వెల్త్‌.. హెల్త్‌! దక్షిణాది ప్రజల ఆలోచన ఇదే! సర్వేలో కీలకాంశాలు

Indias Life Goals Preparedness 2023 Survey - Sakshi

కుటుంబ ఆర్థిక పరిపుష్టి ముఖ్యం అంటున్న వారు 74% 

వీటికే దక్షిణాది ఓటు

ఆరోగ్య పరిరక్షణ, సామాజిక బాధ్యత వంటివీ ప్రధాన లక్ష్యాలుగా గుర్తింపు 

ప్రజల దృష్టికోణాన్ని కరోనా మార్చినట్లు వెల్లడి 

దక్షిణాది రాష్ట్రాల్లోని వారి జీవిత లక్ష్యాలు, ప్రాధాన్యతలపై అధ్యయనం 

‘ఇండియాస్‌ లైఫ్‌ గోల్స్‌ ప్రిపేర్డ్‌నెస్‌–2023’సర్వే 

సాక్షి, హైదరాబాద్‌: కుటుంబ ఆర్థిక భద్రతకే దక్షిణాది రాష్ట్రాల పౌరులు అధికంగా మొగ్గుచూపుతున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ విషయంలో వారు మరింత జాగ్రత్తగా, ఆ లక్ష్యాల సాధన దిశగా కృషిచేస్తున్నారు. తమ జీవిత అత్యున్నత లక్ష్యాల్లో ‘కుటుంబ ఆర్థిక పరిపుష్టి’సాధన ముఖ్యమని 74 శాతం మంది భావిస్తున్నారు.

అలాగే, ఆరోగ్య పరిరక్షణ, సామాజిక బాధ్యత కింద సేవా కార్యక్రమాలు, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు వంటి వాటిని వీరు ఇతర ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. ‘ఇండియాస్‌ లైఫ్‌ గోల్స్‌ ప్రిపేర్డ్‌నెస్‌–2023’పేరిట ఓ ప్రైవేట్‌ బీమా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

దక్షిణాది రాష్ట్రాల్లోని వారి జీవిత లక్ష్యాలు, వాటి సాధన ప్రాధాన్యతలపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా 13 మెట్రోలు, ప్రథమ, ద్వితీయశ్రేణి నగరాల్లో 22–55 ఏళ్ల వయసు మధ్య వారితో ఈ సర్వే నిర్వహించింది. దక్షిణాదికి సంబంధించి.. గుంటూరు, మదురై, బెంగళూరు, చెన్నైల్లో ఈ అధ్యయనం చేశారు.  

సర్వేలో కీలకాంశాలు 
వయసు, లింగ భేదంతో సంబంధం లేకుండా అంతా లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నారు 
 ఇతర లక్ష్యాల కంటే కుటుంబ ఆర్థిక భద్రత తమ ప్రాధాన్యమన్న 74 శాతం మంది 
♦ ఆరోగ్యపరిరక్షణ, సేవా కార్యక్రమాలు, ప్రయాణా­లు ఇతర ప్రధాన లక్ష్యాలని అధికశాతం వెల్లడి 
♦ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించుకున్న వారు 73 శాతం 
♦  ప్రతీ ఇద్దరిలో ఒకరు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలనేది కోరిక 
♦ తమను ప్రభావితం చేసే వాటిలో సోషల్‌ మీడియా పాత్ర పెరిగిందని ఎక్కువ మంది చెప్పారు 
♦ సోషల్‌ మీడియా టాప్‌–3 లైఫ్‌గోల్స్‌ ఇన్‌ఫ్టుయెన్సర్లలో ఒకటిగా ఉంది  
♦ కోవిడ్‌ అనంతర పరిస్థితుల్లో సామాజికసేవ, దాతృత్వం వైపు 61 శాతం మంది మొగ్గు  
 ప్రతీ ముగ్గురిలో ఒకరు సామాజికంగా ప్రభా­వం చూపే వాటికి విరాళాలిచ్చేందుకు ఆసక్తి 
♦ బాగా డబ్బు సంపాదించి ఉద్యోగాల నుంచి రిటైర్‌ కావాలనే భావనలో 30 శాతం 
♦  లక్ష్యాల సాధనలో సందిగ్ధత వ్యక్తంచేసిన వారు 52 శాతం 
♦ తమ జీవిత కాలంలో కనీసం ఐదు లక్ష్యాలనైనా చేరుకోవాలని ఆశిస్తున్నారు 
♦ పిల్లలకు మంచి చదువు, సొంత ఇంటి కోసం ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు 
♦ మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారిలో ఈ ఆశలు, ఆశయాలు మరింత ఎక్కువగా కనిపించాయి 
♦  నవయువతరం మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల సాధనకు ఆసక్తి చూపింది. హెల్త్, ఫిట్‌నెస్, విదేశీ ప్రయాణం వైపు మొగ్గు చూపింది. 

జీవిత బీమాలో పెట్టుబడులు 
‘దక్షిణ భారత ప్రజల జీవిత లక్ష్యాలు, ఆశలు, లక్ష్యాల సాధనకు సంబంధించి 40 అంశాలపై పరిశీలన చేశాం. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కుటుంబ ఆర్థిక భద్రతకు దక్షిణాది వారు పెద్దపీట వేశారు. తమ జీవిత లక్ష్యాల సాధనకు జీవిత బీమాలో పెట్టుబడులు పెట్టడమే సరైన మార్గమని అధికశాతం అభిప్రాయపడ్డారు.

కరోనా మహమ్మారి జీవితం, కెరీర్, ఆరోగ్యం, కుటుంబం పట్ల దృష్టికోణాన్ని మార్చింది. కుటుంబభద్రత, సామాజికంగా మంచి సంబంధాలు కలిగి ఉండటం, సామాజిక–ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలన్నింటిని కలిపి మొత్తంగా జీవితాన్ని ప్రతిబించించేలా ఆలోచనలు మారాయి’అని బీమా సంస్థ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ చంద్రమోహన్‌ మెహ్రా చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top