లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 38% మంది అంటే 17,982మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు. కాగా కొందరు తమకు ఇళ్లు వద్దని చెబుతుండటం గమనార్హం.
పెట్టుబడి కొరత..చిన్న ఇల్లు ఆలోచన
లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టాలంటే కొంత మొత్తంలో అయినా డబ్బు అవసరం. బేస్‌మెంట్ వరకు కట్టాలంటే కనీసం రూ.1.50 లక్షలు ఖర్చవుతుంది. బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తయ్యాకే రూ.లక్ష బిల్లు వస్తుంది. నిరుపేదలకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టి పనులు ప్రారంభించడం కష్టమవుతోంది. అప్పోసొప్పో చేసి నిర్మాణం ప్రారంభిద్దామనుకున్నా.. బిల్లులు వస్తాయో, రావోననే ఆందోళన చాలామందిలో ఉంది. ఇక ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్న లబ్ధిదారులు 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు.

జీవితంలో ఒక్కసారే ఇల్లు కట్టుకుంటామని, చిన్న ఇల్లు కట్టుకుంటే ప్రయోజనం ఏంటనే అభిప్రాయంతో కొందరున్నారు. కనీసం 900 (100 గజాల్లోనైనా) చదరపు అడుగులైనా బాగుంటుందని, పిల్లలకు పెళ్లిళ్లు అయినా కొంత సౌకర్యంగా ఉంటుందనే భావనలో ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 600 చదరపు అడుగులకు మించి ఇల్లు కట్టుకుంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిగా పరిగణించరని అధికారులు చెబుతున్నారు.
అలాంటి నిర్మాణాలకు బిల్లులు రాకపోతే తమది బాధ్యత కాదని తేల్చి చెబుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు.. మంజూరు పత్రం తీసుకున్న 45 రోజుల్లోపు ఇంటికి అవసరమైన మెటీరియల్ (స్టీలు, సిమెంట్, ఇటుక, ఇసుక, కిటికీలు, తలుపులు) సమకూర్చుకోవాలి. ఈ నిబంధన కూడా ఒకింత ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. ఇక మార్క్ అవుట్ ఇచ్చాక 90 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
పెరిగిన నిర్మాణ వ్యయమూ కారణమే..
ప్రస్తుత రోజుల్లో ఇంటి నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. సిమెంట్ ధర ఇప్పుడు సంచి రూ.340కి చేరింది. ఒక్కో ఇటుక రూ.8 పలుకుతోంది. మేస్త్రీకి తక్కువలో తక్కువ రూ.లక్ష వరకు చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పోల్చుకుంటే నిర్మాణ వ్యయం భారీగా ఉంటోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇది కూడా ఈ గృహాల నిర్మాణం నత్తనడకన సాగడానికి కారణమనే అభిప్రాయం ఉంది.
మంజూరు పత్రాలు వెనక్కి..
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ముచ్చర్ల గ్రామాన్ని తొలి విడత పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. మొత్తం 94 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేస్తే.. ఇందులో ఏకంగా 56 మంది తమకు గృహాలు వద్దంటూ మంజూరు పత్రాలు వెనక్కి ఇచ్చేశారు. నిర్మాణం ప్రారంభించేందుకు తమ వద్ద డబ్బులు లేని కారణంగానే మంజూరు పత్రాలను వెనక్కి ఇచ్చామని వారు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పైలెట్ గ్రామాల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు సమాచారం.
అడ్వాన్సు కోసం ఐకేపీ రుణం..
ప్రస్తుత పరిస్థితుల్లో.. లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకునేందుకు అవసరమైన ఖర్చుల కోసం ఐకేపీ రుణాలు మంజూరు చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మహిళా సంఘాల సభ్యులకు రూ.లక్ష వరకు రుణం మంజూరు చేస్తున్నారు. దీనిద్వారా ఇంటి నిర్మాణం ప్రారంభించి పునాదుల వరకు పూర్తి చేసుకుంటే రూ.లక్ష బిల్లు వచ్చాక ఈ రుణం తీర్చేలా చర్యలు చేపట్టారు.
అడ్వాన్సు ఇస్తే బాగుండేది
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. నిర్మాణం ప్రారంభించమని అధికారులు చెబుతున్నారు. కానీ ముగ్గు పోసేందుకు చేతిలో డబ్బులు లేవు. ముందుగాల ఏమైనా డబ్బులు అడ్వాన్సు రూపంలో ఇస్తే బాగుండేది. కానీ ముందుగాల పైసలు పెట్టుకుని కట్టుకుంటే.. బిల్లులు తరువాత ఇస్తారట. మాచేతిలో పైసలు లేక ఇల్లు వద్దని అధికారులకు రాసిచ్చాము. – కోల దేవవ్వ, సిరికొండ, రాజన్న సిరిసిల్ల జిల్లా
డబ్బుల్లేక ముగ్గు పోయలేదు..
మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం ఇచ్చారు. కానీ ముగ్గు పోసుకుని పనులు షురూ చేద్దామంటే చేతిలో డబ్బులు లేవు. బేస్‌మెంట్ వరకు పూర్తయితేనే బిల్లు వస్తుందని అధికారులు చెబుతున్నారు. అడ్వాన్సుగా ఖర్చులు పెట్టుకునేందుకు డబ్బులు లేక ముగ్గు పోసుకోలేదు. – తూర్పాటి లక్ష్మీ, ముచ్చర్ల గ్రామం, సంగారెడ్డి జిల్లా.