
యుద్ధప్రాతిపదికనఆ మొత్తం చెల్లించాలని ఆర్టీసీకి ప్రభుత్వ ఆదేశం
ప్రత్యేకంగా హడ్కో నుంచి రూ.300 కోట్ల రుణం తీసుకున్న సంస్థ
రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదనపై ‘సాక్షి’ కథనానికి స్పందన
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పదవీ విరమణ చేసి ఆర్థిక ప్రయోజనాలు అందక ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిసొలసి చివరకు ప్రతి సోమవారం రోడ్డెక్కి నిరసనలు తెలిపేందుకు సిద్ధమైన వృద్ధులకు తీపి కబురు ఇది. ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.300 కోట్లు సిద్ధం చేసుకుంది. అందుకు కావాల్సిన మొత్తాన్ని హడ్కో నుంచి రుణంగా పొందింది.
దాదాపు 16 వేల మంది విశ్రాంత ఉద్యోగుల ఆవేదనను కళ్లకు కడుతూ గత నెల 27న సాక్షి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన రాష్ట్రప్రభుత్వం, ఆ వృద్ధ కుటుంబాలకు వెంటనే ఆర్థిక ప్రయోజనాలు అందజేయాల్సిందిగా ఆర్టీసీని ఆదేశించింది.
2017 వేతన సవరణ ఫిట్‌మెంట్ 2024 జూన్ నుంచి అమలులోకి రాగా, ఆ ఏడాది మే వరకు రిటైర్ అయిన అందరికీ ఇప్పుడు ఆ బకాయిలు చెల్లించాల్సి ఉంది. పనిచేసిన కాలంలో 300 వరకు పేరుకునే ఆర్జిత సెలవుల (దాదాపు 10 నెలల వేతనంతో సమానం) మొత్తాన్ని కూడా రిటై ర్మెంట్ సమయంలో ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉండగా ఇది కూడా బకాయి ఉంది. 2017 వేతన సవరణతో జీతాలు పెరిగినందున, ఆర్జిత సెలవు బకాయిలు కూడా పెరుగుతాయి. 2019 జూలై నుంచి ఆర్టీసీలో డీఏల చెల్లింపు నిలిచిపోయింది.
గతేడాది ఒకే సారి ఐదు పెండింగు డీఏలను చెల్లించారు. ఈ మధ్య కాలంలో రిటైర్ అయినవారికి ఆ లబ్ధి ఇవ్వలేదు. ఒక్కో పెండింగ్ డీఏ నికరంగా 2.5 శాతం నుంచి 3.2 శాతం మధ్య ఉంది. ఆ మొత్తం కూడా రిటైర్డ్ ఉద్యోగులకు భారీగా లభించాల్సి ఉంది. గ్రాట్యుటీపై 2017 వేతన సవరణ ప్రభావాన్ని లెక్కగట్టి ఇవ్వాల్సి ఉంది. వేతన సవరణ తో పెరిగే జీతం ప్రకారం పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. ఆ పెరిగిన మొత్తా న్ని ఇవ్వలేదు. ఆర్టీసీ సహకార పరపతి సంఘంలో రిటైర్డ్ ఉద్యోగులు అధిక వడ్డీ ఆశతో దాచుకున్న మొత్తాలపై ప్రస్తుతం వడ్డీ చెల్లింపు నిలిచిపోయింది.
చాలామందికి ఆ బకాయి కూడా పేరుకుపోయి ఉంది. ఈ లబ్ధి పొందకుండానే పలువురు చనిపోయారు. ఇలా.. రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదనను ‘సాక్షి’ఆ కథనంలో వివరించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం ఆ ప్రయోజనాలను తక్షణం చెల్లించాలని ఆదేశించింది. దీంతో రిటైర్డ్ ఉద్యోగుల వివరాలను ఆడిట్ చేయించి ఈనెల 13లోపు అందించాలని ఆర్టీసీ అన్ని డిపోలను ఆదేశించింది. ఆ వివరాలు అందిన వెంటనే బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోబోతోంది.