'ఐటీఐ'నా.. జాబ్‌ రెడీ | Currently 2,000 Vacancies in Hyderabad for ITI Students | Sakshi
Sakshi News home page

'ఐటీఐ'నా.. జాబ్‌ రెడీ

May 25 2026 5:44 AM | Updated on May 25 2026 5:48 AM

Currently 2,000 Vacancies in Hyderabad for ITI Students

మెరుగైన జీతం ఇస్తామంటూ కంపెనీల ఆఫర్‌ 

ఇప్పటికిప్పుడు హైదరాబాద్‌లో 2,000 ఖాళీలు 

విదేశాల్లో నెలకు రూ.2.7 లక్షల వరకు వేతనం

‘నమస్తే సార్‌..అర్జెంట్‌గా ఫిట్టర్‌ కావాలి. నెలకు రూ.20 వేలు ఇస్తాం. సార్‌ ఎలక్ట్రీషియన్‌ ఉంటే కాస్త పంపండి..ఐటీఐ పూర్తి చేస్తే చాలు. మెకానిక్‌ కోసం చూస్తున్నాం సర్‌.. చాలా రోజుల నుంచి అడుగుతున్నాం.’  ఇవీ ప్రతిరోజూ ఐటీఐల ప్రిన్సిపాల్స్‌కు కంపెనీల విన్నపాలు. ఒకప్పుడు చదువు మధ్య లో మానేసినవారు, ఇంటర్‌ ఫెయిలైన వారు ఐటీఐ చేసేవారు. ఇప్పుడు సీన్‌ తారుమారైంది. ఇండ్రస్టియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐటీఐ) నుంచి సర్టిఫికెట్‌ అందుకోగానే అభ్యర్థులకు జాబ్‌ రెడీగా ఉంటోంది.  

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారితో పోలిస్తే ఐటీఐ స్టూడెంట్స్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐల అభివృద్ధికి పూనుకోవడం, సామాజిక మాధ్యమాలు, మెరుగైన వేతనంతో ఆఫర్లు వెల్లువెత్తుతుండడం.. వెరసి సాంకేతిక శిక్షణ వైపు యువత మొగ్గు చూపుతున్నారు.  

ఎప్పుడూ ఖాళీలే.. 
ఐటీఐ అభ్యర్థుల కోసం ఒక్క హైదరాబాద్‌ మాత్రమే కాదు.. వైజాగ్, వరంగల్, తిరుపతి, విజయవాడ, చెన్నై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, ఢిల్లీలోనూ ఉద్యోగ అవకాశాలు రెడీగా ఉంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 2,000 మంది ఐటీఐ అభ్యర్థుల కోసం జాబ్స్‌ సిద్ధంగా ఉన్నాయి. 2026 ఆగస్టులో 18,000 మంది తమ కోర్సు పూర్తి చేసుకోనున్నారు. వీరిలో ఇప్పటికే సుమారు 5,000 మంది క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా పలు కంపెనీలకు ఎంపిక కావడం విశేషం.  

అంతర్జాతీయంగా రూ.లక్షల్లో వేతనాలు.. 
ఐటీఐ అభ్యర్థులకు అంతర్జాతీయంగా అధిక వేతనంతో ఉద్యోగ ఆఫర్లు పెరుగుతున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులకు తెలంగాణ ఓవరీŠస్స్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ (టామ్‌కామ్‌) పూర్తి సహకారం అందిస్తోంది. ఇజ్రాయెల్, యూరప్, జీసీసీ దేశాలు, ఆస్ట్రేలియాలో కనీస ఇంగ్లిష్‌ పరిజ్ఞానం ఉంటే చాలు. ట్రేడ్‌ను బట్టి నెల వేతనం జర్మనీలో రూ.2.7 లక్షలు, యూరప్‌ దేశాల్లో రూ.1.7 లక్షలు, జీసీసీ దేశాల్లో రూ.1.30 లక్షలు ఉంది. నిర్మాణ రంగంలో మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ఇజ్రాయెల్‌ నెలకు రూ.2.5 లక్షల వేతనం ఆఫర్‌ చేస్తోంది. తెలంగాణ కార్మిక శాఖ ఈ ఏడాది నుంచే ఎంపిక చేసిన ఐటీఐలలో జర్మన్‌ భాషను ప్రవేశపెడుతోంది. క్రమంగా ఫ్రెంచ్, జపనీస్‌తోపాటు ఇతర భాషలను పరిచయం చేయనున్నారు. 

అమ్మాయిలు అతి తక్కువ  
ఐటీఐ వైపు చూస్తున్న అమ్మాయిల సంఖ్య 1–2 శాతం మించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఫాక్స్‌కాన్‌ కేవలం మహిళలనే నియమించుకుంటోంది. ఏటా ఈ కంపెనీ 1,000 మందికి జాబ్స్‌ ఇస్తోంది. కొత్త ఉత్పత్తుల తయారీ తోడైతే ఈ సంఖ్య 5,000 దాటుతుందని అంచనా. ఏటా ఐటీసీ 1,000 మంది, ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ 500 మంది మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఐటీఐ పూర్తి చేస్తే మెరుగైన వేతనం ఉంటుందన్నది అధికారుల మాట.  


– టాటా సహకారంతో 65 ఐటీఐలను అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్లుగా తీర్చిదిద్దారు. మరో 54 కేంద్రాలు ఒకట్రెండేళ్లలో ఏటీసీలుగా మారనున్నాయి. 
– ప్రస్తుతం 32 రకాల ట్రేడ్స్‌ ఉన్నాయి. ఏఐ, సోలార్, రోబోటిక్స్, ఏరో నాటికల్, సెమీ కండక్టర్‌ వంటి 10 ట్రేడ్స్‌ కొత్తగా రానున్నాయి.  

ఉపకార వేతనంతో.. 
మరింత మందిని ఐటీఐల వైపు ఆకర్శించేందుకు నెలకు రూ.2,000 ఉపకార వేతనం ఇవ్వనున్నాం. తద్వారా అయినా అమ్మాయిలు ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాం. జపాన్‌లో కేర్‌ గివర్స్‌ జాబ్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఇక పారిశ్రామికవర్గాలతో చర్చించి మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి కొత్త కోర్సులను డిజైన్‌ చేస్తున్నాం. నైపుణ్యం ఉంటే లక్షల రూపాయల వేతనంతో విదేశీ అవకాశాలనూ విద్యార్థులు చేజిక్కించుకోవచ్చు.  
– ఏ.కాంతి వెస్లీ, డైరెక్టర్, ఉపాధి, శిక్షణ శాఖ.  

సరఫరా చేయలేం  
మార్కెట్‌ డిమాండ్‌కు తగ్గట్టుగా మానవ వనరులను సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఉద్యోగ ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. అభ్యర్థుల కోసం ఈ కంపెనీలన్నీ ఆగస్ట్‌ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం శిక్షణలో ఉన్న 18,000 మందికి ప్లేస్‌మెంట్‌ ఖాయం. బహుశా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కూడా ఇన్ని అవకాశాలు లేవు. వయో పరిమితి లేకపోవడం, జాతీయ స్థాయి సర్టిఫికెట్‌ కావడంతో డిగ్రీలున్నవారూ ఐటీఐల్లో చేరుతున్నారు.  
– కె.శ్యామ్‌ సుందర్, ప్రిన్సిపల్, ఐటీఐ, హకీంపేట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement