
జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, సీపీ తదితరులకు చోటు
ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలన్న మంత్రి పొన్నం
గుల్జార్ హౌస్‌లో భవనం పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం
మొత్తం 14 ఏసీలు ఉన్నట్లు గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: గుల్జార్ హౌస్ అగ్నిప్రమా దం ఘటనపై సమగ్ర విచారణ కోసం ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నెల 18న ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై విచారణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ విభాగం డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ , టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌లతో కూడిన కమిటీని నియమించినట్లు మంత్రి తెలిపారు.
ఘటనకు గల కారణాలు, ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై సీఎంకు కమిటీ సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయి లో ప్రజలకు ఇవ్వాల్సిన సూచనలతో ప్రతిపాదనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం దాని ఆధారంగా సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులు సమీక్ష చేసి చర్యలు చేపడతారని తెలిపారు.
ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలన
చార్మినార్: అగ్ని ప్రమాదం సంభవించిన భవనాన్ని మంగళవారం క్లూస్, ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించింది. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా భవనంలో ప్రవేశించిన అధికారుల బృందం.. భారీ స్థాయిలో అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలతో పాటు భవనంలోని ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసింది. భవనంలో దాదాపు 14 ఏసీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గాలి, వెలుతురు సక్రమంగా లేకుండా ఏసీలు పనిచేస్తుండడంతో అవి అధిక ఒత్తిడికి గురైనట్లు భావిస్తున్నారు. అధిక ఒత్తిడి కారణంగా ఏసీ కంప్రెషర్ ఏదైనా పేలిపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
ఫ్లోరింగ్ ధ్వంసం.. గోడలన్నీ బీటలు
బయటకు వెళ్లేందుకు సొరంగం లాంటి ఇరుకు మెట్ల దారి ఉండడం వల్లే బాధితులు ప్రమాదం నుంచి బయట పడలేకపోయారని అధికారులు నిర్ధారించారు. తీవ్రమైన మంటలకు గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. గదుల గోడలన్నీ బీటలు వారాయి. షాబాద్ ఫ్లోరింగ్ పూర్తిగా ధ్వంసం అయింది. భవనం మొత్తం పనికిరాని విధంగా తయారయ్యింది.
రాబోయే రోజుల్లో నివాసానికి పనికి రాదని ఫోరెన్సిక్ నిపుణుల బృందం నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలు 125 ఏళ్లకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నట్లు విచారణలో తేలింది. కాగా భవనం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. మృతులకు సంబంధించిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.