
కూకట్‌పల్లిలో 11 ఏళ్ల బాలిక దారుణ హత్య
తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఘటన
ఎవరు..ఎందుకు చంపారో తెలియక అయోమయం
తల్లడిల్లిన తల్లిదండ్రులు, బంధువులు
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని దయార్‌గూడలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 11 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా గొంతుకోసి..కడుపులో కత్తితో పొడిచి చంపేశారు. ఇలా ఎందుకు..ఎవరు ఇంత కసిగా హత్య చేశారో తెలియరాలేదు. కూకట్‌పల్లి పోలీసులు తెల్పిన మేరకు..సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం, ముక్త క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు దయార్‌గూడలో ఓ పెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్నారు. కృష్ణ సనత్‌నగర్‌లోని బైక్ మెకానిక్‌గా పనిచేస్తుండగా తల్లి రేణుక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నది. వీరికి కుమార్తె సహస్రిని (11), కుమారుడు (9) ఉన్నారు. సహస్రిని బోయిన్‌పల్లిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. సోమవారం ఉదయం 9 గంటలకు తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిపోయారు.
సాది్వన్ పాఠశాలకు వెళ్లాడు. సహస్రినికి పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ ఉండటంతో గత నాలుగు రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్నది. కాగా మధ్యాహ్నం 12 గంటలకు సాద్విన్ చదువుతున్న పాఠశాల నుంచి బాబుకు లంచ్ బాక్స్ తేలేదని తల్లిదండ్రులకు ఫోన్ వచి్చంది. దీంతో తల్లి రేణుక వేరే వారికి ఫోన్ చేసి లంచ్‌బాక్స్ రెడీ చేసి స్కూల్‌కు పంపాలని కుమార్తెకు చెప్పడానికి పంపించింది. అయితే ఇంటి తలుపు మూసి ఉందని, ఎవరూ లేరని తల్లికి చెప్పటంతో ఆమె కృష్ణకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి లంచ్ బాక్స్ ఇచ్చి రమ్మని చెప్పింది. కృష్ణ ఇంటికి వెళ్లి చూడగా కుమార్తె సహస్రిని మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది.
దీంతో భార్యకు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్‌తో వచ్చి పరిసరాలను క్షుణ్ణం పరిశీలించి, ఆధారాలు సేకరించారు. బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే సహస్రిని ఎవరితో గొడవలు పెట్టుకోదని, అందరితో కలివిడిగా ఉంటుందని, పాఠశాల దూరంగా ఉండటంతో దగ్గరలో స్నేహితులు కూడా ఎవరూ లేరని తల్లి రేణుక తెలిపింది. నా బిడ్డను ఎందుకు చంపారో..ఏమో అంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది.
ఎవరికి ఏ అపకారం, అన్యాయం చేయని మాకు ఈ కడుపుకోత ఎందుకు అంటూ కన్నీటి పర్యంతమైంది. పాప స్కూల్‌కు వెళ్లినా బతికుండేది కదా అంటూ విలపించింది. సహస్రిని కడుపులో మూడు కత్తి గాట్లు, గొంతు కోసినట్లు గాయాలు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. దొంగతనం కోసం కానీ, మరే కారణంతో కానీ బాలికను చంపి ఉండవచ్చనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకోసం, ఎవరు పాపను చంపారన్న వివరాలు దొరకలేదని, సీసీ కెమెరాలు కూడ సరిగ్గా లేవని, దర్యాప్తు తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
తెలిసిన వారి పనే?
కాగా కృష్ణ దంపతులు నివసిస్తున్న భవనంలో రెండు అంతస్తులు, ఓ పెంట్ హౌస్ ఉంది. పెంట్‌హౌస్‌లో వీరు నివసిస్తున్నారు. శని, ఆదివారాల్లో సెలవులు కావటంతో సోమవారం పాప ఒక్కతే ఉందన్న విషయం ఎవరికి తెలిసి ఉంటుందోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. బాలిక ఒంటరిగా ఉందనే విషయం తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘటనా స్థలానికి వెళ్లి చిన్నారి తల్లిని పరామర్శించి, ఓదార్చారు. పోలీసులు నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, పాప తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు.