
నాడు లోటు.. నేడు 10% అధిక వర్షపాతం
ఐదు జిల్లాల్లో అత్యధికం, ఏడు జిల్లాల్లో అధికం
మిగిలిన 14 జిల్లాల్లో సాధారణ వర్షపాతం
ఇంకా ఏడు జిల్లాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతం
నెలాఖరుకల్లా సంతృప్తికర స్థాయికి వర్షపాత గణాంకాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. సీజన్ ప్రారంభం నుంచి రెండు నెలల పాటు నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఉన్న లోటు వర్షపాతం నుంచి క్రమంగా సాధారణ స్థాయికి గణాంకాలు పరుగులు పెడుతున్నాయి.
తాజా సీజన్‌లో ఈనెల 15వ తేదీ నాటికి రాష్ట్రంలో సగటున 46.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 50.92 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 10 శాతం అధికంగా నమోదైంది. గతవారం వరకు వర్షపాతం దాదాపు 30 శాతం వరకు లోటు నమోదు కాగా... వారం రోజులుగా రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదలడం, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో సాగుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.
⇒ వాయవ్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. దక్షిణ ఒడిశా, దానికి అనుకొని ఉన్న ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతానికి విస్తరించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది.
⇒ మరోవైపు బికనీర్, కోట, సియోని, రాయపూర్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. శనివారం దక్షిణ ప్రాంత జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది.
నెలాఖరు వరకు వానలు...
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు ప్రస్తుతం అత్యంత చురుగ్గా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభ సమయంతో పోలిస్తే ప్రస్తుతం బంగాళాఖాతంలో కూడా వర్షాలకు అనుకూల వాతావరణం ఉందని, దీంతో ఈ నెలాఖరు వరకు వివిధ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. నెలాఖరు కల్లా రాష్ట్రంలో నైరుతి సీజన్‌లో కురవాల్సిన సాధారణ వర్షపాతానికి గణాంకాలు చేరుకుంటాయని, ఆ తర్వాత వర్షాలు అదనంగా భావించొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
గత వారం రోజులుగా కురిసిన వర్షాలతో రాష్ట్రంలో లోటు ప్రభావం చాలావరకు తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షాలు నమోదు కాగా... ఏడు జిల్లాల్లో అధికం, 14 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. మరో ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది.
⇒ మండలాల వారీగా వర్షాల తీరును పరిశీలిస్తే... 90 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 185 మండలాల్లో అధిక వర్షపాతం, 255 మండలాల్లో సాధారణ వర్షపాతం, 91 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ నివేదిక చెబుతోంది.
⇒ లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి. ఈ జిల్లాల్లో ఇప్పటివరకు నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం 10 శాతానికి పైబడి తక్కువ వర్షాలు నమోదయ్యాయి.
⇒ సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు: కుమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హనుమకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జనగామ, మేడ్చల్–మల్కాజిగిరి, ఖమ్మం, ములుగు. ఈ జిల్లాల్లో వర్షపాతం సాధారణం కంటే దాదాపు 20 శాతం వరకు అదనపు వర్షాలు కురిశాయి.