
ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో వర్షానికి నీట మునిగిన రోడ్డు
హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి భారీ వర్షం
అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 12.8 సెంటీమీటర్లు
ప్రధాన రోడ్లన్నీ జలమయం.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
నగరమంతా ట్రాఫిక్ జామ్.. వరద నీటిలో ముగ్గురు గల్లంతు
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి/ముషీరాబాద్: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ఆదివారం రాత్రి అతలాకుతలం చేసింది. దాదాపు గంటపాటు వాన దంచికొట్టడంతో ప్రధాన రహదారులన్నీ నదుల్లా మారాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. దాదాపు నగరం మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.
ఆదివారం సాయంత్రం వరకు వాతావరణం సాధారణంగానే ఉన్నా.. రాత్రి ఎనిమిది గంటల తర్వాత మొదలైన వాన గంటపాటు కుండపోతగా కురిసింది. రాత్రి పది గంటల వరకు అత్యధికంగా నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తట్టి అన్నారం, ముషీరాబాద్ బౌద్ధనగర్‌లలో 12 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి ద్విచక్ర వాహనదారులు ఫ్లైఓవర్ల కింద తలదాచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్లు, ఆటోలు, బైక్‌లు నీటిలో కొట్టుకుపోయాయి.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,పంజాగుట్ట, అమీర్ పేట, ముషీరాబాద్, తార్నాక, లక్డీకాపూల్, కాచిగూడ, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయింది. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రధాన రహదారులపై నిలిచిన వర్షపు నీరు నాలాల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. కాగా, ఆదివారం రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో 24.3 సెంటీమీటర్లు నమోదైంది.
అఫ్జల్‌సాగర్ నాలాలో మామా అల్లుళ్లు గల్లంతు
భారీ వర్షానికి అఫ్జల్‌సాగర్ నాలా పొంగి ప్రవహించింది. ఈ నాలాలో మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్ (26), రాము (25) అనే యువకులు కొట్టుకుపోయారు. వీరిద్దరూ మామా అల్లుళ్లుగా తెలిసింది. వీరికోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. అర్జున్, రాము ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు అఫ్జల్‌సాగర్ నాలా ప్రక్కనే ఉండటంతో ఇంట్లోకి వర్షపు నీరు చేరింది.
ఇంట్లోని సామాన్లు బయటకు తెచ్చే క్రమంలో రాము అదుపు తప్పి నాలాలో పడ్డాడు. అతడిని కాపాడే క్రమంలో అర్జున్ కూడా నాలాలో పడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అక్కడికి చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్‌లో నాలాలో దినేశ్ (సన్నీ) అనే యువకుడు గల్లంతయ్యాడు.
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే వినోబా నగర్‌కు చెందిన దినేశ్ (24) విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వచ్చే క్రమంలో నాలాలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో తన వాహనాన్ని ఆపి అక్కడ ఉన్న గోడ పక్కన నిలుచున్నాడు. ఇదే సమయంలో గోడ కూలడంతో దినేశ్ బైక్‌తోపాటు నాలాలో పడి కొట్టుకుపోయాడు. దినేశ్‌కు భార్య రాజశ్రీ, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. దినేశ్ కోసం ముషీరాబాద్ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.