సర్కారు కొలువుకు ఉచిత శిక్షణ

Free Training Of Constable For Intermediate Completed Students - Sakshi

సాక్షి, సిద్దిపేట : సర్కార్‌ ఉద్యోగం సాధిస్తే జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. అందులోనూ పోలీస్‌ ఉద్యోగమంటే యువతకు ఎంతో క్రేజీ. ఇంటర్మీడియట్‌ పూర్తి కాగానే కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది.  ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్‌ పూర్తి చేసుకున్న, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పోలీస్‌ కానిస్టేబుల్‌ శిక్షణను అందించాలని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలు కోసం జిల్లా కేంద్రాల్లోని జూనియర్‌ కళాశాలలను ఎంపిక చేసింది. టీశాట్, సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్, విద్యాహెల్ప్‌ లైన్ల సహకారంతో నిర్వహించనున్న ఈ శిక్షణకు పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(పీటీసీ)గా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ బాలుర కళాశాలలో పీటీసీని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్‌ కోఆర్డినేటర్‌గా వ్యవహరించగా అందులో పనిచేస్తున్న ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్స్, స్టూడెంట్‌ కౌన్సిలర్లు శిక్షణలో భాగస్వాములు కానున్నారు.  

చక్కని స్పందన 
ఇంటర్‌ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ శిక్షణకు జిల్లాలోని విద్యార్థుల నుంచి చక్కని స్పందన లభిస్తుంది. 100మంది విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణను అందించాల్సి ఉంటుంది.  జిల్లాలోని   అన్ని  ప్రభుత్వ  కళాశాలల్లో ఇంటర్‌ పూర్తి చేసిన, ద్వితీయ సంవత్సరం చదువుతున్న అర్హులైన విద్యార్థులతో పాటు మోడల్‌ స్కూల్స్, రెసిడెన్సియల్‌  కళాశాలల్లో  చదివిన విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 20 పోలీస్‌ ట్రైనింగ్‌ శిక్షణా కేంద్రాల్లో సిద్దిపేట జిల్లా నుంచి ఉత్తమ స్పందన లభించినట్లు తెలుస్తుంది. మొత్తంగా 300లకు పైగా విద్యార్థులకు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు.  

అర్హతలు 
అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారై ఉండాలి. వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.  పురుషులు 167.5 సెం. మీ ఎత్తు, చాతి 86.3 సె.మీతో పాటు గాలి పీల్చినపుడు అదనంగా 3 సెం. మీలు ఉండాలి. మహిళలు 156.7 సెం. మీ ఎత్తు, 80 సెం.మీ చాతి గాలిపీల్చినపుడు 3 సె.మీ అదనంగా కలిగి ఉండాలి.  

నేడే ఎంపికలు 
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గురువారం ఉదయం 10 గంటల నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో శారీరక ధృడత్వ పరీక్షలను నిర్వహించి ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు తమ టెన్త్, ఇంటర్, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.  ఇందుకోసం మున్సిపల్‌ శాఖ సహకారంతో మైదానాన్ని శుభ్రం చేశారు. ఎంపికల కోసం పోలీసు శాఖ సహకారాన్ని తీసుకుని అభ్యర్థుల చాతి విస్తీర్ణం, ఎత్తు, బరువులను కొలవనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకానికి అవసరమైన శిక్షణను త్వరలోనే ప్రారంభించనున్నారు.   

శిక్షణ  
ఉదయం 6 నుంచి 7గంటల వరకు ఫిజికల్‌ ప్రాక్టీస్‌ ఉంటుంది. అనంతరం తరగతులను నిర్వహించి సిలబస్‌లోని అంశాలను వివరిస్తారు. రోజువారి క్యాలెండర్‌ను రూపొందించి తరగతులను నిర్వహిస్తారు. అధ్యాపకులు, పోలీస్‌శాఖ వారిచే స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలను ఇప్పిస్తారు. దాతలు సహకరిస్తే ట్రాక్‌షూట్, టీషర్ట్‌లతో పాటు స్టడీ మెటీరియల్‌ను అందించే ప్రయత్నం చేస్తున్నారు. పక్షం రోజులకోసారి గెస్ట్‌ లెక్చర్లతో ఉపన్యాసాలు ఉంటాయి. సిలబస్‌ పూర్తయ్యేంత వరకు లేదా త్వరలో ప్రభుత్వం పోలీస్‌ కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ వచ్చే వరకు శిక్షణను అందించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top