జనవరిలో మైల్డ్‌ సెకండ్‌ వేవ్‌.. మే నాటికి తగ్గుముఖం

Dr Nageshwar Reddy Views On Second Wave Corona Related Issues - Sakshi

అక్టోబర్‌ నాటికి మామూలు పరిస్థితులు

భారతీయుల్లో ఎక్కువగా వ్యాధి నిరోధకత

గ్యాస్ట్రో ఎంటరాలజీ కేసుల పట్ల జాగ్రత్త

కరోనాతో పాటు హెపటైటిస్‌ వ్యాక్సిన్లు తీసుకోవాలి

ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్‌ డి. నాగేశ్వర్‌రెడ్డి

బ్రిటన్, దక్షిణాఫ్రికాలో సెప్టెంబర్‌ నుంచే కొత్త రకం వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు 70 శాతం ఉన్నా.. అంత ప్రమాదకరం కాదనే భావిస్తున్నాం. ఎందుకంటే బ్రిటన్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన వ్యాక్సిన్‌ ఈ కొత్త వైరస్‌పై ప్రభావం చూపుతుందని అంచనా. యువతరం అధికంగా ఉండటం, ఊబకాయం, బీపీ, గుండె సంబంధిత రోగులు తక్కువగా ఉండటం మంచి విషయం. 

సాక్షి, హైదరాబాద్‌: పలు దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ఎదురవుతున్న సమస్యలతో పోలిస్తే భారత్‌లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తక్కువగా సెకండ్‌ వేవ్‌ రావొచ్చని, జనవరిలో మళ్లీ కేసులు పెరిగే అవకాశాలున్నాయని, అయితే అది పెద్ద ఆందోళన కరమైనది కాకపోవచ్చని పేర్కొన్నారు. జనవరి నాటికి వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే, ఏప్రిల్‌ కల్లా వ్యాక్సిన్లు అందిస్తే.. మే నాటికి కేసులు తగ్గుముఖం పడతాయని చెప్పారు. వచ్చే అక్టోబర్‌ కల్లా సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయుల్లో రోగ నిరోధకశక్తి కాస్త ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కరోనా సంబంధిత అంశాలంపై ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా.నాగేశ్వర్‌రెడ్డి తెలిపిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

ఇక్కడ తక్కువగానే కేసులు..: అమెరికా, ఐరోపాలతో పోలిస్తే భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉంది. అమెరికా, లండన్‌లో థర్డ్‌ వేవ్‌ కూడా వచ్చేసింది. భారత్‌లో ఫస్ట్‌ వేవ్‌ మాత్రమే ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువ కేసులు నమోదు అవుతుండటంతో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో సెప్టెంబర్‌ నుంచే కొత్త రకం వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు 70 శాతం ఉన్నా.. అంత ప్రమాదకరం కాదనే భావిస్తున్నాం. ఎందుకంటే బ్రిటన్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన వ్యాక్సిన్‌ ఈ కొత్త వైరస్‌పై ప్రభావం చూపుతుందని అంచనా. యువతరం అధికంగా ఉండటం, ఊబకాయం, బీపీ, గుండె సంబంధిత రోగులు తక్కువగా ఉండటం మంచి విషయం.  చదవండి: (కరోనా కొత్త అవతారం!)

అధిక రోగ నిరోధకతపై పరిశోధన..
భారతీయుల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండటం, జన్యుపరంగా రక్షణలు, వైరస్‌ ప్రవేశించే తీరు తక్కువగా ఉండటం, హ్యూమన్‌ ల్యూకోసైట్‌ యాంటీజెన్‌ నిరోధక వ్యవస్థ.. మన దేశంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ఏఐజీలో పరిశోధనలు నిర్వహిస్తున్నాం. దీని వివరాలు మరో నెలలో వెల్లడిస్తాం. వ్యాక్సిన్‌పై ట్రయల్స్‌ మేమూ నిర్వహించాం. ఇక్కడి వ్యాక్సిన్లు 70 శాతానికిపైగా ప్రభావం చూపుతున్నాయి. ఇండియాలో లేని ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు ఫైజర్, మోడర్నా 95 శాతం కచ్చితత్వం ఉన్నట్లు వెల్లడైంది. వ్యాక్సిన్ల ధరలు, భద్రపరచడం మన దేశంలో కాస్త సమస్య. ఈ వ్యాక్సిన్లను అత్యల్ప ఉష్ణోగ్రతల్లో భద్రపరచాల్సి ఉంటుంది. ఇక్కడి పెద్ద పట్టణాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో ఈ వెసులుబాటు లేకపోవడం మైనస్‌. ఇండియాలో ఆక్స్‌ఫర్డ్, భారత్‌ బయోటెక్, స్పుత్నిక్‌ వ్యాక్సిన్లు తొందరగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

గర్భిణులు,16 ఏళ్లలోపు వారు మినహా..
గర్భిణులు, 16 ఏళ్లలోపు పిల్లలు మినహా అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా నుంచి కోలుకున్న వారు వ్యాక్సిన్లు తీసుకుంటే యాంటీబాడీస్‌ ఏర్పడతాయి. మొదటి డోస్‌ తీసుకున్నాక 3, 4 వారాల తర్వాత రెండో డోస్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 15 రోజులకు యాంటీబాడీస్‌ ఏర్పడతాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశం కావడంతో భారత్‌లో ఇప్పటికీ ఇంకా 20 నుంచి 30 శాతమే హెర్డ్‌ ఇమ్యూనిటీ ఏర్పడినట్లు అంచనా. అలాగే వ్యాక్సిన్‌ వచ్చే వరకు మాస్క్‌ శ్రీరామ రక్ష. అయితే బయటికి వెళ్లినప్పుడే మాస్క్‌ ధరించాలి. ఇంట్లో ఉన్నప్పుడు అవసరం లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి భారత్‌లో మీడియా చాలా కీలకమైన పాత్ర పోషించింది. కోవిడ్‌పై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు చైతన్యం కలిగించింది. సోషల్‌ మీడియాలో మాత్రం కొంత అసత్యాల ప్రచారం జరిగి భయాలు ఏర్పడ్డాయి. మొత్తం కరోనా కేసులను పరిగణనలోకి తీసుకుంటే 30 శాతం కంటే ఎక్కువగా గ్యాస్ట్రో ఎంటరాలజీ సంబంధిత సమస్యలతో కూడుకున్నవే ఉన్నాయి. డయేరియా, వాంతులు, కడుపులో నొప్పి, బరువు తగ్గుదల, వాసన కోల్పోవడం వంటి కారణాలతో ఈ కేసులు ట్రేస్‌ అయ్యాయి. చదవండి: (బ్రిటన్‌ నుంచి ముంబైకు ఐదు విమానాలు!)

పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు...
భారత్‌లో జీర్ణకోశ సంబంధ వ్యాధులు, వాటితో ముడిపడిన సమస్యలు పెరుగుతున్నాయి. ఆహారం, నీరు కలుషితం కావడం, పరిశుభ్రత పాటించకపోవడం, హెపటైటిస్‌ బీ, సీ వైరస్‌ సోకడం, జీవనశైలిలో మార్పులే ఇందుకు ప్రధాన కారణం. ధూమపానం, మద్యం అలవాట్లు పెరుగుతున్నాయి. పెయిన్‌ కిల్లర్‌ మందులు విచక్షణారహితంగా వాడుతున్నారు. దీంతో అసిడిటీ పెరుగుతోంది. జీర్ణకోశ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు కరోనాకే కాకుండా హెపటైటిస్‌ బీ, ఏ వ్యాక్సిన్లు కూడా తీసుకుంటే మంచింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top