
నీట్ కౌన్సెలింగ్‌కు ఆ విద్యార్థులను అనుమతించాలి
కాళోజీ వర్సిటీకి హైకోర్టు ఆదేశం
తుది ఉత్తర్వుల మేరకే సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టీకరణ.. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ‘స్థానికత’కు సంబంధించిన నాలుగేళ్ల నిబంధనను పక్కకు పెట్టి నీట్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులను అనుమతించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. 2025 సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సులకు అనుమతి ఇవ్వాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాము ఇచ్చే తుది ఉత్తర్వుల మేరకే సీట్ల కేటాయింపు ఉంటుందని విద్యార్థులకు స్పష్టం చేసింది.
తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. స్థానికతకు సంబంధించి మెడికల్, డెంటల్ కోర్సుల అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ గతేడాది జూలై 19న ప్రభుత్వం జీవో 33ను జారీ చేసిన విషయం తెలిసిందే. నీట్‌కు ముందు తెలంగాణలో వరుసగా నాలుగేళ్లు చదివి ఉండాలన్నది నిబంధన. కాగా ఈసారి కౌన్సెలింగ్‌లో కూడా ఇదే జీవో అమలు చేస్తుండటాన్ని పలువురు నీట్ అభ్యర్థులు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ శామ్‌కోషి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నట్లే..
విద్యార్థుల తరఫున సీనియర్ న్యాయవాది బి.మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘2025 జూలై 15న అడ్మిషన్ల నోటిఫికేషన్ సందర్భంగా ఈ నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. అయితే నివాస ధ్రువీకరణ పత్రాలున్న శాశ్వత నివాసితులు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గత సంవత్సరం హైకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వును నిలిపివేసినప్పటికీ సంబంధిత గడువు ముగిసింది. అలాంటప్పుడు హైకోర్టు ఉత్తర్వు అమలులో ఉంటుంది.
పిటిషనర్లను దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలి..’అని కోరారు. కాగా ఈ అంశంపై సుప్రీంకోర్టు బుధవారమే విచారణ జరుపుతోందని వర్సిటీ న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుతానికి పిటిషనర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించాలని వర్సిటీని ఆదేశించింది. గత సంవత్సరం హైకోర్టు తీర్పు ప్రకారం వారిని రాష్ట్ర నివాసితులుగా నమోదు చేసుకోవడానికి అనుమతించాలని తెలిపింది. నాలుగేళ్లు తెలంగాణలో చదువుకోలేదనే కారణంతో వారి దరఖాస్తులను తిరస్కరించకూడదని స్పష్టం చేసింది.
గతేడాదీ ఇలాగే పిటిషన్లు..
గతేడాది కూడా ఇలాగే పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. నాలుగేళ్ల నిబంధనతో సంబంధం లేకుండా స్థానికతను ధ్రువీకరిస్తూ తహసీల్దార్ ఇచ్చే పత్రాన్ని అనుమతించాలని వర్సిటీని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అయితే విచారణ సందర్భంగా.. 134 మంది పిటిషనర్లు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే నివాస ధ్రువీకరణ పత్రం ఆధారంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. దీనికి అంగీకరించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేసింది.