
హైదరాబాద్, సాక్షి: ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్నం కేసును పోలీసులు చేధించారు. నిందితుడిని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ యువకుడిగా నిర్ధారించారు. బాధితురాలు గుర్తించడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన యువకుడు.. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో గంజాయికి బానిసై నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రైల్లో వెళ్తున్న ఒంటరి యువతిపై అఘాయిత్యానికి యత్నించినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు.. నిందితుడిని ఫొటో ద్వారా గుర్తు పట్టింది. ఆ తర్వాతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గంజాయి మత్తులోనే ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకుని సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్‌లో మేడ్చల్‌కు బయలుదేరింది. అయితే మహిళల కోచ్‌లో ఆమె యువతి ఒక్కతే ఉండగా నిందితుడు (25) ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది.
కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని రైల్వే ఎస్పీ చందనా దీప్తి పరామర్శించారు. మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు సంకేతమంటూ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ విరుకుపడుతోంది.