
పదేళ్లుగా పంటల బీమాపై ప్రభుత్వాల పిల్లిమొగ్గలు
సాక్షి, హైదరాబాద్: మనదేశంలో వ్యవసాయం అంటే ప్రకృతితో జూదం ఆడినట్లే.. కష్టపడి పండించిన పంట చేతికందుతుందన్న గ్యారంటీ లేదు. అందుకే ప్రభుత్వాలు రైతుల పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తాయి. కానీ, రాష్ట్రంలో బీమా పథకాలు లేకపోవటం, కేంద్ర ప్రభుత్వ బీమా పథకంలో రాష్ట్రం చేరకపోవటంతో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయిన రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు 11,298 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖనే అధికారికంగా తేల్చింది.
13 జిల్లాలలోని 64 మండలాలలో 6,670 ఎకరాలలో వరి, 4,100 ఎకరాలలో మొక్కజొన్న, 309 ఎకరాలలో మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. నష్టంపై నివేదిక వచ్చిన తరువాత పరిహారం చెల్లిస్తామని చెప్పారు కానీ.. ఎప్పటిలోగా రైతులను ఆదుకుంటారో చెప్పలేదు. గతంలో కూడా పంట నష్టం జరిగినప్పుడు ఇలాంటి ప్రకటనలే వచ్చాయి. కానీ, రైతులకు పైసా అందలేదు. ఈ నేపథ్యంలో పంటల బీమాపై మరోసారి చర్చ మొదలైంది.
పదేళ్లుగా రైతులకు నిరాశే..
రైతులకు పంటల బీమా అందించే ‘జాతీయ వ్యవసాయ బీమా పథకం’(ఎన్‌ఏఐఎస్).. కేంద్ర ప్రభుత్వ రా్రïÙ్టయ కృషి బీమా యోజన (ఆర్‌కేబీవై) కింద 2016 వరకు అమలులో ఉండేది. ఈ పథకాన్ని కేంద్రం 1999–2000లో ప్రవేశపెట్టింది. 2016లో కేంద్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై) తీసుకొచ్చింది. కానీ, ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రం చేరలేదు.
కేంద్ర బీమా పథకం ప్రీమియం ఎక్కువ, వచ్చే పరిహారం తక్కువ అని చెప్పిన అప్పటి సీఎం కేసీఆర్.. అంతకంటే మంచి పథకాన్ని తెస్తామని చెప్పారు. 2018 నుంచి రైతుబంధు అమలు చేయటంతో ఇక బీమా జోలికి పోలేదు. ఎప్పుడైనా ప్రకృతి వైఫరీత్యాలతో రైతులు నష్టపోతే ఆయా ప్రాంతాల్లో ఎకరాకు కొంత మొత్తాన్ని పరిహారంగా ఇచ్చే పద్ధతిని ప్రభుత్వం చేపట్టింది. ఇది కూడా గత పదేళ్లలో పెద్దగా అమలైన దాఖలాలు లేవు. ప్రభుత్వం మారినప్పటికీ అదే విధానం కొనసాగుతోంది.
మాటలు మాత్రమేనా?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరనున్నట్లు తొలుత ప్రకటించింది. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో సమావేశం కూడా నిర్వహించారు. దీంతో బీమా పథకం అమలు చేస్తారని రైతులు ఆశించారు. కానీ, చివరికి ఆ హామీ నీటిమూటగానే మిగిలింది. కేంద్ర పథకంలో చేరలేదు.. రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకం కూడా తీసుకురాలేదు. దీంతో పంటలు దెబ్బతింటే రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
సీఎం రేవంత్‌రెడ్డి పంటల బీమా అమలు చేస్తామని చెప్పినప్పటికీ, ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవలి అకాల వర్షాలకు 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారికంగా ప్రకటించినప్పటికీ, వాస్తవంగా అంతకు రెండింతల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.