జీఎస్టీ.. వసూళ్లు భేష్‌ | Goods And Services Taxes Collection In Telangana Slowly Progress | Sakshi
Sakshi News home page

జీఎస్టీ.. వసూళ్లు భేష్‌

Jan 7 2021 1:49 AM | Updated on Jan 7 2021 8:01 AM

Goods And Services Taxes Collection In Telangana Slowly Progress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లలో రాష్ట్రం మెల్లిగా పురోగమన బాటపట్టింది. కరోనా దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ.32,671.62 కోట్ల జీఎస్టీ వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, కరోనా కారణంగా రాబడులు తగ్గి పోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం(2020, ఏప్రిల్‌) నుంచి సెప్టెంబర్‌ వరకు ఆరు నెలలపాటు జీఎస్టీ వసూళ్లు మందగించాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజల వినియోగ సామర్థ్యం తగ్గిపోవడం, ఆశించిన మేర వ్యాపారాలు లేకపోవడమే దీనికి కారణాలు. అయితే, సెప్టెంబర్‌ తర్వాత రిటర్నుల దాఖలు పెరగడం, మార్కెట్లు కూడా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావడంతో తొలిసారి గత ఏడాది అక్టోబర్‌లో జీఎస్టీ ఆదాయం రూ.3 వేల కోట్లు దాటింది. డిసెంబర్‌లో రూ.3,543 కోట్ల జీఎస్టీ రాబడులు రావడంతో ఈ రంగం గాడిలో పడిందని ఆర్థిక శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ, ఈ పురోగతి ఏయే రంగాల్లో జరిగిందన్న దానిపై వాణిజ్య పన్నుల శాఖ పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాల్సి ఉంది. 

ఔషధ రంగమే సింహభాగం..
ఈ ఏడాది జీఎస్టీ రాబడుల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఔషధ రంగంలో మంచి వృద్ధి కనిపిస్తోందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు శానిటైజర్లు, కరోనా టెస్టింగ్‌ కిట్‌లు, ఆక్సీమీటర్లు, బీపీ, షుగర్‌ తనిఖీ పరికరాలు, థర్మామీటర్లు, ఆవిరి పట్టే యంత్రాలు లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయని, ఇప్పుడు ఈ అమ్మకాలకు సంబంధించిన రిటర్నులన్నీ ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయని అంటున్నారు. వీటికితోడు ఎలక్ట్రానిక్స్‌ రంగం ఈ ఏడాది మంచి వృద్ధి సాధిస్తుందని కూడా తెలుస్తోంది. పాఠశాలలు నడవకపోవడంతో రాష్ట్రంలోని కోట్లాదిమంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులే శరణ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ల అమ్మకాలు కూడా భారీ స్థాయిలో పెరిగాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ప్రజారవాణా వ్యవస్థ కొన్నాళ్లపాటు పూర్తిగా స్తంభించిపోవడం, ఆ తర్వాత ప్రజారవాణాను వినియోగించుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వ్యక్తిగత వాహనాల కొనుగోలు పెరిగింది. ఈ నేపథ్యంలో గత ఆరుమాసాలుగా కార్లు, బైకులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని, వీటి రిటర్నులు కూడా భారీగానే దాఖలవుతున్నాయని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేసింది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకోవడంతో నిర్మాణ కార్యకలాపాలు కూడా మెరుగుపడ్డాయని, సిమెంటు, స్టీలు, హార్డ్‌వేర్‌ వినియోగం పెరిగిందని, ధరలు కూడా అదేస్థాయిలో పెరగడంతో పన్నులు ఎక్కువగా వస్తున్నాయని ఆ శాఖ అధికారులు అంటున్నారు.

లాక్‌డౌన్‌ కాలంలో ఆన్‌లైన్‌ కొనుగోళ్లే ఎక్కువగా జరిగాయని, పన్ను ఎగవేతకు అవకాశం లేకుండా పోయిందని, అందుకే మూడు నెలలుగా జీఎస్టీ రిటర్నుల లావాదేవీల సంఖ్య కూడా పెరుగుతోందని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కిచెన్‌ వస్తువుల అమ్మకాల్లో కూడా గణనీయ వృద్ధి కనిపిస్తోందని తెలుస్తోంది. ఐటీ సర్వీసులు, బంగారం అమ్మకాల్లో పెద్దగా వృద్ధి లేకపోయినా ఆయా రంగాలు స్థిరంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలల్లో జీఎస్టీ రాబడులు మరింత పుంజుకుంటాయని, రూ.25 వేల కోట్ల వరకు ఈ ఆదాయం వచ్చే అవకాశం ఉందని వాణిజ్య పన్నుల అధికారులు వెల్లడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement