క్లీన్‌ టెక్నాలజీ కేరాఫ్‌ టీహబ్‌

Greater Tea Hub Attracting Startup Companies In Clean Technology - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌కు మణిహారం టీహబ్‌ ఇప్పుడు క్లీన్‌ టెక్నాలజీ రంగంలోని స్టార్టప్‌ కంపెనీలను ఆకర్షిస్తోంది. కెనడాకు చెందిన ప్రతిష్టాత్మక కెనడా డిజిటల్‌ మీడియా నెట్‌వర్క్‌తో(పబ్లిక్‌ప్రైవేట్‌ ఇన్నోవేషన్‌ హబ్‌)తో టీహబ్‌ గతంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఇప్పుడు సత్ఫలితాన్నిస్తోంది. కెనడాలో బయో టెక్నాలజీ, క్లీన్‌ టెక్నాలజీ, బిజినెస్‌టు బిజినెస్‌ తదితర రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న అంకుర పరిశ్రమలను నగరానికి ఆహ్వానించేందుకు కెనడియన్‌ డిజిటల్‌ మీడియా నెట్‌వర్క్‌ (సీడీఎంఎన్‌)కు అనుబంధంగా పనిచేస్తున్న 26 సంస్థలను టీహబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రిడ్జి ప్రోగ్రాంకు ఎంపిక చేసినట్లు టీహబ్‌ ప్రతినిధులు తెలిపారు.

ఆయా రంగాల్లో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, ఉత్పత్తుల సాధనే లక్ష్యంగా పనిచేసే సంస్థలకు భారత్‌లో మార్కెట్‌ అవకాశాలను చూపడంతోపాటు  పలు పరిశ్రమలకు చేయూతనందించేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని టీహబ్‌ వర్గాలు పేర్కొన్నాయి. కెనడా నుంచి మెరుగైన సాంకేతికతను పొందడంతోపాటు ఇక్కడి చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం, నూతన అంకుర పరిశ్రమలకు జీవం పోయడమే ధ్యేయమన్నారు. ప్రధానంగా నిలకడగల అభివృద్ధి సాధన,హెల్త్‌కేర్‌ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. నూతన అంకుర పరిశ్రమల రాకతో ఉద్యోగవకాశాలు పెరగడంతోపాటు.. కెనడా, భారత దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. కెనడాకు చెందిన కంపెనీలు టీహబ్‌ నుంచి కార్యకలాపాలు సాగించేందుకు కూడా అనువైన వాతావరణం ఏర్పాటు చేశామన్నారు.  

(చదవండి: ఫార్మా మహిళల భద్రతకు ‘షీ షటిల్స్‌’)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top