తుప్పల్లో ‘తొలి తెలుగు శాసనం’

First Telugu Inscription Found In Telangana - Sakshi

బ్రాహ్మీ లిపి నుంచి ఉద్భవించిన తొలి తెలుగు రూపం 

కీసరగుట్టలో క్రీ.శ. 430 కాలంలో ఐదక్షరాల్లో చెక్కిన శిల్పులు

ఇప్పటివరకు రక్షిత ప్రాంతంగా ప్రకటించని ప్రభుత్వం 

పొదల చాటున కనుమరుగయ్యే ప్రమాదంలో శాసనం

సాక్షి, హైదరాబాద్‌: బ్రాహ్మి లిపి నుంచి తెలుగు రూపాంతరం చెందాక తొలిసారి తెలుగు అక్షరాలు లిఖించిన తెలుగు శాసనం కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. ఆ ప్రాంతాన్ని ఇప్పటివరకూ సర్కారు రక్షిత ప్రాంతంగా గుర్తించకపోవడంతో ఆ శాసనం బయటిప్రపంచానికి అది కనిపించకుండా పొదల చాటున తుప్పల్లో దీనావస్థలో కొట్టుమిట్టాడుతోంది. 

క్రీ.శ. 430ల్లో ‘తొలుచువాండ్రు’..: నగర శివారులోని కీసరగుట్టలో ఈ తొలి తెలుగు శాసనం ఉంది. క్రీ.శ.430 కాలంలో విష్ణుకుండిన మహారాజు రెండో మాధవవర్మ కాలంలో గుండుపై తెలుగు లిపిలో ‘తొలుచువాండ్రు’ పదాన్ని చెక్కారు. అప్పట్లో అక్కడ అద్భుత ఆలయాన్ని నిర్మించేందుకు వివిధ ప్రాంతాల నుంచి శిల్పులు వచ్చారు. వారు శిల్పాలను చెక్కే క్రమంలో కొంతకాలం అక్కడే ఉన్నారు. ఇందుకోసం వీలుగా బస ఏర్పాటు చేసుకున్నారు.

అది శిల్పులుండే ప్రాంతమని చెప్పుకోవడానికి వీలుగా అక్కడి పెద్ద గుండుపై ‘తొలుచువాండ్రు’ (రాళ్లను తొలిచేవారు) అని ఐదక్షరాలను పెద్ద ఆకృతిలో చెక్కారు. దాన్ని చరిత్రకారుల పరిభాషలో నామక శాసనం (లేబుల్‌ ఇన్‌స్క్రిప్షన్‌) అంటారు. ఆ అక్షరాలు ప్రస్తుత తెలుగు లిపికి తొలి రూపం. ఆ లిపి ఎన్నో మార్పులు చెందుతూ ప్రస్తుతం వాడుతున్న తెలుగు లిపి ఏర్పడింది.

ఎంతో అపూరూపమైన వారసత్వ ఆస్తిని పురవావస్తు శాఖ ఇప్పటికీ అధికారికంగా రక్షిత ప్రాంతంగా గుర్తించలేదు. పరిరక్షణ చర్యలు చేపట్టలేదు. కీసరగుట్ట రియల్‌ ఎస్టేట్‌ పరంగా వేగంగా పురోగమిస్తున్నందున ఏ క్షణాన గుట్టలను పిండి చేసే క్రషర్లు, క్వారీల మధ్య శాసనం పిండి అయిపోతుందోనని చరిత్రకారులు ఆందోళన చెందుతున్నారు.

ఎక్కడుందో తెలుసుకోలేక..
ఇటీవల చరిత్ర అభిమాని దీకొండ నర్సింగరావు దాన్ని చూసేందుకు వెళ్లారు. గంటలతరబడి వెతికినా జాడ తెలియలేదు. చివరకు కొందరు సహాయకులతో తుప్పలు గాలిస్తూ చెట్ల కొమ్మలు తప్పిస్తూ వెతకగా గుండు కనిపించింది. దాని చుట్టూ పొదలు అల్లుకుని బయటి ప్రపంచానికి అది కనిపించకుండా పోయిందని ఆయన ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాన్ని వెంటనే రక్షిత ప్రాంతంగా ప్రకటించి గుండు చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయాలన్నారు. ఆ శాసనాన్ని తొలి తెలుగు శాసనంగా ప్రకటించి పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని చరిత్ర పరిశోధకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top