 
													తొలి దశ కింద ఉమ్మడి ఆదిలాబాద్‌కు నీళ్లు
ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీళ్లు తరలించి కాళేశ్వరం ప్రాజెక్టుకూ సరఫరా.. మలి దశ కింద ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీటి సరఫరా పనులు
రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.. మంత్రివర్గం ఆమోదించాక డీపీఆర్ రూపకల్పన
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును రెండు దశల్లో విభజించి ముందుగా తొలి దశ పనులను మాత్రమే పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 భవిష్యత్తులో జరిపే నీటి కేటాయింపుల ఆధారంగా.. రెండో దశ ప్రాజెక్టు కింద ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీటి సరఫరా చేసే పనులు చేపట్టాలా? వద్దా? అనే అంశంపై భవిష్యత్తులో నిర్ణయం తీసుకోనుంది.
పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు కలిపి మొత్తం 120 టీఎంసీల జలాలను కేటాయించాలని ట్రిబ్యునల్‌ను రాష్ట్రం కోరింది. ఉమ్మడి ఏపీలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతిపాదించిన ఆయకట్టులో అధిక భాగాన్ని తెలంగాణ ఏర్పాటైన తర్వాత పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కింద ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ సరిపడా నీళ్లను కేటాయిస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా నీళ్లను తరలించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.
తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్  
ఇక తొలిదశ కింద గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించి నేరుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీటి సరఫరా చేసే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితోపాటు తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లను తరలించి కాళేశ్వరం ప్రాజెక్టులోని వివిధ విభాగాలకు నీటి సరఫరా చేయాలని నిర్ణయించింది. తుమ్మిడిహెట్టి నుంచి 71.5 కి.మీ. దూరంలోని మైలారం వరకు గ్రావిటీ కాల్వ నీళ్లు సరఫరా కానున్నాయి. అక్కడ పంప్‌హౌజ్ నిర్మించి నీళ్లను నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఎత్తిపోయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనబెట్టి తక్కువ ఖర్చయ్యే ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసింది. దీని ప్రకారం మైలారం నుంచి 20.06 కి.మీ. మేర సొరంగాన్ని తవ్వి టేకుమట్ల వాగులో నీళ్లను పంపనున్నారు.
వాగులో 11 కి.మీ. ప్రయాణించాక నీళ్లు దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి నీళ్లను పంపింగ్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించాలనే ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ క్రమంలో నిరుపయోగంగా ఉన్న సుందిళ్ల బరాజ్‌కి సత్వరంగా మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని భావిస్తోంది. దీనికి రూ.100 కోట్ల వ్యయం కానున్నట్టు అంచనా. నవంబర్ 7న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ వెంటనే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు సవరణ డీపీఆర్ రూపకల్పన కోసం రూ.11 కోట్ల అంచనాలతో టెండర్లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.  
80 టీఎంసీల తరలింపు 
గత ప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే 46.39 టీఎంసీలకు మించి నీళ్లను తరలించలేమని అధికారులు అంచనా వేశారు. 149 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే 88.72 టీఎంసీల నీళ్లను తరలించుకునేందుకు వీలుంటుందని తేల్చారు. 149.5 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 108.5 టీఎంసీలు, 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 129.23 టీఎంసీలను తరలించుకోవచ్చని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇటీవలి సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖను ఆదేశించారు. అనంతరం మహారాష్ట్రకు వెళ్లి 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి సమ్మతి తెలపాలని అక్కడి సీఎంకు విజ్ఞప్తి చేయనున్నారు. రోజుకి టీఎంసీ చొప్పున 80 రోజుల్లో 80 టీఎంసీలను తరలించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
