
హైదరాబాద్: మహా నగరాన్ని వరుణుడు పగబట్టినట్లే ఉన్నాడు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమవుతోంది. చినుకు చినుకుగా మొదలైన వాన.. భారీ వర్షంగా మారడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాసేపు విరామం ఇచ్చి హమ్మయ్యా అనుకునేలోపే మళ్లీ నగరంలోని ఏదో మూలన భారీ వర్షం మొదలవుతోంది.

శనివారం(ఆగస్టు 9వ తేదీ) రాత్రి సమయంలో నగరాన్ని భారీ వర్షం ముంచెత్తగా, ఆదివారం(ఆగస్టు 10వ తేదీ) మధ్యాహ్న సమయానికే మళ్లీ భారీ వర్షం మొదలైంది. ఉప్పల్, రామాంతపూర్, బోడుప్పల్‌లో భారీ వర్షం కురుస్తోంది. పీర్జాదిగూడ, మేడిపల్లి సహా పలు చోట్లు భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా ఉప్పల్‌లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
