
ఇంజనీరింగ్ కోర్ గ్రూపులకు ఆదరణ తగ్గడంపై సర్కారు దృష్టి
త్వరలో కాలేజీల నిర్వాహకులు, అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
ఈ ఏడాది నుంచి కోర్ గ్రూపుల సిలబస్‌లో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్
అంతా సీఎస్‌ఈ వైపే మొగ్గుతుండటంతో తగ్గుతున్న కోర్ సీట్లు, చేరికలు
ఇంజనీరింగ్‌లో కోర్ గ్రూపులకు రానురాను ఆదరణ తగ్గుతోంది. కంప్యూటర్ సీట్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రతి ఏటా కోర్ గ్రూపుల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. దీంతో కాలేజీలు వాటిని తగ్గించుకునేందుకే మొగ్గుచూపుతున్నాయి. గత ఏడాది వందకు పైగా కాలేజీలు సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో సీట్లు తగ్గించాలని దరఖాస్తులు పెట్టుకున్నాయి.
ఈ ఏడాది కూడా పరిస్థితి ఇలాగే ఉంది. దీనిపై ఇటీవల ప్రభుత్వ ఉన్నతాధికారులు సమీక్షించారు. ఉన్నత విద్యాశాఖ నుంచి సమగ్ర నివేదిక కోరారు. ఇంజనీరింగ్ విద్యలో సమతుల్యత అవసరమని భావిస్తున్న అధికారులు.. కోర్ గ్రూపులను కాపాడేందుకు త్వరలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల నిర్వాహకులు, ఉన్నత విద్యా మండలి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. – సాక్షి, హైదరాబాద్
తగ్గుతున్న చేరికలు
సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఈఈఈ కోర్సుల్లో 2019లో 43,532 సీట్లు ఉంటే 25,823 సీట్లు భర్తీ అయ్యాయి. 2024 సంవత్సరానికి వచ్చేసరికి అంటే ఐదేళ్లలో సీట్లు 25,597కు పడిపోయాయి. 19,739 చేరికలు మాత్రమే నమోదయ్యాయి. మరోవైపు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో గడచిన ఆరేళ్ళలో 280 శాతం మేర ప్రవేశాలు పెరిగాయి. సీట్లు కూడా భారీగానే పెరిగాయి. 2019లో కనీ్వనర్ కోటా కింద 22,033 సీఎస్‌ఈ సీట్లు ఉంటే 20,311 సీట్లు భర్తీ అయ్యాయి. 2024లో సీట్లు 61,587కు పెరగగా ఏకంగా 59,485 సీట్లు భర్తీ అయ్యాయి.
స్లైడింగ్‌లో మార్పుతోనూ కోర్‌కు నష్టం
ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి గత ఏడాది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా కోర్ గ్రూపులను మరింత దెబ్బతీసిందని నిపుణులు అంటున్నారు. కన్వీనర్ కోటా కింద ఏదైనా కాలేజీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆఖరి సమయంలో ఐఐటీ, ఎన్‌ఐటీల్లోనో, డీమ్డ్, ఇతర రాష్ట్రాల కాలేజీల్లోనో చేరుతుంటారు. దీంతో ఖాళీ అయ్యే సీట్లను కాలేజీలు బయటి విద్యార్థులతో భర్తీ చేసేవి. అయితే గత ఏడాది స్లైడింగ్ విధానాన్ని నిర్వహించిన సాంకేతిక విద్య విభాగం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలకు కలిపి స్లైడింగ్ నిర్వహించ లేదు.
ఏ కాలేజీకి ఆ కాలేజీలో మాత్రమే స్లైడింగ్‌కు అవకాశం ఇచ్చింది. ఇది కోర్ గ్రూపులను మరింత దెబ్బతీసింది. 40 వేల ర్యాంకు వచ్చిన వ్యక్తి ఒక కాలేజీలో సివిల్ గ్రూపులో సీటు పొందితే, స్లైడింగ్‌లో ఆ వ్యక్తి సీఎస్‌ఈ సీటు తెచ్చుకున్నాడు. కానీ 10 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థి కంప్యూటర్ కోర్సు మాత్రమే కోరుకున్నా, ఆ కాలేజీలో బ్రాంచి లేకపోవడం వల్ల సీటు పొందలేని స్థితి ఏర్పడింది. ఈ విధంగా గత ఏడాది దాదాపు 5,500 మంది విద్యార్థులు నష్టపోయినట్టు అధికారులు చెబుతున్నారు. గతంలో కోర్ బ్రాంచీల్లో చేరిన వారిని అలాగే ఉంచి, కొత్తవారికి అవకాశం ఇచ్చేవారు.
దీనివల్ల కోర్ గ్రూపులో చేరినవారు అలాగే ఉండేవారు. దీనిపై పలువురు విద్యావేత్తల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నత విద్య అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఇటీవలి కాలంలో కోర్ గ్రూపుల సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాప్టర్లను కూడా చేరుస్తున్నారు. దీనివల్ల కోర్‌కు ఆదరణ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.