బంజారాహిల్స్‌: చిమ్మచీకట్లో.. లాకర్‌ గదిలో.. 18 గంటలు

HYD: 85 Year Old Man Accidentally locked up in Bank Rescued After 18 hours - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: అసలే 85 ఏళ్ల వృద్ధాప్యం.. ఆపై మధుమేహం, రక్తపోటు. సమయానికి మందులు వేసుకోకపోతే ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి. గాలి సరిగా లేదు.. మంచి నీళ్లు లేవు. చిమ్మ చీకట్లో ఒంటరిగా ఓ వ్యక్తి 18 గంటల పాటు నరకం అనుభవించాడు. ఒంటరిగా స్ట్రాంగ్‌రూమ్‌లో చిక్కుకున్నా.. గుండెదిటవు చేసుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

రోడ్‌ నెం.67లోని ప్లాట్‌ నంబర్‌1338లో నివసించే వి.కృష్ణారెడ్డి (85)కి జూబ్లీహిల్స్‌ చౌరస్తాలోని యూనియన్‌ బ్యాంకు (ఆంధ్రా బ్యాంకు)లో లాకర్‌ ఖాతా ఉంది. కొంత నగదు తీసుకోవడానికి సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఆయన బ్యాంకుకు వచ్చారు. లాకర్‌ తెరిచి డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. బ్యాంకు వేళలు ముగియడంతో లాకర్‌ గదిలో ఖాతాదారు ఉన్న విషయాన్ని మరిచిన సిబ్బంది సాయంత్రం 5.30 గంటలకు లాకర్‌ గదికి, బ్యాంకుకు తాళాలు వేసి వెళ్లిపోయారు.

తలుపులు వేసిన శబ్దం కూడా వినిపించకపోవడంతో ఇంకా బ్యాంకు సేవలు కొనసాగుతున్నాయని కృష్ణారెడ్డి భావించారు. కొద్దిసేపటి తర్వాత విషయాన్ని గుర్తించి అరిచినా ఫలితం లేకుండాపోయింది. ఇంటి వద్దే ఫోన్‌ మరిచిరావడంతో ఫోన్‌ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది.  

మిస్సింగ్‌ కేసుగా నమోదు..  
రాత్రి అవుతున్నా తండ్రి ఇంటికి రాకపోయేసరికి కృష్ణారెడ్డి కుమారుడు సందీప్‌ రెడ్డి అన్ని ప్రాంతాలు గాలించి చివరికి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఇంటి నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులోని పెట్రోల్‌బంక్‌ వరకు కృష్ణారెడ్డి నడుచుకుంటూ వెళ్లిన ఫుటేజీ కనిపించింది. ఆ తర్వాత సీసీ కెమెరాలు పనిచేయలేదు. దీంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా, సీసీ టీవీ ఫుటేజీలను జల్లెడ పట్టినా ఫలితం లేకపోయింది.  

చివరకు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బ్యాంకు వద్ద సీసీ కెమెరాలను పరిశీలించగా.. కృష్ణారెడ్డి బ్యాంకు లోపలికి వచ్చి, లాకర్‌గదిలోకి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. బయటికి వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు బ్యాంకు సిబ్బందిని అప్రమత్తం చేసి 10.40 గంటలకు లాకర్‌ గది తెరిచి చూడగా కృష్ణారెడ్డి వణికిపోతూ, చెమటలతో కుప్పకూలి కనిపించారు. పోలీసులు, బ్యాంకు సిబ్బంది వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో బ్యాంకు సిబ్బందిపై ఐపీసీ సెక్షన్‌ 336, 342ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.     

బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం..  
ప్రతిరోజూ సాయంత్రం బ్యాంకు వేళలు ముగిసిన తర్వాత లాకర్‌గదితో పాటు ప్రాంగణం మొత్తం పరిశీలించాకే తాళాలు వేయాల్సి ఉంటుంది. ఇంటికి వెళ్లాలనే తొందరలో సిబ్బంది సోమవారం తనిఖీలు చేపట్టలేదు. ఈ ఘటనలో తమ నిర్లక్ష్యం ఉందని బ్యాంకు మేనేజర్‌ మురళీ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లాకర్‌ గది తాళాలు మేనేజర్‌ వేయాల్సి ఉంటుంది. ఆ సమయానికి ఆయన లేకపోవడంతో అసిస్టెంట్‌ మేనేజర్‌ రాధ తాళాలు వేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top