ప్రాణం పోయినా సరే ‘తల’పెడితే.. తగ్గేదేలే!.. ఇతరులకు నో ఎంట్రీ!

Door Head Ant: There Is Species Of Ants That Has Doors For Head - Sakshi

చీమా.. చీమా.. ఏమిటలా కుట్టావ్‌ అంటే.. నా పుట్టలో వేలుపెడితే కుట్టనా? అంటుందట. కానీ ఈ చీమ కుట్టకున్నా.. తమ గూట్లో మాత్రం వేలు పెట్టనివ్వదు. తన తలను పణంగా పెట్టి మరీ గూడును కాపాడేస్తుంది. ప్రాణం పోయినా సరే.. తగ్గేదే లేదంటూ నిలబడుతుంది. ఏమిటీ.. ఓ చీమ గురించి ఇంత ఉపోద్ఘాతమేంటి అనిపిస్తోందా? దాని గురించి తెలిస్తే.. భలే ఉందిలే అనుకోకుండా ఉండలేరు. మరి ఆ చీమ ఏమిటి? దాని ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా? 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

గూటికి తగినట్టుగా తల.. 
సాధారణంగా ఇంటిని కాపాడటానికి గేట్లు, తలుపులు పెట్టుకుంటాం. అవసరమైతే తీసి, మళ్లీ వేసేస్తుంటాం. కానీ చెట్ల కాండంపై రంధ్రాల్లో జీవించే ‘డోర్‌ హెడ్‌’ చీమలు మాత్రం స్పెషల్‌. అవి తమ గూటిని కాపాడుకునేందుకు తలనే అడ్డుపెట్టి చేసే పోరు మరీ స్పెషల్‌.‘సెఫలోట్స్‌/సెరెబరా’ జాతికి చెందిన ఈ చీమల తలపై భాగం బల్లపరుపుగా, గుండ్రంగా ఉంటుంది. అంతేకాదు.. దాదాపుగా తమ గూడు రంధ్రానికి సరిపడే పరిమాణంలో ఉంటుంది. ఈ చీమలు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు.. గూటి లోపలికి వెళ్లి.. తమ తలను గూటి రంధ్రానికి అడ్డు పెట్టేస్తుంటాయి. అందుకే వీటిని ‘లివింగ్‌ డోర్స్‌’ అని కూడా పిలుస్తుంటారు.  

సాధారణంగా బీటిల్స్‌ (ఒకరకం చిన్నసైజు పురుగులు) చెట్ల కాండాలపై గుహల్లా రంధ్రాలు చేస్తుంటాయని.. వీటినే తమ గూడుగా చేసుకుని జీవిస్తుస్తున్న ఒకరకం చీమలు.. వాటిల్లోకి ప్రవేశించే రంధ్రాల వద్ద ‘డోర్‌హెడ్‌’ చీమలను కాపలాగా ఉంచుతాయని అమెరికాలోని లూయిస్‌విల్లే యూనివర్సిటీ పరిశోధకుడు స్టీవ్‌ యనోవిక్‌ తెలిపారు. ఈ చీమలపై ఆయన విస్తృత పరిశోధన చేశారు.

‘డోర్‌హెడ్‌’ చీమలు తమ చీమలనే లోనికి రానిస్తాయని.. చెట్లపై తిరిగే చిన్న పురుగులు, కీటకాలు వంటివి గూడులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఈ తరహా ‘డోర్‌ హెడ్‌’ చీమలు ఉన్నాయన్నారు. చెట్ల కాండాల్లో బీటిల్స్‌ చేసే రంధ్రాలకు సమాన సైజులో ‘డోర్‌ హెడ్‌’ చీమల తల సైజు ఉండటం విశేషమని.. లక్షల ఏళ్ల పరిణామ క్రమంలో ఇలా అభివృద్ధి చెంది ఉంటాయని పేర్కొన్నారు.  

ప్రాణం పోయినా.. తగ్గేదే లే.. 
చీమల్లో చాలా రకాలు కుడతాయి. ఇందుకోసం వాటికి ప్రత్యేకంగా గొట్టంవంటి నిర్మాణం (స్టింగ్‌) ఉంటుంది. కానీ ‘డోర్‌ హెడ్‌’ చీమలకు స్టింగ్‌ ఉండదు. దాంతో కుట్టలేవు. కానీ శత్రు పురుగులు, కీటకాలు గూడులోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రాణాలనైనా పణంగా పెడతాయని.. పురుగులు ఈ చీమల తలపై గట్టిగా దాడి చేసినా, కుట్టినా వెనక్కితగ్గవని స్టీవ్‌ యనోవిక్‌ చెప్పారు. తాము పరిశీలించిన ‘డోర్‌ హెడ్‌’ చీమల్లో చాలా వాటికి తలపై గాయాల గుర్తులు ఉన్నాయని వివరించారు. చీమల గూడు నిరంతరం మూసేసి ఉండదని.. ఏదైనా ప్రమాదం వస్తున్న సంకేతాలు కనబడగానే ‘డోర్‌హెడ్‌’ చీమలు ద్వారానికి తలుపులా తమ తలను అడ్డుపెట్టేస్తాయని తెలిపారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top