
మాజీ నక్సల్ భార్యకు భూమి ఇవ్వని కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: పీపుల్స్‌వార్ గ్రూప్ మాజీ దళసభ్యుడు నాగవెళ్లి మోహన్ భార్య అరుణకు భూమి ఇస్తారా.. లేదా వ్యక్తిగతంగా మా ముందు హాజరై వివరణ ఇస్తారా అని మెదక్ జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంపై తీవ్రంగా పరిగణించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేస్తూ.. ఆలోగా కౌంటర్ దాఖలు చేయకపోతే తమ ముందు హాజరు కావాలని కలెక్టర్‌ను ఆదేశించింది.
16ఏళ్లుఅండర్‌గ్రౌండ్‌లో ఉండి, పీపుల్స్‌వార్ దళ కమాండర్ హోదాకు ఎదిగిన మోహన్‌కు.. 5 ఎకరాల కేటాయింపుతో సహా పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో 1989లో లొంగిపోయాడు. ఇదే క్రమంలో లొంగిపోయిన తీవ్రవాదుల ఉపశమనం కోసం 1993లో ప్రభుత్వం ప్రత్యేక పాలసీని రూపొందించింది. నిఘా విభాగం మెదక్ జిల్లాలో అతనికి భూమి కేటాయించాలని 1999లో సిఫారసు చేయగా, జిల్లా స్థాయి కమిటీ కూడా ఆమోదించింది.
సదాశివపేటలో కొంత భూమిని కేటాయింపు కోసం గుర్తించారు. ఈలోపే పోలీసులకు సహకరిస్తున్నారని మోహన్‌ను నక్సలైట్లు చంపేశారు. తర్వాత ఆ భూమిని అతని భార్య నాగవెల్లి అరుణకు కేటాయించాలని 2004లో కలెక్టర్ సిఫారసు చేశారు. ప్రజ్ఞాపూర్‌లో ఎకరం స్థలం కేటాయించారు. ఇది పట్టా భూమి అని కొందరు కోర్టుకు వెళ్లడంతో రద్దు చేశారు. దీంతో అరుణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కాజా శరత్ విచారణ చేపట్టారు.
పోలీసులకు సహకరించినందుకే హత్య..
పిటిషనర్ తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. 1989లో మోహన్ లొంగిపోగా, ఇప్పటివరకు భూమి కేటాయించకపోవడం సరికాదన్నారు. అరుణ దినసరి కూలీ అని, మానసిక వికలాంగుడైన కొడుకు కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు.
పోలీసులకు సహకరించినందుకే ఆమె భర్తను హత్య చేశారని గుర్తు చేశారు. వెంటనే అరుణకు భూమి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రెండు వారాలు సమయం ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేస్తామని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇదే చివరి అవకాశమని చెబుతూ, విచారణ వాయిదా వేశారు.