ఎక్కువ తక్కువ... గ్రాంట్లు | Grants-in-Aid: Centre discrimination towards Telangana continues | Sakshi
Sakshi News home page

ఎక్కువ తక్కువ... గ్రాంట్లు

Apr 13 2026 2:05 AM | Updated on Apr 13 2026 2:05 AM

Grants-in-Aid: Centre discrimination towards Telangana continues

గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధుల మంజూరులో రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష

తెలంగాణకు 11 నెలల కాలంలో ఇచ్చింది కేవలం రూ. 6వేల కోట్లే

యూపీకి రూ.27వేల కోట్లు... మధ్యప్రదేశ్‌కు రూ. 22వేల కోట్లు

అస్సాంకు తెలంగాణ కంటే ఏకంగా రూ.11వేల కోట్లు ఎక్కువ నిధులు

సాక్షి, హైదరాబాద్‌: గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌... కేంద్రం నుంచి వచ్చే ఈ నిధులను తిరిగి చెల్లించాల్సిన పని లేదు. ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకా లు, సంక్షేమం, లోటు పూడ్చుకోవడం, విపత్తుల నిర్వహణ, స్థానిక సంస్థలు, గిరిజన సంక్షేమం తదితర రంగాల కింద కేంద్రం నుంచి ఈ నిధులు రాష్ట్రాలకు వస్తాయి. ఈ నిధులు ఎంత ఎక్కువ వస్తే ఆ మేరకు రాష్ట్రానికి ఆర్థిక ఉపశమనం కలుగుతుంది. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో రాష్ట్రాలు కూడా వీలైనన్ని ఎక్కువ ఈ పద్దు కింద నిధులు కేంద్రం ఇవ్వాలని ఆశిస్తాయి. కానీ, ఈ ఆశలు తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలకు అడియాశలే అవుతున్నట్లు కం్రప్టోల ర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలు చెపుతున్నాయి.  

ఆ రెండింటితో సమానం 
గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధుల మంజూరులో కేంద్రం విచిత్ర వైఖరి అవలంబిస్తోందని అర్థమవుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విషయంలో పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలోని 11 నెలల కాలంలో (2025 ఏప్రిల్‌ నుంచి 2026 ఫిబ్రవరి వరకు) తెలంగాణకు ఈ పద్దు కింద వచ్చింది రూ. 6వేల కోట్లు మాత్రమే. అదే తరహాలో తమిళనాడుకు రూ.15వేల కోట్లు, కేరళకు రూ.4వేల కోట్లు, కర్ణాటకకు రూ.9వేల కోట్లు వచ్చాయి. ఇక, దక్షిణాదిలోని మొత్తం ఐదు రాష్ట్రాలకు కలిపినా రూ.50వేల కోట్లు దాటలేదు.

కానీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు కలిపి ఆ మేరకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులివ్వడం గమనార్హం. అంటే దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలతో సమానమైన నిధులు కేంద్రం కేవలం రెండు ఇతర రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చిందన్నమాట. అలాగే, దేశంలోని పలు రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాల కంటే ఎక్కువగా కేంద్ర సాయం అందుతోంది. తెలంగాణకు రూ.6వేల కోట్లు ఇచ్చిన కేంద్రం అదే స్థాయిలో జనాభా ఉన్న అస్సాం రాష్ట్రానికి పదిహేడు వేల కోట్లు ఇచ్చింది. అంటే తెలంగాణ కంటే ఏకంగా రూ.11 వేల కోట్లు ఎక్కువ సాయం చేసిందన్నమాట. 

ప్రతిపాదనలు కొండంత... ఇచ్చేది గోరంత 
కేంద్రం నుంచి వచ్చే సాయం కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయి. ఏటా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఎంత ఆశిస్తున్నామనే లెక్కలు వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పొందుపరుస్తాయి. అలా పొందుపరిచిన వాటిలో కనీసం సగం మేరకు కూడా చాలా రాష్ట్రాలకు దక్కడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్రం నుంచి రూ. 22,782.50 కోట్లు వస్తాయని తెలంగాణ ఆశించింది. కానీ, 11 నెలల కాలంలో ఢిల్లీ నుంచి వచ్చింది కేవలం రూ. 6,140.65 కోట్లు మాత్రమే. అంటే రాష్ట్రం ఆశించిన దాంట్లో కేంద్రం ఇచ్చింది కేవలం 27 శాతమే. దాదాపు పన్నెండేళ్లుగా ఇదే పరిస్థితి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు కూడా ఏళ్ల తరబడి ఇదే వివక్ష కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement