ఎయిర్‌ రివాల్వర్‌తో ఆటలు.. బల్లిని కాల్చబోతే బాలుడికి గాయం.. | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ రివాల్వర్‌తో ఆటలు.. బల్లిని కాల్చబోతే బాలుడికి గాయం..

Published Sat, Aug 6 2022 1:30 PM

Hyderabad: Air Gun Pellet Misfires, Minor boy Injured At Moghalpura - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్రీడల కోసమంటూ ఖరీదు చేసిన ఎయిర్‌ రివాల్వర్‌తో ఓ పాతబస్తీ వాసి ఆటలాడాడు. అప్పటి వరకు వీధికుక్కలపై కాల్పులు జరిపిన అతగాడు గోడపై ఉన్న బల్లిని కాల్చాలని ప్రయత్నించాడు. గోడకు తగిలిన చెర్రా రికోచెట్‌ కావడంతో సమీపంలో ఉన్న బాలుడి వీపులోకి దూసుకుపోయింది. ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలుడు డిశ్చార్జ్‌ అయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మొఘల్‌పుర పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్‌ ఎ.శివ కుమార్‌ వివరాలు వెల్లడించారు.

సుల్తాన్‌షాహీ కైసర్‌ హోటల్‌ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ రహీం కుమారుడు మహ్మద్‌ అఫ్జల్‌ అఫ్సర్‌ వాటర్‌ ప్లాంట్, పాన్‌  షాపు నిర్వహిస్తుంటాడు. ఇతడు 2021 అక్టోబర్‌ 21న అబిడ్స్‌లోని ఏషియన్‌ ఆరమ్స్‌ దుకాణం నుంచి 0.117 క్యాలిబర్‌ ఎయిర్‌ రివాల్వర్‌ ఖరీదు చేశాడు. ఆ సందర్భంలో క్రీడల కోసమంటూ (స్పోర్ట్స్‌) రూ.17,700 వెచ్చించి దీనిని కొన్నాడు. ఈ రివాల్వర్‌లో చెర్రాలను తూటాల మాదిరిగా వినియోగించే అఫ్సర్‌ ఇంట్లో గోడలపై ఉన్న బల్లులు, వీధికుక్కలను కాలుస్తుంటాడు. సోమవారం (ఈ నెల 1వ తేదీ) ఉదయం 10.30–11 గంటల మధ్య ఇలానే చేస్తున్న అఫ్సర్‌ను ఓ బాలుడు కలిశాడు. గోడపై ఉన్న బల్లిని కాల్చాల్సిందిగా కోరాడు.

ఇతడు అదే పని చేయగా.. గోడకు తగిలిన చెర్రా రికోచెట్‌ కారణంగా దిశ మార్చుకుని దూసుకుపోయింది. ఇంటి పక్కన ఉండే సయ్యద్‌ మోహసీన్‌ అలీ కుమారుడు ఆజాన్‌ (9) బయటకు ఆడుకుంటున్నాడు. ఈ చెర్రా వేగంగా వెళ్లి ఆజాన్‌ వీపులోకి దూసుకుపోయింది. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న క్లీనిక్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆపై మెరుగైన వైద్య సేవల చికిత్స నిమిత్తం బుధవారం బహదూర్‌పురాలోని మరో ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న బాలుడిని వైద్యులు శుక్రవారం డిశ్చార్జి చేశారు.
చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో మహిళపై దాడి 

ఆజాన్‌ తండ్రి సయ్యద్‌ మెహసీన్‌ అలీ ఫిర్యాదు మేరకు మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అఫ్సర్‌ కోసం గాలిస్తున్నారు. ఎయిర్‌ రివాల్వర్, పిస్టల్, గన్స్‌కు లైసెన్స్‌ అవసరం లేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇలా జంతువులను కాల్చడం, ఎదుటి వారిని గాయపరచడం మాత్రం నేరమేనని స్పష్టం చేస్తున్నారు.

నిందితుడు చిక్కిన తర్వాత విచారణలో, పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడికి బాలుడి కుటుంబానికి మధ్య ఆరి్థక లావాదేవీలు ఉన్నాయని, వీటి నేపథ్యంలోనే కొన్ని స్పర్థలు కూడా వచ్చాయని తెలుస్తోంది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశాలపై ఫిర్యాదుదారుడి నుంచి వాంగ్మూలం సేకరించాలని నిర్ణయించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement