
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కారు నెమ్మదిగా నడపమని చెప్పినందుకు ఇంటిపై దాడిచేసిన ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రం ఇందిరానగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్ ప్రాంతంలో రోడ్డుపై వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. అధే కాలనీకి చెందిన ఒక యువకుడు కారును వేగంగా నడుపుతూ మండపాన్ని ఢీకొట్టాడు.
అక్కడున్న వారు నెమ్మదిగా కారు నడపాలని చిన్న పిల్లలు రోడ్డుపై తిరుగుతుంటారని అతడిపై మండిపడ్డారు. కోపోద్రుక్తుడైన సదరు యువకుడు మరో 20 మంది యువకులను వెంట తీసుకువచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోని వస్తువులు చిందరవందర చేయడమే కాకుండా అడ్డువచ్చిన మహిళలపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలసుకున్న ఎస్సై ఉపేంద్ర చారి బాధిత కుటుంబం వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. తప్పు చేసిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.