సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. 2026 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ దాకా పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆయన మీడియాకు తెలిపారు.
ఫిబ్రవరి 3 నుండి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. పాత విధానంలో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంగ్లీష్‌లో ఉన్నట్లుగానే మిగతా భాషల్లోనూ ప్రాక్టీకల్స్ జరిపిస్తాం. అలాగే.. 12 ఏళ్ల తర్వాత ఇంటర్ సిలబస్‌లో మార్పులు జరగబోతున్నట్లు తెలిపారాయన. మ్యాథ్స్, ఫిజిక్స్ , కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సిలబస్ మారబోతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే..
ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు ప్రభుత్వ ఆమోదంతో నిర్వహిస్తున్నాం. నవంబర్ 1 నుండి పరీక్షల ఫీజులు ఆన్ లైన్ ద్వారా చెల్లించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. 12 సంవత్సరాల తర్వాత ఇంటర్ సిలబస్ లో మార్పులు చేస్తున్నాం. NCERT ప్రకారం సబ్జెక్టు కమిటీ సూచనల ప్రకారం మార్పు చేస్తున్నాం. సిలబస్ మార్పులో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు భాగస్వాములవుతారు. నలభై నుండి నలభై ఐదు రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాం. ఇంటర్ బోర్డు నిర్దేశించిన ప్రకారం డిసెంబరు 15 నాటికి సిలబస్ ను తెలుగు అకాడమీకి అందిస్తాం. నూతన సిలబస్ తోపాటు క్యూఆర్ కోడ్ ముద్రణ ఉంటుంది.. ఏప్రిల్ ఎండింగ్ లో కొత్త సిలబస్ బుక్స్ అందుబాటులోకి తెస్తాం అని అన్నారు.
ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషల్లో కూడా ఉంటాయి. ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు కూడా ఉంటాయి.2026 నుండి ACE గ్రూప్ ప్రారంభం అవుతుంది. అకౌంటెన్సీ గ్రూపు రూపకల్పన తదితర.అంశాలపై ప్రత్యేక కమిటీలను నియమిస్తున్నాం అని తెలిపారు.


