‘వ్యాక్సిన్‌’ స్పెషలిస్ట్.. నాడు, నేడు ఆయనదే కీలక పాత్ర

Health Minister Dr Harsh Vardhan Rare Achievement - Sakshi

కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ అరుదైన ఘనత

నాడు పోలియో, నేడు కోవిడ్‌ వ్యాక్సిన్‌ల పంపిణీలో కీలకపాత్ర

దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమైన పక్షం రోజుల్లోనే 35 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందింది. అగ్రరాజ్యం అమెరికా మొదలు యూకే వరకు నేటికీ కోవిడ్‌ కోరల్లో చిక్కి విలవిల్లాడుతుంటే భారత్‌ మాత్రం సురక్షితమైన, చవకైన టీకాను ప్రపంచం ముందుకు తేవడమే కాకుండా పేద దేశాలకు ఉచితంగా లక్షల డోసులు అందించి స్నేహ హస్తం చాచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి మొదలు ఎన్నో దేశాలు మన ఘనతను పొగుడుతున్నాయి. దీని వెనుక ఓ వ్యక్తి నిరంతర శ్రమ దాగి ఉంది.

►‘నిండు జీవితానికి రెండే చుక్కలు’.. పల్స్‌ పోలియో కార్యక్రమ నినాదం ఇది. ఆ రెండు చుక్కలే మన దేశం నుంచి పోలియోను తరిమేశాయి. 

►ఈ విజయగాథ వెనుక ఓ వ్యక్తి పట్టుదల ఉంది. ఈ రెండు క్లిష్ట పరిస్థితుల్లోనూ వైరస్‌లపై పోరును వెనుక నుంచి నడిపించిన వ్యక్తి ఒక్కరే.. ఆయనే డాక్టర్‌ హర్షవర్ధన్‌. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి. అందుకే కరోనా టీకా పంపిణీ ప్రణాళిక అమలు బాధ్యతను ప్రధాని మోదీ ఆయన భుజాలపై పెట్టారు. హర్షవర్ధన్‌పై మోదీకి నమ్మకం కుదరడానికి కారణం ఆ ‘రెండు చుక్కల’ విజయగాథే.

సాక్షి, హైదరాబాద్‌: అది 1988 సంవత్సరం. దేశంలో సగటున నిత్యం 450 మంది చిన్నారులు పోలియో బారిన పడుతున్న సమయం. వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ సైతం భారత్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కాలం. భారత్‌లో ఐదేళ్లలోపు వయసున్న దాదాపు 17 కోట్ల మంది పిల్లలు పోలియో బారిన పడకుండా కాపాడటం సాధ్యం కాదేమోనని, ప్రపంచంలో పోలియోను నిర్మూలించే చిట్టచివరి దేశం భారతే కావచ్చేమోనని అనుమాన పడిన సందర్భం. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్‌ పోలియోను అరికట్టగలిగింది. భారత్‌ను పోలియోరహిత దేశం గా 2014లో మార్చి 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 1988–2011 మధ్య ఆ మార్పు ఎలా వచ్చింది? ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఈ అద్భుతం ఎలా జరిగింది? 

ఒక్కడి ఆలోచనతో ముందడుగు 
దేశంలో 1994 నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న పోలియో కేసుల్లో 60 శాతం మన దేశంలోనే వెలుగుచూసేవి. ఐరోపా దేశాలు క్రమంగా పోలియో నుంచి విముక్తి పొందుతుండగా భారత్‌లో మాత్రం పోలియో నిర్మూలన దాదాపు అసాధ్యమన్న తరహాలో పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా అదే సమయంలో అప్పటి కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీతోపాటు ఐదు రాష్ట్రాల్లో ఆగస్టు–అక్టోబర్‌ మధ్య ప్లేగు వ్యాధి సైతం ప్రబలింది. అంత క్లిష్ట పరిస్థితుల్లో ఢిల్లీ వైద్య మంత్రిగా డాక్టర్‌ హర్షవర్ధన్‌ బాధ్యతలు చేపట్టారు. వెంటనే కార్యక్షేత్రంలోకి దిగిన ఆయన పోలియో నిర్మూలన కోసం ఢిల్లీలో తొలిసారి సామూహిక పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు గాంధీ జయంతిగా జరుపుకొనే అక్టోబర్‌ 2ను ముహూర్తంగా ఖరారు చేశారు. అయితే ఈ కార్యక్రమంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పెదవి విరిచింది. ఈ ప్రయోగం ఆశించినంత విజయవంతం కాదని, ప్లేగు వ్యాధి ప్రబలుతున్నందున మరికొంత సమయం తీసుకొని కొత్త తేదీని నిర్ణయించాలని సూచించింది. కానీ హర్షవర్ధన్‌ పట్టు వీడలేదు. 

స్కూలు పిల్లలకు వినూత్న హోంవర్క్‌... 
ఈ కార్యక్రమం అమలు కోసం డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఢిల్లీలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఓ వినూత్న హోం వర్క్‌ అప్పగించారు. ఒక్కో విద్యార్థి తన ఇంటి పరిసరాల్లో ఐదేళ్లలోపు ఉన్న 10 మంది చిన్నారుల వివరాలు సేకరించి ఉపాధ్యాయులకు అప్పగించడంతోపాటు ఆ పిల్లలను వారి తల్లిదండ్రులు పోలియో కేంద్రాలకు తీసుకొచ్చేలా చైతన్యపరచే బాధ్యత అప్పగించారు. అధికారుల ద్వారా ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుల ద్వారా పాఠశాల పిల్లలకు ఈ సమాచారం చేరింది. సెప్టెంబర్‌ 30కల్లా వివరాలు అందించాలన్నది హోంవర్క్‌. నిర్దేశించిన తేదీకన్నా ముందే ఢిల్లీ విద్యార్థులు ఉత్సాహంగా వివరాలు సేకరించి అందించారు. అంతే.. అక్టోబర్‌ 2న ఢిల్లీవ్యాప్తంగా ఒకేరోజు ఏకంగా 12 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు పడ్డాయి. ఇది ప్రపంచ రికార్డుగా నిలిచింది.

దీన్ని గుర్తించిన నాటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అంతూలే ఇదే నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. సరిగ్గా మరుసటి సంవత్సరం జాతీయ స్థాయి పల్స్‌ పోలియో రోజున ఢిల్లీ నమూనా అమలైంది. ఒకేరోజు 8.8 కోట్ల మందికి పోలియో వ్యాక్సిన్‌ అందింది. నాటి నుంచి ఏటా పల్స్‌ పోలియో కార్యక్రమం అమలవుతోంది. ఈ సంవత్సరంతో నైజీరియా లాంటి దేశాలు పోలియోరహితంగా మారగా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ లాంటి దేశాలు పోలియోతో ఇంకా పోరాడుతున్నాయి. 135 కోట్ల జనాభాతో కిటకిటలాడుతున్న మన దేశం పోలియోను తరిమికొట్టగలిగింది. ఇండియాలో ఇప్పట్లో పోలియో పోదు అని అంచనా వేసిన  ప్రపంచ ఆరోగ్య సంస్థ చివరకు ఆశ్చర్యపోయి డాక్టర్‌ హర్షవర్ధన్‌ను ‘పోలియో ఇరాడికేషన్‌ చాంపియన్‌’గా అభివర్ణించింది.

తలుచుకుంటే అద్భుతం మన చేతిలోనే...
మనపై మనకు చిన్నచూపు ఉంటుంది. కానీ, తలచుకుంటే అద్భుతాలు చేయగలం. కరోనా టీకా విషయంలో మనం విజయం సాధించాం. కానీ,అంతకుముందు పోలియో విషయంలో అద్భుతమే జరిగింది. ఆ అబ్బాయి మొహం నాకు ఇంకా గుర్తుంది. చుట్టుపక్కల 10 మంది ఐదేళ్లలోపు పిల్లల  వివరాలు తీసుకురావాలని హోంవర్క్‌ ఇస్తే అతను ఏకంగా 346 మంది పేర్లు తెచ్చాడు. అలాంటి వారి కృషితోనే ఆ ఘనత సాధ్యమైంది – ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ హర్షవర్ధన్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top