మృతిచెందిన వ్యక్తికి కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌

Fake Covid Report Issue In karimnagar - Sakshi

సాక్షి, రామగుండం(కరీంనగర్‌): అంతర్గాం మండలంలోని రాయదండికి చెందిన మూడు కుటుంబాల్లో 13 మంది కరోనా టెస్ట్‌ చేయించుకోకున్నా వారి సెల్‌ నంబర్లకు నెగెటివ్‌ రిపోర్ట్‌ అంటూ మెసేజ్‌లు రావడంతో అవాక్కయ్యారు. వీరిలో ఒకరు గతంలోనే మృతిచెందారు. ఈ విషయం స్థానికంగా చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. రాయదండికి చెందిన మచ్చ బాలయ్య గత అక్టోబర్‌ 3న అనారోగ్యంతో మృతిచెందాడు. అంతకుముందు అతనికి గోదావరిఖని ప్రభుత్వ ఆస్పపత్రిలో కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్‌ వచ్చింది.

మెదడు సంబంధిత వ్యాధికి చికిత్స చేయించినప్పటికీ పరిస్థితి విషమించి, చనిపోయాడు. ఈ నేపథ్యంలో మృతుడితోపాటు అతని కుటుంబసభ్యులు శారద, సంజీవ్, విష్ణు, మరో రెండు కుటుంబాలకు చెందిన మచ్చ రామయ్య, రజిత మొత్తంగా 13 మందికి జూలై 28న బసంత్‌నగర్‌ పీహెచ్‌సీలో కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నట్లు, రిపోర్ట్‌లో నెగెటివ్‌ వచ్చినట్లు వారి ఫోన్‌ నంబర్లకు మెస్సేజ్‌లు వచ్చాయి. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు కరోనా టెస్ట్‌కు వెళ్లకపోగా పరీక్ష చేయించుకున్నట్లు మెస్సేజ్‌లు రావడం పట్ల మృతుడి కుమారుడు సంజీవ్‌ ‘సాక్షి’తో తన ఆవేదన వెలిబుచ్చాడు.

దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన వంగల రమేష్, అతని భార్య వాణి గత ఏప్రిల్‌ 15న తన కోవిషీల్డ్‌ మొదటి డోస్‌ టీకా వేసుకున్నారు. ఆ సమయంలో ఒకే ఫోన్‌నంబర్‌ ఇచ్చారు. జూలై 26న రెండో డోస్‌ టీకా వేసుకునేందుకు వెళ్తే  వాణి పేరు మాత్రమే ఆన్‌లైన్‌లో చూపిస్తోందని ఆమెకు మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు. రమేష్‌కు వేయకుండా పంపించారు. అసలైన లబ్ధిదారులకు వ్యాక్సిన్‌ వేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top