వివిధ హోదాల్లో, విభాగాల్లో విధులు.. నగరంపై మంచి పట్టు
సెంట్రల్ జోన్ డీసీపీగా ఉండగా లేక్ పోలీసు ఏర్పాటు
సీపీ టు డీజీపీ... 40 ఏళ్లలో ఇలా నియమితులైన 25 మంది
వీరిలో 14 మంది సిటీ కమిషనర్‌గా చేసిన వాళ్లే
వీరందరిలో ఆనంద్ ప్రత్యేకం
సాక్షి, హైదరాబాద్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ).. రాష్ట్ర పోలీసు విభాగానికి బాస్.. యూనిఫాం ధరించిన ప్రతి ఐపీఎస్ అధికారి కల.. ఇంతటి కీలక పోస్టులో నియమితులైన సీవీ ఆనంద్ ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి అన్నట్లు పూర్తిగా నగరంతో అనుబంధం పెనవేసుకున్నారు. ఆనంద్ తల్లిదండ్రులది నగర శివారులోని కుంట్లూరు. అయితే, ఆయన సిటీలోనే పుట్టారు. ఇక్కడే చదువుకున్నారు. ఈ ప్రత్యేకతకు తోడు.. ఐపీఎస్ అధికారిగా ఈస్ట్‌జోన్ డీసీపీ, సెంట్రల్ జోన్ తొలి డీసీపీగా, ఆపై ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా, రెండుసార్లు నగర కొత్వాల్‌గా పని చేశారు. ఇలా వివిధ హోదాల్లో, వివిధ విభాగాల్లో పనిచేసిన నేపథ్యంలో సిటీపై మంచి పట్టు ఉంది. నాలుగైదేళ్లు కేంద్ర సరీ్వసుల్లో డిప్యుటేషన్‌పై విధులు నిరి్వర్తించినా.. నగరం కేంద్రంగానే పని చేశారు.
సీపీ టు డీజీపీ...
ఇక అటు ఉమ్మడి రాష్ట్రంలో, ఇటు విభజన తర్వాత డీజీపీలుగా నియమితులైన వారిలో అత్యధికులకు సిటీతో ‘అనుబంధం’ ఉంటోంది. వీరిలో ఎక్కువమంది సిటీ పోలీస్ కమిషనర్లుగా పని చేసినవారే. ఈ పరంపరకు కొనసాగింపుగా మంగళవారం సీవీ ఆనంద్‌ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన పక్కా హైదరాబాదీ కావడం.. సుదీర్ఘ కాలం తర్వాత పూర్తి స్థాయి డీజీపీగా నియమితులు కావడం విశేషం.
నాలుగు దశాబ్దాల్లో ..
1986 నుంచి ఇప్పటివరకు అటు ఉమ్మడి రాష్ట్రం, ఇటు విభజన తర్వాత మహేందర్‌రెడ్డితో కలిపి మొత్తం 25 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీపీ సీటులో కూర్చున్నారు. వీరిలో 14 మందికి నగర పోలీసు కమిషనర్లుగా పని చేసిన అనుభవం ఉంది. అనురాగ్ శర్మ, మహేందర్‌రెడ్డి నేరుగా ‘సిటీ కమిషనరేట్’ నుంచి ‘డీజీపీ కార్యాలయానికి’ వెళ్లగా... మిగిలిన వారిలో అత్యధికులు ‘వయా’ చేరుకున్నారు. ఏకే మహంతి రోడ్ సేఫ్టీ అథారిటీ నుంచి, అరవిందరావు, ప్రసాదరావు, అంజనీకుమార్ తదితర అధికారులు అవినీతి నిరోధక శాఖకు చీఫ్‌లుగా పని చేస్తూ డీజీపీలుగా నియమితులయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజీపీలుగా నియమితులైన ఏడుగురిలో నలుగురు సిటీ నుంచే వెళ్లారు.

ఆ అనుభవంతో లేక్ పోలీసు సృష్టి..
చిన్నతనంలో ఆనంద్ కుటుంబం ఆదర్శ్‌నగర్‌లో ఉండేది. అక్కడినుంచి తరచూ ట్యాంక్‌బండ్ నుంచి రాకపోకలు సాగించేవారు. ఆ సందర్భాల్లోనే హుస్సేన్‌సాగర్‌లో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్న విషయం ఆయన దృష్టికి వచి్చంది. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీగా పని చేస్తున్నప్పుడు 2002లో లేక్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాగర్ చుట్టూ నిఘా, గస్తీతో పాటు అవగాహన బోర్డులు, తొలిసారిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. నగర కొత్వాల్‌గా పని చేసినప్పుడు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) సహా అనేక ఆవిష్కరణలు ఆనంద్ ఖాతాలోకే వెళ్తాయి.
సీపీ టు డీజీపీలు వీరే..
సీజీ సల్దాన్హ
ఆర్.ప్రభాకర్‌రావు
టి.సూర్యనారాయణరావు
ఎంవీ భాస్కర్‌రావు
హెచ్‌జే దొర
ఎస్‌ఆర్ సుకుమార
పేర్వారం రాములు
వి.దినేష్‌రెడ్డి
ఏకే మహంతి
బి.ప్రసాదరావు
అనురాగ్‌శర్మ
ఎం.మహేందర్‌రెడ్డి
అంజనీకుమార్
సీవీ ఆనంద్


