స్టడీ మెటీరియల్స్‌ దండగ | Groups Private Coaching Centres Giving Poor Quality Study Materials | Sakshi
Sakshi News home page

స్టడీ మెటీరియల్స్‌ దండగ

May 24 2022 12:54 AM | Updated on May 24 2022 8:58 AM

Groups Private Coaching Centres Giving Poor Quality Study Materials - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్స్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రైవేటు కోచింగ్‌ కేంద్రాలు సిఫార్సు చేస్తున్న స్టడీ మెటీరియల్స్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతలేని మెటీరియల్‌ను విద్యార్థులకు అంటగడుతున్నారని నిపుణుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మెటీరియల్‌తో లాభం కన్నా నష్టమే ఎక్కువని, క్లిష్టమైన ప్రశ్నలకు సమా ధానాలు రాయడం కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు.

మూస విధానంలో, షార్ట్‌ కట్‌ పద్ధతిలో మెటీరియల్స్‌ ఉంటున్నాయని చెబుతున్నారు. కొన్ని మెటీరియల్స్‌ అడ్డగోలుగా, తప్పులతడకగా ఉంటున్నాయని.. అకడమిక్‌ పాఠ్య పుస్తకాల్లో చదివిన దానికి, మెటీరియల్స్‌లో ఇచ్చే దానికి పోలిక ఉండటం లేదని, దీనిపై వివరణ అడిగినా కోచింగ్‌ సెంటర్స్‌ సరిగా స్పందించట్లేదని అభ్యర్థులు అంటున్నారు.  

అంటగట్టేస్తున్నారు.. 
గ్రూప్స్‌కు ఉన్న డిమాండ్, అభ్యర్థుల్లో ఆత్రుతను కోచింగ్‌ కేంద్రాలు సొమ్ము చేసుకుంటున్నాయి. వాటిని ఎవరు రాశారు, రచయిత ప్రొఫైల్‌ ఏంటి అనే విషయాలను వెల్లడించలేదు. చరిత్ర మెటీరియల్స్‌లో చారిత్రక తేదీలు కూడా తప్పుగా ఇస్తున్నారని, అభ్యర్థులు గుర్తించి చెబితే అచ్చు తప్పులని దాటేస్తున్నారని అంటున్నారు. కోచింగ్‌ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు ఎక్కడ మెటీరియల్‌ కొనాలో నిర్వాహకులు సూచిస్తున్నారని, ఇదంతా వ్యాపారంగా సాగుతోందని నిపుణులు అంటున్నారు.

డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అభ్యర్థులతో ముందే మాట్లాడుకుని, వారికి నెలకు కొంత ముట్టజెప్పి మెటీరియల్‌ రాయిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రూప్స్‌ ప్రకటన విడుదలైన మర్నాటి నుంచి ఈ ప్రక్రియ మొదలైందని, ఎక్కడా నిష్ణాతులైన అధ్యాపకులను ఎంపిక చేసుకోలేదనే వాదన వినిపిస్తోంది. ఒక్కో అభ్యర్థి కేవలం మెటీరియల్‌ కోసమే రూ. 7 వేల వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తోంది.  

అకాడమీ దగ్గర బారులు..
తెలుగు అకాడమీ స్టడీ మెటీరియల్‌లో నాణ్యత ఉందని, చాప్టర్లలో లోతైన విధానం కనిపిస్తోందని అన్ని వర్గాలు అంగీకరిస్తున్నా యి. నిష్ణాతులైన అధ్యాపకులతో గ్రూప్స్‌ సిలబస్‌ ప్రకారం మెటీరియల్‌ సిద్ధం చేయించినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. అయితే తగినవిధంగా పుస్తకాలు అందుబాటులో లేవు. మెటీరియల్‌ ముద్రణ, పంపిణీలో జరిగిన జాప్యమే దీనికి కారణమని అకాడమీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే  మెటీరియల్‌ విడుదలవగా విక్రయ కేంద్రం వద్ద అభ్యర్థులు బారులు తీరుతున్నారు.  

లాభాలే కొలమానంగా.. 
ప్రైవేటు కోచింగ్‌ కేంద్రాలు లాభాలే కొలమానంగా పనిచేస్తున్నాయి. అభ్యర్థులకు ఇచ్చే మెటీరియల్‌లో నాణ్యత కనిపించట్లేదు. ఇది వ్యాపారమైనప్పుడు నాణ్యత ఉంటుందని ఆశించడం కూడా సరికాదు. తెలుగు అకాడమీ లాభాపేక్ష లేకుండా పుస్తకాలు ముద్రిస్తుంది. కాబట్టి నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పని ఓపెన్‌ వర్సిటీ కూడా చేయాలి. అక్కడ అవసరమైన వనరులున్నాయి.  
– ప్రొఫెసర్‌ హరగోపాల్‌ (సామాజిక వేత్త) 

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు బెస్ట్‌ 
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివిన అభ్యర్థి గ్రూప్స్‌లో ఎలా ప్రశ్న వచ్చినా సమాధానం రాయగలడు. ప్రైవేటు స్టడీ మెటీరియల్‌ ఫాలో అయితే ప్రధాన పరీక్షలో తికమకపడటం ఖాయం. నాణ్యత కన్పించని ప్రైవేటు మెటీరియల్‌కు దూరంగా ఉండటమే మంచిది. 
– దండెబోయిన రవీందర్‌ (ఉస్మానియా వర్సిటీ వీసీ) 

డెప్త్‌ ఉండట్లేదు 
కోచింగ్‌ కేంద్రం వాళ్లు తాము చెప్పిన చోట మెటీరియల్‌ కొనాలని చెప్పారు. అకాడమీ మెటీరియల్‌కు, ప్రైవేటు స్టడీ మెటీరియల్‌కు అస్సలు పోలిక ఉండట్లేదు. లోతైన అవగాహన కనిపించట్లేదు. కొన్న తర్వాత గానీ ఈ విషయం తెలియట్లేదు. హిస్టరీలోనైతే సంఘటన తేదీలు కూడా తప్పుగా ముద్రించారు. చరిత్రలో వరుస సంఘటనల్లో కొన్ని తప్పించారు. దీంతో సబ్జెక్టు పూర్తిగా అర్థం కావట్లేదు.  
– సబ్బతి రమ్య (గ్రూప్స్‌ అభ్యర్థిని)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement