కొలువులకు కోత!

Hyderabad Job Market Scenario Latest Updates in Telugu - Sakshi

కోవిడ్‌ కలకలమే కారణం..

ప్రైవేట్‌ రంగంలో వృద్ధి రేటు అంతంతే..

నౌకరీ డాట్‌కామ్‌ తాజా సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్ లో కొలువుల కల్పన తగ్గుముఖం పట్టింది. ప్రైవేటు జాబ్స్‌ రంగంలో వృద్ధి రేటు మందగించింది. గతేడాది చివరి నాటికి మహానగరం పరిధిలో ఉద్యోగాల వృద్ధి కేవలం ఒకే ఒక్కశాతానికి పరిమితమైంది. ప్రముఖ ఉపాధి కల్పన సైటు నౌకరీ డాట్‌కామ్‌ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ విషయంలో పింక్‌సిటీ జైపూర్‌ 40 శాతం వృద్ధిరేటును సాధించి అగ్రభాగాన నిలిచింది.

రెండోస్థానంలో ఉన్న ఛండీగడ్‌లో 14 శాతం వృద్ధి, మూడోస్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీ 10 శాతం వృద్ధి సాధించింది. నాలుగో స్థానానికి పరిమితమైన ముంబయిలో 8 శాతం, ఆరోస్థానంలో నిలిచిన కోయంబత్తూర్‌లో 6 శాతం.. ఏడోస్థానంలో నిలిచిన అహ్మదాబాద్‌లో 5 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. ఇక మన గ్రేటర్‌ సిటీ కేవలం ఒక్కశాతం వృద్ధితో సరిపెట్టుకుంది. మన కంటే అధ్వాన్నంగా ఉన్న నగరాల్లో.. కొచ్చిన్‌ సున్న శాతం, బెంగళూరు, కోల్‌కతా నగరాలు మైనస్‌ 4 శాతం వృద్ధిరేటుతో తిరోగమనంలో ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఇక పుణే నగరం సైతం మూడు శాతం మైనస్‌ వృద్ధి రేటుతో వెనుకంజలో ఉండడం గమనార్హం.

ఈ రంగాల్లో కొలువులకు కోత..

  • ఉపాధి కల్పన వృద్ధిరేటు మందగించడానికి లాక్‌డౌన్, కోవిడ్‌ కలకలమే కారణమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. 
  • లాక్‌డౌన్‌ కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రదేశాలు, ట్రావెల్స్‌ మూతపడడంతో ఈరంగం కుదేలైంది.
  • ప్రధానంగా హోటల్స్, రెస్టారెంట్లు, ఎయిర్‌లైన్స్‌ టూరిజం రంగాలు కుదేలు కావడంతో ఆతిథ్యరంగంలో 80 శాతం మేర వృద్ధి రేటు పడిపోయిందట. 
  • ఇక రిటైల్‌ రంగంలోనూ 71 శాతం నెగెటివ్‌ వృద్ధి నమోదైంది. 
  • రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మైనస్‌ 60 శాతం నమోదైనట్లు అధ్యయనం పేర్కొంది.

ఈ రంగాలు బెటర్‌ గురూ...

  •  కోవిడ్‌ కష్టకాలంలోనూ కొన్ని రంగాలు నిలకడ గల వృద్ధిరేటును సాధించి నిరుద్యోగులకు ఆదరువుగా నిలిచాయి.
  • ప్రధానంగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స​ రంగాల్లో కొలువుల కల్పన 7 శాతం పెరిగింది. 
  • ఐటీ, ఫార్మా, బయోటెక్, హెల్త్‌కేర్‌ మెడికల్, వైద్యపరిశోధన, అభివృద్ధి, అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌, ట్యాక్స్, ఆడిట్, సేల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ రంగాల్లో స్థూలంగా 4–10 శాతం వృద్ధి నమోదైందని ఈ సర్వే తెలిపింది. 
  • ఇక బీపీఓ, కెపిఓ, కస్టమర్‌ కేర్‌ (కాల్‌సెంటర్‌) సర్వీసెస్‌ రంగంలో సున్నా వృద్ధి నమోదవడం గమనార్హం.

జనవరి–మార్చి ఆశాజనకం..?
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో ఆయా రంగాల్లో ఉపాధి కల్పనలో వృద్ధి రేటు క్రమంగా పెరిగే అవకాశాలున్నట్లు ఈ సర్వే అంచనా వేయడం విశేషం. కోవిడ్‌ అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఆయా రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. నూతన ఉద్యోగుల నియామక ప్రక్రియను పలు సంస్థలు ఇప్పుడిప్పుడే ప్రారంభించినట్లు ఈ సర్వే తెలిపింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరగడంతోఉపాధి కల్పన క్రమంగా పెరుగుతోందని ఈ సర్వే తెలిపింది. 

చదవం‍డి:
టీఆర్‌ఎస్‌లో కొలువుల జాతర

కన్వీనర్‌‌ కోటా కిందే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top