వివాదంగా మారిన వరద సహాయం

Flood Victims Unhappy With Financial Assistance In Hyderabad - Sakshi

అనర్హులకు పరిహారమా?

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వరద సహాయం వివాదంగా మారుతోంది. ఇటీవలి వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలు, వాటిల్లిన నష్టం అంచనాలు, బాధితులకు ప్రస్తుతం పంపిణీ చేస్తున్న నష్ట పరిహారంలో తేడాలు పలు అనుమానాలకు  తావిస్తున్నాయి. వరద నీటితో నష్టపోయిన వారికి కాకుండా అనర్హులకు ఇచ్చారని, మునిగిపోయిన తమను పక్కన పెట్టారంటూ గురువారం గడ్డిఅన్నారం, చంపాపేట, ఉప్పల్, రామంతాపూర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, రాంనగర్‌ సహా కంటోన్మెంట్‌లోని 4, 5 డివిజన్లలో ప్రజలు ఆందోళనకు దిగారు. చంపాపేట, పురానాపూల్‌ పార్థివాడలో కార్పొరేటర్లను చుట్టుముట్టారు. మున్సిపల్‌ అధికారులను నిర్బంధించారు. ఉప్పల్‌లో మున్సిపల్‌ కార్యాలయంలో ఎదుటే భోజనాలు చేసి ఆందోళనకు దిగారు.  

ముంపునకు గురైతే పదివేలు..కాకుంటే ఐదువేలు 
మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో ముంపు బాధితులకు అందజేస్తున్న నగదు పరిహారం అపహాస్యంగా మారింది. అందుకున్నోడు అదృష్టవంతుడిగా మారుతున్నాడు. సర్కిల్‌ పరిధిలోని నేరేడ్‌మెట్, వినాయకనగర్, మౌలాలి, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్, మల్కాజిగిరి, గౌతంనగర్‌ డివిజన్లలో సుమారు 33397 ఇళ్లకు నష్టపరిహారం అందించడానికి ప్రాథమికంగా గుర్తించారు. నేరేడ్‌మెట్‌లో 5126, వినాయకనగర్‌ డివిజన్‌లో 2720, మౌలాలి డివిజన్‌లో 5612, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్‌లో 8944, మల్కాజిగిరి డివిజన్‌లో 5173, గౌతంనగర్‌ డివిజన్‌లో 5732 మంది బాధితులకు సుమారు రూ.33 కోట్లు అందజేయడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. పంపిణీ పర్యవేక్షణకు సర్కిల్‌లోని వివిధ విభాగాల అధికారులను పర్యవేక్షకులుగా నియమించారు. గురువారం వరకు సుమారు రూ.14 కోట్లు పంపిణీ చేశారు.

పంపిణీలో పదనిసలు.. 
అధికారులు పంపిణీకి సిద్ధం చేసిన జాబితాపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా, కార్పొరేటర్లు, నాయకులకు చెప్పిన ప్రాంతాలను సైతం జాబితాలో చేర్చారు. ముంపు బాధితుల్లో ఎక్కువ మందికి నగదు సాయం అందుతున్నా కొన్ని ప్రాంతాల్లో అందడం లేదు. ముంపునకు గురికాని ప్రాంతాల్లో సైతం నగదు పంపిణీ చేశారు. కొన్ని డివిజన్లలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు వ్యవహారం తలనొప్పింగా మారింది. నగదు పంపిణీ అయిన తర్వాత డబ్బులు వసూలు చేస్తుండంతో ఇటీవల ఎమ్మెల్యే మౌలాలి డివిజన్‌లో ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అయినా నాయకుల తీరు మారడం లేదు. వినాయకనగర్‌ డివిజన్, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్లలో కూడా అదే పరిస్థితి నెలకొంది. బాధితులకు అందజేసిన పరిహారంలో కొంత మొత్తాన్ని వసూళ్లు చేస్తున్నారు. ముంపునకు గురికాని ప్రాంతాల్లో రూ.5వేలు పంపిణీ చేస్తున్నారు. అధికారుల తీరు మల్కాజిగిరిలో అధ్వానంగా ఉందని పలువురు బాధితులు ఆరోపించారు. సర్కిల్‌ కార్యాలయం వద్దకు వచ్చి బాధితులు నిరసన వ్యక్తం చేసే విధంగా పరిస్థితి మారింది.

మీకింతా.. మాకింతా!
హస్తినాపురం: వరద సహాయం రూ.10వేలు ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే సగం డబ్బులు తిరిగి ఇవ్వాలని కొందరు నేతలు బాధితులను డిమాండ్‌ చేస్తున్నారు. ఎందుకివ్వాలని బాధితులు ప్రశ్నిస్తే ‘అసలు మీ ఇల్లు మునగనే లేదు అని చెప్పి మొత్తం డబ్బులు తీసుకుంటాం’ అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు బారిన పడని కాలనీల్లో సైతం డబ్బులు ఇస్తున్నారని అసలైన అర్హులకు ఎందుకు ఇవ్వరని వాపోయారు. మా ఆధార్‌కార్డు తీసుకుని ఓటీపీ వచ్చిన తర్వాత లబ్ధిదారుని సంతకం తీసుకని నీకు డబ్బులు ఇచ్చేది లేదని నీ ఇల్లు మునగలేదని చెప్పి వెళ్లిపోయారని వెంకటేశ్‌ అనే వ్యక్తి తెలిపాడు. శవాల మీద ప్యాలాలు ఏరుకుంటున్నట్లు స్థానిక నేతలు వ్యవహరిస్తున్నారని ముంపు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేటర్‌ను నిర్బంధించిన మహిళలు... 
భారీ వర్షాలకు ముంపు బారిన పడిన ప్రతి ఇంటికి వరద సహాయం ఇచ్చినట్టే ఇచ్చి సగం తీసుకుంటున్నారని నందనవనంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాస్తా రోకో నిర్వహించి హస్తినాపురం కార్పొరేటర్‌ పద్మనాయక్‌ను దిగ్బంధించారు. గంటకు పైగా రాస్తారోకో నిర్వహించి తమకు రావాల్సిన వరద సహాయాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమకు ఇచ్చేంత వరకు వెళ్లనివ్వమన్నారు. వరద సహాయంలో దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారని వెంటనే అలాంటి కార్యకలాపాలకు స్వస్తి పలకాలనీ కార్పొరేటర్‌ పద్మానాయక్‌ను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మీర్‌పేట పోలీసులు వచ్చి కార్పొరేటర్‌ పద్మానాయక్‌ను అక్కడి నుంచి పంపించారు. ఆదర్శ్‌నగర్‌లో కొంత మంది దళారులు ఇచ్చినట్టే ఇచ్చి అందులో సగం డబ్బులు తీసుకుంటున్నారని తెలిపారు. వాంబేకాలనీలో రూ.2వేలు తీసుకుంటున్నారని, వాంబేకాలనీలో మరో గుంపు వచ్చి రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top