ఐటీ సోదాలు.. ప్రముఖుల బెంబేలు! 

Income Tax Department IT Raids On Hyderabad Based Real Estate Company - Sakshi

మొన్న వాసవి, సుమధుర .. ఇప్పుడు ఫీనిక్స్‌పై దాడులతో కలకలం  

గత వారం జరిగిన సోదాల్లో బయటపడిన ఫీనిక్స్‌ లింకులు 

వాసవి, సుమధుర, ఫీనిక్స్‌ మధ్య భారీగా నగదు లావాదేవీలు 

కీలక ఆధారాలు గుర్తించిన ఐటీ విభాగం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై జరుగుతున్న ఆదాయపు పన్ను దాడులు రాజకీయ వర్గాల్లో, ప్రముఖుల్లో గుబులు రేపుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న ప్రముఖ కంపెనీలు వాసవి, సుమధుర, ఫీనిక్స్‌లో జరుగుతున్న సోదాల వ్యవహారం బడాబాబుల పీకలకు చుట్టుకునేలా ఉందన్న చర్చ జరుగుతోంది. 

తొలుత వాసవి, సుమధుర 
ఐటీ శాఖ వారం క్రితం వాసవి కంపెనీతో పటు సుమధుర గ్రూపుపై దాడులు నిర్వహించింది. గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు చెందిన 27 ఎకరాల భూమిని వాసవి–సుమధుర జాయింట్‌ వెంచర్‌ కింద కొనుగోలు చేసి డెవలప్‌ చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఐటీ రంగంలోకి దిగి దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు, చెల్లింపులకు సంబంధించి అంతర్గత ఒప్పంద పత్రాలు, డిజిటల్‌ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. 

తర్వాత ఫీనిక్స్‌ 
గల్ఫ్‌ ఆయిల్‌ సంస్థకు చెందిన భూముల కొనుగోలు వ్యవహారంలో ఫీనిక్స్‌ పాత్రపై ఐటీ శాఖకు ఫిర్యాదులు వచ్చి నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వాసవి, సుమధుర, ఫీనిక్స్‌ మధ్య పెద్దయెత్తున లావాదేవీలు జరిగాయని, అందులో పన్ను చెల్లించని సొమ్ము భారీ స్థాయిలో చేతులు మారినట్టు ఐటీ శాఖ గుర్తించింది. వాసవి, సుమధుర కంపెనీల్లో సాగిన ఐటీ సోదాల్లో ఫీనిక్స్‌ కంపెనీతో జరిగిన లావాదేవీల తాలుకు ఆధారాలు లభించడం వల్లే చిక్కడంతోనే ప్రస్తుతం ఫీనిక్స్‌పై దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఫీనిక్స్‌ తక్కువ టైమ్‌లో ఎక్కువ భూమిని సమీకరించడంతో పాటు భారీస్థాయిలో బిజినెస్‌ విస్తరణ చేస్తోంది. నగరంలోని దాదాపు 15 ప్రముఖ ప్రాంతాలతో పాటు బెంగళూరులోనూ భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టింది. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రీలాంచ్‌ పేరుతో కోట్లాది రూపాయల నగదును వసూలు చేసి లెక్కల్లోకి రాకుండా చేసినట్టు ఐటీ అధికారులు చెబుతున్నారు. ఇలా భారీ సంఖ్యలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ప్రీలాంచ్‌ బుకింగ్‌ రసీదులు, చేతి రాతతో ఉన్న ఖాతా పుస్తకాలను ఫీనిక్స్‌ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి.  

ప్రముఖుల్లో ఆందోళన: ఈ మూడు సంస్థలపై ఐటీ సోదాలు జరగడం రాజకీయ ప్రముఖుల్లో గుబులు రేపుతోంది. అనేకమంది ప్రముఖులు తమ బినామీలతో ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బినామీల ద్వారా వందల కోట్ల డబ్బును రియల్‌ రంగంలోకి తరలించినట్టు ఐటీ వర్గాలు అనుమానిస్తున్నాయి. వివాదాస్పదంగా ఉన్న కొన్ని భూములను ఈ సంస్థలు చేజిక్కించుకొని నిర్మాణ లు చేపట్టడం వెనకున్న ప్రముఖులకు సంబంధించిన లా వాదేవీలకు ఆధారాలు గుర్తించినట్టు ఐటీ వర్గాలు తెలిపా యి. దీనితో ప్రముఖులు ఎప్పుడు ఐటీ విభాగం తమ మీ ద పడుతుందో అన్న ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది.  

ఆ ఫిర్యాదు వల్లేనా..? 
నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో కీలకంగా ఉన్న భూములను దక్కించుకుంటున్న ఈ ప్రముఖ రియల్‌ కంపెనీలపై ఓ బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థ దాదాపుగా ఏడాది క్రితం ఐటీ విభాగానికి అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసిందనే చర్చ జరుగుతోంది. తమకు దక్కాల్సిన భూములు ఈ మూడు సంస్థలకు దక్కడంపై ఐటీకి సంబంధిత బడా సంస్థ స్పష్టమైన ఆధారాలు అందజేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐటీ సోదాలు ప్రారంభమైనట్టు అనుమానిస్తున్నారు. 

ఐటీ... తర్వాత రంగంలోకి ఈడీ! 
ప్రస్తుతం ఐటీ నిర్వహిస్తున్న సోదాల్లో లభ్యమవుతున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా పరిగణనలోకి తీసుకొని రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. దీంతో రియల్‌ సంస్థల అధిపతులు, పెట్టుబడులు పెట్టిన భాగస్వాములు, రాజకీయ ప్రముఖులు వణికిపోతున్నట్టు సమాచారం.  

ముంబై నుంచి 250 మంది.. 
మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి ఫీనిక్స్‌ సంస్థల చైర్మన్‌ చుక్కపల్లి సురేశ్‌తో పాటు డైరెక్టర్ల నివాసాలు, కార్పొరేట్‌ కార్యాలయాల్లో ఐటీ విభాగం సోదాలు ప్రారంభించింది. ముంబై నుంచి 250 మంది ఐటీ అధికారులు 25 బృందాలుగా విడిపోయి సుమారు 25 ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, మూసాపేట తదితర ప్రాంతాల్లోని కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.

2016 నుంచి ఇప్పటివరకు కంపెనీలు కొనుగోలు చేసిన భూములు, ప్రారంభించిన నిర్మాణాలు, వాటి ఖర్చులు, అమ్మకాలకు సంబంధించిన పత్రాలతో పాటు కొనుగోళ్ల..అమ్మకాల అగ్రిమెంట్‌ పత్రాలు, జాయింట్‌ వెంచర్లకు సంబంధించిన ఒప్పంద పత్రాలు.. ఇలా వేల సంఖ్యలో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ప్రీలాంచ్‌ పేరిట బెంగళూరు, హైదరాబాద్‌లో అమ్మకాలకు పెట్టిన నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఐటీ అధికారులు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top