ఎల్‌ లిల్లీ @ రూ 9వేల కోట్లు | ElI Lilly Pharma Investment in Telangana | Sakshi
Sakshi News home page

ఎల్‌ లిల్లీ @ రూ 9వేల కోట్లు

Oct 7 2025 4:48 AM | Updated on Oct 7 2025 4:48 AM

ElI Lilly Pharma Investment in Telangana

రాష్ట్రంలో ఫార్మా దిగ్గజం భారీ పెట్టుబడి  హైదరాబాద్‌లో మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌

సీఎం రేవంత్‌తో భేటీ అనంతరం ఎల్‌ లిల్లీ ప్రకటన 

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు 

తయారీ కర్మాగారం, నాణ్యత కేంద్రం ద్వారా యువతకు ఉద్యోగాలు 

డయాబెటిస్, కేన్సర్, ఒబెసిటీ, అల్జీమర్స్, ఇమ్యూన్‌ వ్యాధులకు కొత్త ఔషధాలు, కొత్త ఆవిష్కరణలు

ఆగస్టు 4న హైదరాబాద్‌లో ఎల్‌ లిల్లీ జీసీసీని ప్రారంభించిన  సీఎం 

సంస్థ తాజా ప్రకటనతో గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా తెలంగాణ

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మా రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ ఎల్‌ లిల్లీ తెలంగాణలో భారీ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో తమ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌ (తయారీ కర్మాగారం)ను నెలకొల్పుతున్నట్లు వెల్లడించింది. దీని కోసం సుమారు రూ.9 వేల కోట్లు (ఒక బిలియన్‌ డాలర్లు) వెచ్చించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఎల్‌ లిల్లీ కంపెనీ ప్రతినిధులు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. 

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎల్‌ లిల్లీ సంస్థ ప్రెసిడెంట్‌ ప్యాట్రిక్‌ జాన్సన్, సంస్థ ఇండియా ప్రెసిడెంట్‌ విన్సెలో టుకర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్‌ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం తమ విస్తరణ ప్రణాళికలు, రాష్ట్రంలో భారీ పెట్టుబడులపై ఎల్‌ లిల్లీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.  

క్వాలిటీ హబ్‌ ఏర్పాటు 
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే మాన్యుఫాక్చరింగ్, క్వాలిటీ హబ్‌ తమకు అత్యంత కీలకమని ఎల్‌ లిల్లీ కంపెనీ ప్రకటించింది. ‘సంస్థ హైదరాబాద్‌ నుంచి దేశంలో ఉన్న ఎల్‌ లిల్లీ కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ నెట్‌వర్క్‌కు సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందిస్తుంది. కొత్త హబ్‌ ఏర్పాటుతో తెలంగాణతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 

త్వరలో కెమిస్టులు, అనలిటికల్‌ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్‌మెంట్‌ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపడతాం..’ అని తెలిపింది. ‘అమెరికాకు చెందిన ఎల్‌ లిల్లీ 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన సేవలను అందిస్తోంది. ఈ క్రమంలో మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ అధునాతన యూనిట్‌ తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెడుతుంది. ప్రధానంగా డయాబెటిస్, ఓబెసిటీ, అల్జీమర్స్, క్యాన్సర్, ఇమ్యూన్‌ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది. భారత్‌లో ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరులో ఎల్‌ లిల్లీ కంపెనీ  కార్యకలాపాలున్నాయి..’ అని సంస్థ ప్రతినిధులు వివరించారు. 

జీనోమ్‌ వ్యాలీలో ఏటీసీ సెంటర్‌: సీఎం రేవంత్‌ 
ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. జీనోమ్‌ వ్యాలీలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జీనోమ్‌ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ‘హైదరాబాద్‌లో ఆగస్టు 4న ఎల్‌ లిల్లీ తన గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది. 

విస్తరణలో భాగంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావటం తెలంగాణకు గర్వ కారణం. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు మా ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుంది. హైదరాబాద్‌ ఇప్పటికే ఫార్మా హబ్‌గా పేరొందింది. ఎల్‌ లిల్లీ పెట్టుబడితో ఇప్పుడు ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. 

1961లో ఐడీపీఎల్‌ స్థాపించినప్పటి నుంచే హైదరాబాద్‌ దిగ్గజ ఫార్మా కంపెనీలకు చిరునామాగా మారింది. ప్రస్తుతం 40 శాతం బల్క్‌ డ్రగ్స్‌ హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్లు ఇక్కడే తయారయ్యాయి..’ అని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లో ఎల్‌ లిల్లీ పెట్టుబడులు తెలంగాణలో పరిశ్రమల విస్తరణ తీరును ప్రతిబింబిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement