హమ్మయ్యా! బ్యాటరీ బస్సు ఆశలు సజీవం

Efforts Are Underway To Reclaim Electric Buses For Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ చేజారిన 324 ఎలక్ట్రిక్‌ బస్సులను తిరిగి సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ‘ఫాస్టర్‌ అడాప్సన్‌ అండ్‌ మాన్యుఫాక్చర్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌)’పథకం రెండో విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది రాష్ట్రానికి 324 బ్యాటరీ బస్సులను మంజూరు చేసింది. కానీ సరిగ్గా అదే సమయంలో ఆర్టీసీలో ఉధృతంగా సమ్మె జరుగుతుండటం, నాన్‌ ఏసీ బస్సులు తీసుకోవాలని నిర్ణయించగా, ఓ ఉన్నతాధికారి ఏసీ బస్సులే కావాలంటూ ఒత్తిడి ప్రారంభించటంతో ఆర్టీసీ చివరకు వాటిని వదులుకుంది. అయితే, ఇప్పటికీ ఆ కేటాయింపులు సజీవంగానే ఉన్నాయని తాజాగా ఢిల్లీ నుంచి సమాచారం రావటంతో వాటిని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.  

ఓ ఉన్నతాధికారి నిర్వాకంతో 
ఫేమ్‌ పథకం మొదటి విడతలో 40 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు రాగా, అవి తెల్ల ఏనుగుల్లా మారిపోయాయి. ప్రస్తుతం విమానాశ్రయం– హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల మధ్య తిప్పుతున్నారు. వీటి నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటం, పూర్తిలోఫ్లోర్‌ డిజైన్‌తో ఉండటం వల్ల దూర ప్రాంతాలకు నడపలేకపోవటం... వెరసి ఆర్టీసీకి అవి గుది బండగానే మారాయి. దీంతో గతేడాది ఫేమ్‌ –2 పథకం కింద 324 బస్సులు మంజూరైనప్పుడు అన్నీ నాన్‌ ఏసీ బస్సులే తీసుకోవాలని నిర్ణయించారు. ఆ మేరకే ప్రతిపాదన సిద్ధం చేసి ఢిల్లీకి పంపారు. కానీ తీరా వాటిని తీసుకునేవేళ, ఓ ఉన్నతాధికారి జోక్యం చేసుకుని ఏసీ బస్సులే తీసుకోవాలని పట్టుబట్టారు. తెలిసీ నష్టాలు తెచ్చుకోవడం ఎందుకని ఇతర అధికారులు వాదించారు. సరిగ్గా అదే సమయంలో ఆర్టీసీలో సమ్మె జరుగుతుండటం, ఫేమ్‌ పథకం కింద తీసుకునే బస్సులు ప్రైవేటు సంస్థ ద్వారా అద్దె ప్రాతిపదికన తీసుకోవాల్సి రావటం సమస్యగా మారింది. అద్దె బస్సుల సంఖ్య పెరగటం వల్ల ఆర్టీసీ ప్రైవేటు పరమవుతుందని, అద్దె బస్సులు తీసుకోవద్దని కార్మికులు డిమాండ్‌ చేశారు.

ఎలాగూ ఏసీ బస్సులు తీసుకోవద్దన్న నిర్ణయంతో ఉన్న ఆర్టీసీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు దీన్ని సాకుగా చూపి ఆ బస్సులకు టెండర్లు పిలవలేదు. గడువులోపు టెండర్లు పిలవనందున ఫేమ్‌ పథకం కేటాయింపులు కూడా రద్దయ్యాయి. మరోవైపు ఇప్పుడు ఆర్టీసీకి అత్యవసరంగా 1,300కు పైగా బస్సులు కావాల్సి ఉంది. ఇదే సమయంలో ఫేమ్‌–2 కేటాయింపులు పూర్తిగా రద్దు కాలేదని, దానికి సంబంధించిన ఫైలు కేంద్ర ఉపరితల రవాణాశాఖలో సర్క్యులేషన్‌లోనే ఉందన్న విషయం తెలిసింది. దీంతో ఆ కేటాయింపులను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరాలని ఆర్టీసీ నిర్ణయించింది. బ్యాటరీ బస్సులు కొన్ని సమకూరితే నిర్వహణ వ్యయం కూడా తగ్గి కలిసి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. పాత మంజూరీని కేంద్రం పునరుద్ధరిస్తే నాన్‌ ఏసీ బస్సులే తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top