అక్షరం తేడా ఉన్నా బిల్లు రాదాయె! | New dilemma for Indiramma Housing beneficiaries | Sakshi
Sakshi News home page

అక్షరం తేడా ఉన్నా బిల్లు రాదాయె!

Sep 7 2025 5:53 AM | Updated on Sep 7 2025 5:53 AM

New dilemma for Indiramma Housing beneficiaries

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొత్త చిక్కు

ఆధార్‌ ఆధారంగా బిల్లుల చెల్లింపు విధానం 

వాటిల్లో చాలా మంది మహిళలకు పుట్టింటి పేరు 

ఇందిరమ్మ రికార్డుల్లో అత్తింటి పేరు 

ఇలాంటి వాటితో నిలిచిపోతున్న బిల్లులు

జనగామ జిల్లాకు చెందిన వెంకటమ్మ పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆమె పదేళ్ల క్రితం పుట్టింటి పేరుతోతీసుకున్న ఆధార్‌ కార్డునే ప్రస్తుతం వినియోగిస్తోంది. ఇటీవల ఆధార్‌ నంబర్‌ ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించేలా అధికారులు మార్పులు చేశారు. అయితే వెంకటమ్మ ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రంలో అత్తింటివారి పేరు ఉండటంతో ఆధార్‌ వివరాలతో సరిపోలట్లేదంటూ అధికారులు బిల్లు చెల్లింపు నిలిపేశారు.

నల్లగొండకు చెందిన పెదబోయిన ఈశ్వరి పేరును గ్రామ కార్యదర్శి బృందం ఇందిరమ్మ ఇళ్ల రికార్డులో పి.ఈశ్వరిగా పేర్కొంది. కానీ ఆధార్‌లో ఉన్నట్టుగా పేరు లేకపోవటంతో ఆమెకు ఇందిరమ్మ బిల్లు అందలేదు. అప్పు తెచ్చి పనులు మొదలుపెట్టానని.. బిల్లు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నానని ఈశ్వరి వాపోతోంది.  

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో సమస్యలు తలెత్తుతున్నాయి. తొలుత లబ్ధిదారులు అందించిన వివరాల ఆధారంగా వారి బ్యాంకు ఖాతా లకు నేరుగా బిల్లులు జమ చేస్తూ వచ్చిన అధికారులు.. ఆయా వివరాలు తప్పుగా నమోదవటం వల్ల బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆధార్‌ నంబర్‌ ఆధారంగా చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టారు. అయినా సమస్యలు తగ్గకపోగా కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి.  

పొడి అక్షరాలతో పేర్లు... 
గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలోని బృందాలు ఇందిరమ్మ లబ్ధిదారుల పూర్తి పేర్లను ఆధార్‌ కార్డుల్లోని వివరాల ప్రకారం నమోదు చేయాల్సి ఉండగా కొంత మంది లబ్ధిదారుల విషయంలో సిబ్బంది పొడి అక్షరాలతో సరిపుచ్చారు. ఇంకొందరి ఇంటిపేర్లను పూర్తిగా రాసినా అర్థమయ్యేలా రాయకపోవడం వల్ల కంప్యూటరీకరించే వేళ అక్కడి సిబ్బంది ఇంటి పేర్లను పొడి అక్షరాల్లోకి మార్చారు. దీంతో ఆధార్‌ కార్డుల్లోని ఇంటి పేర్లు ఒక రకంగా.. ఇందిరమ్మ లబ్ధిదారుల రికార్డుల్లో మరో రకంగా నమోదయ్యాయి. ఫలితంగా ఆధార్‌లోని వివరాల ప్రకారం పేర్లు లేకపోవడంతో లబ్ధిదారులు మారిపోయినట్లు భావిస్తూ అధికారులు బిల్లులను నిలిపేస్తున్నారు. 

పేర్ల స్పెల్లింగ్‌లలో తేడాల వల్ల.. 
కొందరు లబ్ధిదారుల పేర్ల స్పెల్లింగ్‌లలోనూ తేడాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదయ్యాయి. ఉదాహరణకు వల్లి అనే పేరును ఆంగ్ల అక్షరాల్లో రాసేటప్పుడు ఆధార్‌ కార్డులో చివరి అక్షరంగా ‘వై’అని ఉంటే.. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ‘ఐ’అని రాశారు. అలాగే సుమతి పేరును ఆంగ్లంలో టీహెచ్‌ఐ అని ఒకచోట, టీఐ అని మరోచోట నమోదు చేశారు. ఇలాంటి తేడాలను కూడా లబ్ధిదారులు మారినట్టుగానే భావిస్తూ బిల్లుల చెల్లింపును అధికారులు ఆపేస్తున్నారు. 

బేస్‌మెంట్‌ స్థాయి వరకు పని పూర్తయినట్టు ఇందిరమ్మ యాప్‌లో ఫొటోతో సహా అప్‌లోడ్‌ చేసి 20 రోజులు గడుస్తున్నా బిల్లులు రావట్లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారులను సంప్రదిస్తే ఆధార్‌ కార్డులోని వివరాలతో సరిపోలట్లేదని.. దాన్ని మారిస్తే తప్ప బిల్లు రాదని చెబుతున్నారు. 

అయితే తమ ప్రమేయం లేకుండా జరిగిన పొరపాట్లు ఇళ్ల నిర్మాణంపై ప్రభావం చూపుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన వారి వివరాలను మార్చి బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. చాలామంది లబ్ధిదారులకు ఈ సమస్య తెలియక బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఫిర్యాదు చేయని వారి బిల్లుల విడుదలలో మరింత జాప్యం జరుగుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement