‘మోర్‌ దేన్‌ ఫ్రెండ్స్‌’ డ్రగ్స్‌ పార్టీ | The Eagle and HNew teams jointly attacked the event | Sakshi
Sakshi News home page

‘మోర్‌ దేన్‌ ఫ్రెండ్స్‌’ డ్రగ్స్‌ పార్టీ

Apr 6 2026 4:22 AM | Updated on Apr 6 2026 4:22 AM

The Eagle and HNew teams jointly attacked the event

తారామతి బారాదారిలో జాసన్‌ ఈవెంట్‌ 

35 మందికి పరీక్షలు, ఆరుగురికి పాజిటివ్‌

సాక్షి, హైదరాబాద్‌: కొండాపూర్‌లో ఉన్న ‘క్వేక్‌ అరేనా పబ్‌’లో గురువారం రాత్రి జరిగిన ‘బ్లాక్‌ కాఫీ’ఈవెంట్‌లో పాల్గొన్న 64 మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మంది డ్రగ్స్‌ వాడినట్లు పాజివిట్‌ వచ్చింది. ఇది జరిగిన రెండు రోజులకే శనివారం రాత్రి గోల్కొండ సమీపంలోని తారామతి బారాదారి వంతు వచ్చింది. ‘మోర్‌ దేన్‌ ఫ్రెండ్స్‌’పేరుతో నిర్వహించిన ఈవెంట్‌పై ఈగల్, హెచ్‌–న్యూ బృందాలు సంయుక్తంగా దాడి చేశాయి. ఇక్కడ 35 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. 

వీరిలో ఈవెంట్‌ నిర్వాహకుడైన అంతర్జాతీయ డీజే, భార్యభర్తలు, మోడల్‌ ఉండడం గమనార్హం. దీని నిర్వాహ కుల్లో ప్రముఖ అంతర్జాతీయ డీజే జాసన్‌ డైలాన్‌ కూడా ఉన్నారు. ఈ ఖరీదైన పార్టీకి సంబంధించి వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి నలుగురి నుంచి పది మంది వరకు గ్రూపులుగానూ హాజరుకావచ్చంటూ రూ.1.25లక్షల నుంచి రూ.50 వేల వరకు రేటు నిర్దేశించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఈవెంట్‌ ప్రారంభమైంది. దీనిపై సమాచారం అందుకున్న ఈగల్‌ అధికారులు నిర్వాహకులతో పాటు అతిథుల వివరాలను సేకరించి విశ్లేషించారు. 

ఈవెంట్‌ నిర్వాహకుల్లో కీలకంగా ఉన్న అంతర్జాతీయ డీజే జాసన్‌కు డ్రగ్స్‌ వినియోగించిన చరిత్ర ఉండడంతో అప్రమత్తమయ్యారు. హెచ్‌–న్యూ పోలీసులతో కలిసి ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్‌ ‘మోర్‌ దేన్‌ ఫ్రెండ్స్‌’పై ఆకస్మిక దాడి చేశాయి.ఈవెంట్‌కు హాజరైన వారి సమాచారాన్ని సమగ్రంగా సేకరించి, అధ్యయనం చేసిన బృందాలు అనుమానితులుగా ఉన్న 35 మందిని గుర్తించాయి. వీరి నుంచి లాలాజలం, మూత్రం నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. 

వీళ్లు గంజాయితో పాటు కొకైన్‌ వాడినట్లు నిర్ధారించి హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఠాణాలో కేసు నమోదు చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో అంతర్జాతీయ డీజే జాసన్, మోడలింగ్‌తో పాటు యాక్టింగ్‌ చేసే సర్వర్, ట్రేడింగ్‌ వ్యాపారి నిహార్, ఈయన భార్య ఆషి, వ్యాపారి యోగేశ్వర్, ఫార్మా కంపెనీలో ఎనలిస్ట్‌ అభినాష్‌ ఉన్నారు. వీరిపై నమోదు చేసిన కేసులో ఎన్డీపీఎస్‌ యాక్ట్‌లోని సెక్షన్ల కింద ఆరోపణలు జోడించారు. నిందితులకు తల్లిదండ్రులు, సంబం«దీకుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చిన అధికారులు నోటీసులు జారీ చేసి విడిచిపెట్టారు. ఈ డ్రగ్‌ ఎక్కడ నుంచి ఖరీదు చేశారనే అంశంపై లోతుగా ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement