Hyderabad ORR: ‘ఔటర్‌’కు వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డు

Hyderabad Outer Ring Road Wins World Green City Award - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రతిష్టాత్మకమైన వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డును గెలుచుకుంది. శుక్రవారం దక్షిణ కొరియాలోని జెజు నగరంలో జరిగిన ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ ప్రొడ్యూసర్స్‌ (ఏఐపీహెచ్‌) కార్యక్రమంలో హైదరాబాద్‌కు ఈ అవార్డు లభించింది. ఆరు కేటగిరీల్లో వరల్డ్‌ గ్రీన్‌ సిటీస్‌ అవార్డులను ప్రకటించగా 18 దేశాలకు చెందిన నగరాలు ఫైనల్‌కు ఎంపికయ్యాయి.

మన దేశం నుంచి హైదరాబాద్‌ ఎంపికయ్యింది. హరితహారంలో భాగంగా  ఔటర్‌ రింగురోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన పచ్చదనానికి ‘లివింగ్‌ గ్రీన్‌’ విభాగంలో అవార్డు లభించింది. ఆకుపచ్చ అందాలతో ఔటర్‌ రింగ్‌రోడ్డు  తెలంగాణ రాష్ట్రానికే పచ్చల హారంలా (గ్రీన్‌ నెక్లెస్‌) ఉన్నట్లు ఏఐపీహెచ్‌ అభివర్ణించింది. నగరానికి ఈ అవార్డు లభించడం పట్ల మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. హెచ్‌ఎండీఏ అధికారుల కృషిని అభినందించారు.   

హరిత భారతం కోసం కృషి చేయాలి: కేసీఆర్‌  
తెలంగాణను మరింత ఆకుపచ్చగా మార్చుతూ, హరిత భారతాన్ని రూపొందించేందుకు అందరూ కృషి చేయాలని సీఎం కేసిఆర్‌ పిలుపునిచ్చారు. హైదరబాద్‌ నగరానికి ప్రతిష్టాత్మక ‘వరల్డ్‌ గ్రీన్‌ సిటీ’అవార్డు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని కేసీఆర్‌ అభినందించారు.

ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ ప్రొడ్యూసర్స్‌ (ఏఐపీహెచ్‌) అందించిన ఈ అంతర్జాతీయ అవార్డు ప్రపంచ వేదికపై తెలంగాణతో పాటు దేశ ప్రతిష్టను ఇనుమడింప జేసిందన్నారు. మనదేశం నుంచి ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్‌ కావడం గర్వించదగ్గ విషయమన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top