బలవంతంగా ఎల్‌ఆర్‌ఎస్‌ వద్దు

High Court Closes All Petitions Relating To LRS BRS - Sakshi

హైకోర్టు స్పష్టీకరణ..

బీఆర్‌ఎస్‌పై మధ్యంతర ఉత్తర్వులే కొనసాగుతాయని వెల్లడి

పది పిటిషన్లపై ముగిసిన విచారణ

సాక్షి, హైదరాబాద్‌: అనుమతి లేని భవనాల క్రమబద్ధీకరణ (బీఆర్‌ఎస్‌), అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) పథకాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో... ఇదే అంశంపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాలకు సంబంధించి జీవో 131, 152లను సవాల్‌ చేస్తూ సామాజిక కార్యకర్త జువ్వాడి సాగర్‌రావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు గత ఏడాది విచారణకు స్వీకరించి అన్ని రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ఈ వివాదం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున ఇక్కడ విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

ఈ క్రమంలో బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించి జారీచేసిన జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన 10 పిటిషన్లపై విచారణను ముగించింది. అయితే బీఆర్‌ఎస్‌ పథకంలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులపై ఎటువంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకూ కొనసాగుతాయని స్పష్టం చేసింది. అలాగే ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు చేపట్టరాదంటూ గత జనవరిలో ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది.

ఇదిలా ఉండగా గత సెప్టెంబరులో రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం జారీచేసిన మెమోను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పైనా ధర్మాసనం విచారణను ముగించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఎటువంటి పిటిషన్‌ దాఖలు కాలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నివేదించారు. అయితే బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో భాగంగానే రిజిస్ట్రేషన్లు నిలిపివేసిందని, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అభ్యంతరం ఉంటే మళ్లీ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top