విషాదం మిగిల్చిన ఈత సరదా

Four Youth Die While Swimming In Kotepally Reservoir Vikarabad - Sakshi

కోట్‌పల్లి ప్రాజెక్టులో మునిగి నలుగురి మృతి 

వికారాబాద్‌ జిల్లా ధారూర్‌లో ఘటన 

ధారూరు: ఈత సరదా విషాదంగా మారింది. నలుగురు వ్యక్తులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. పండుగ వేళ విషాదం నింపిన ఈ ఘటన సోమవారం వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం కోట్‌పల్లిలో చోటుచేసుకుంది. సీఐ అప్పయ్య కథనం ప్రకారం.. పూడూర్‌ మండలం మన్నెగూడకు చెందిన బాయికని పెంటయ్య కుమారులు లోకేశ్‌ (28), వెంకటేశ్‌(25), వీరి బాబాయి బుచ్చయ్య కొడుకు జగదీశ్‌(24), మేనత్త కొడుకు రాజేశ్‌ (24).. తమ కుటుంబ సభ్యులైన మరో 9 మందితో కలసి కోట్‌పల్లి ప్రాజెక్టుకు వచ్చారు. అక్కడి పరిసరాలను, అడవి అందాలను వీక్షించారు.

అనంతరం సేదతీరేందుకు నీటి ఒడ్డుకు చేరుకున్నారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్న సమయంలో ఈత వచ్చిన లోకేశ్, జగదీశ్‌ నీటిలోకి దిగారు. వీరిని చూసి వెంకటేశ్, రాజేశ్‌ కూడా నడుములోతు వరకు వెళ్లి నీటిలో ఆడుకోవడం ప్రారంభించారు. కాగా, లోకేశ్, జగదీశ్‌ జలాశయంలో కొద్ది దూరంలో ఉన్న బండరాయి వద్దకు వెళ్లి వెనుదిరుగుతున్న సమయంలో ఈతరాని వెంకటేశ్, రాజేశ్‌లు వీరికి ఎదు రుగా వెళ్లేందుకు ప్రయత్నించి నీటిలో ముని గారు.

వీరిని కాపాడేందుకు లోకేశ్, జగదీశ్‌లు ఒక్కొక్కరిని పట్టుకున్నారు. అయితే ఆందోళనకు గురైన వెంకటేశ్, రాజేశ్‌ వారిని గట్టిగా పట్టుకుని ఈత కొట్టే వీలులేకుండా చేశారు. దీంతో నలుగురూ నీటిలో మునిగిపోయారు. దీంతో ఒడ్డున ఉన్న ఇతర కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేయడంతో కొద్ది దూరంలో ఉన్న బోటింగ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిలో మునిగిన వారి కోసం గాలించారు.

అయితే అప్పటికే వారు మరణించడంతో మృతదేహాలను బయటకు తీశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బుచ్చయ్య కొడుకు జగదీశ్‌ స్వగ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నాడు. లోకేశ్‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వెంకటేశ్, రాజేశ్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. లోకేశ్, వెంకటేశ్, రాజేశ్‌ తమ కుటుంబాలతో హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. సంక్రాంతి పండుగ కోసం వీరంతా సొంతూరు మన్నెగూడకు వచ్చారు.  

(చదవండి: కి‘లేడీ’ ప్లాన్‌.. హోం డెలివరీ పేరిట మహిళ హనీ ట్రాప్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top