సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ర్యాలీ భగ్నం

Hyderabad: Singareni Contract Workers Rally - Sakshi

సుందరయ్య విజ్ఞానకేంద్రం: సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సుంద­రయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు మంగళవారం తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డు­కు­న్నారు. దీంతో ఉద్రిక్తతత నెలకొంది. ఎ­స్వీకే వద్దకు చేరుకున్న వందలాది మంది కార్మికులతో సభ జరిగింది. అనంతరం కార్మికులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు ర్యాలీగా బయలుదేరగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ర్యాలీని భగ్నం చేయటంతోపాటు పలువురిని అరెస్టు చేసి మలక్‌పేట, అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అంతకు ముందు జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణి లాభాలకు కార్మికులే కారణమని, అ­లాం­టి కార్మికుల శ్రమ దోపిడీ చేయటం దుర్మార్గమని అన్నారు.

కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకవైపు సింగరేణి కార్మికులను పొగుడుతూనే, వారి సంక్షేమం విషయంలో మాత్రం ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వర్‌రా­వు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్క­ర్, ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఎస్‌.ఎల్‌.పద్మ, జి.అనురాధ, ఐఎన్‌టీయూసీ నా­యకులు నాగభూషణం, బీఎంఎస్‌ నాయకులు నాగేశ్వర్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top