స్కాన్‌.. పరేషాన్‌

Doctors Negligence on COVID 19 CT Scan Report Hyderabad - Sakshi

ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ టెస్టులు కావాలంటున్న ప్రభుత్వఆస్పత్రులు 

సీటీస్కాన్‌ రిపోర్ట్‌ పాజిటివ్‌ అయినా పరిగణనలోకి తీసుకోని డాక్టర్లు  

అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ఇబ్బందులు 

మరోవైపు సొమ్ము చేసుకుంటున్న కార్పొరేట్‌ ఆస్పత్రులు

సికింద్రాబాద్‌ వారాసిగూడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. అనుమానం వచ్చి స్థానికంగా ఉన్న ఓ వైద్యుడిని
సంప్రదించాడు. ఆయనకోవిడ్‌గా అనుమానించి సీటీస్కాన్‌ చేయించుకోవాల్సిందిగా సిఫార్సు చేశారు. సీటీస్కాన్‌ చేయించగా..కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
అయింది. అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితివిషమించింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఈ రిపోర్ట్‌ తీసుకుని గాంధీ ఆస్పత్రికి వెళ్లగా..అడ్మిట్‌చేసుకునేందుకునిరాకరించారు. అదేమంటె..ఆర్టీపీఆర్‌ కానీ, ర్యాపిడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ ఉంటేనే...అడ్మిట్‌ చేసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో ఆ వ్యక్తిదిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇదీ ఒక్క వారాసిగూడ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి సమస్య మాత్రమే కాదు. సీటీస్కాన్‌ చేయించుకుంటున్నఅనేకమంది అత్యవసరపరిస్థితుల్లో ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో:  నిజానికి ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ టెస్టులతో పోలిస్తే సీటీస్కాన్‌ చేయిస్తే.. ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్‌ లోడు ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తుంది.అత్యవసర వైద్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైవేటుగా ప్రాక్టీస్‌ చేస్తున్న కొంతమంది వైద్యులు తమ వద్దకు వచ్చిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో భాగంగా సీటీస్కాన్‌కు సిఫార్సుచేస్తున్నారు. పరిమిత కేంద్రాల్లోనే ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేస్తుండటం, శాంపిల్‌ఇచ్చిన తర్వాత రిపోర్ట్‌ జారీకి 24 గంటల సమయం పడుతుండటం, ర్యాపిడ్‌ టెస్టుల్లో 80 శాతం మాత్రమే స్పష్టత ఉండటం వల్ల  కచ్చితత్వం కోసం డాక్టర్లు ఈ సీటీస్కాన్‌లను సిఫార్సు చేస్తున్నారు. అంతేకాదు  ప్రాథమిక దశలో ఉన్న వైరస్‌ను కూడా ఇందులో గుర్తించొచ్చు. ఇతర టెస్టులతో పోలిస్తే డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు ఇది లాభదాయకంగా మారింది. దీంతో ఆయా ఆస్పత్రుల్లోని వైద్యులు కూడా దీనికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సిటీస్కాన్‌లో పాజిటివ్‌ నిర్ధారణై.. అత్యవసర పరిస్థితుల్లో ఈ రిపోర్ట్‌ను తీసుకుని ప్రభుత్వ కోవిడ్‌ సెంటర్‌కు వెళితే..వారు అడ్మిషన్‌కు నిరాకరిస్తున్నారు. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ టెస్టుల్లో ఏదో ఒకటి ఉంటే తప్ప అనుమతించడం లేదు. అప్పటికే వైరస్‌ శరీరంలోకి ప్రవేశించి, శ్వాసనాళాలు, గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చికిత్సను నిర్లక్ష్యం చేయడం, అప్పటికే శరీరంలో వైరస్‌ లోడు పెరగడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందక అనేకమంది మరణిస్తున్నారు. ఈ తరహా మృతుల్లో 60 శాతం మంది 55 ఏళ్లలోపు వారే ఉన్నారు.  

ఆ ముసుగులో కార్పొరేట్‌ దోపిడీ 
దగ్గు, జలుబు, జ్వరం వంటి తీవ్రమైన లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన బాధితులకు ఈ టెçస్టులు చేయడంలో పెద్దగా అభ్యంతరం లేదు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారికి, పాజిటివ్‌ కేసులకు ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉండి అనుమానంతో వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్‌ సిఫార్సు చేస్తే సరిపోతుంది. సీటీస్కాన్‌తో పోలిస్తే  ఈ టెస్టుకు అయ్యే చార్జీ కూడా చాలా తక్కువ. ప్రభుత్వం ఇందుకు రూ.2000 నుంచి శాంపిల్‌ సేకరణను బట్టి రూ.2800 వరకు నిర్ణయించింది.  కానీ నగరంలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు అధిక సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఎలాంటి లక్షణాలు లేని సాధారణ రోగులకు కూడా సీటీస్కాన్‌ చేస్తున్నాయి. ఇందుకు రూ.10 వేల వరకు చార్జీ చేస్తున్నాయి. ఛాతీ ఎక్సరేతో తెలిసిపోయే..వైరస్‌ను సీటీస్కాన్‌ వరకు తీసుకెళ్లడంతో రోగులు మరింత భయాందోళనలకు గురవుతున్నారు.

అంతేగాక సీటీస్కాన్‌లో పాజిటివ్‌ వచ్చిన వారి వివరాలు ప్రభుత్వ హెల్త్‌ పోర్టల్‌లో నమోదు కావడం లేదు. వైరస్‌ సోకినట్టు ఇతరులకు తెలిసే అవకాశం ఉండటంతో వీరిలో చాలా మంది ఆస్పత్రుల్లో చేరడం లేదు. సోషల్‌ మీడియాలో వైద్య నిపుణులు ఇస్తున్న సూచనలు పాటిస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు కొని తెచ్చి వాడుతున్నారు.  అసింటమేటిక్‌ బాధితులు సులభంగానే కోలుకుంటున్నప్పటికీ...మధుమేహం, హైపర్‌టెన్షన్, ఇతర రోగాలు ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాదు పరోక్షంగా వీరు వైరస్‌ సామాజిక వ్యాప్తికి కారణమవుతున్నట్టు ప్రభుత్వ వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top