భూ వివాదంలో తలదూర్చిన సీఐ, ఎస్‌ఐపై వేటు

CP Mahesh Bhagwat Suspends Choutuppal CI SI Land Dispute Issue - Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన సీపీ మహేష్‌ భగవత్‌

చౌటుప్పల్‌: భూవివాదంలో తలదూర్చినందున చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌. వెంకన్నగౌడ్‌, ఎస్‌ఐ నర్సయ్యపై సస్పెషన్‌ వేటు పడింది. అదే విధంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు చార్జ్‌ మెమో జారీ అయింది. ఈ మేరకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో 2.33 ఎకరాల భూమికి సంబంధిం వివాదం నెలకొంది. దాంతో ఇరువర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. 

ఈ క్రమంలో భువనగిరి కోర్టు పట్టాదారుడికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. సదరు కోర్టు ఉత్తర్వులను ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐ ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం భూమికి యజమానిగా ఉన్న వ్యక్తి ఇటీవల రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ను ఆశ్రయించాడు. దాంతో కమిషనర్‌ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించగా ఆరోపణలు వాస్తవమని తేలడంతో సీఐ, ఎస్‌ఐని సస్సెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పర్యవేక్షణ లోపం కారణంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు మెమో జారీ చేశారు.(చదవండి: అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!)

కోర్టు ఉత్తర్వులు ఉన్నా బెదిరించారు: గౌరీబట్ల సురేందర్, బాధితుడు
నాకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ స్థానిక సీఐ, ఎస్‌ఐ బెదిరించారు. తాళ్లసింగారం గ్రామంలో 2012 సంవత్సరంలో కొనుగోలు చేసిన 2.33 ఎకరాల భూమి నాపేరిట ఉంది. నేను ఎవరికీ అగ్రిమెంటు చేయలేదు. కానీ కొంత మంది తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దాంతో స్థానిక పోలీసు లను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో కోర్టుకు వెళ్లాను. భువనగిరి కోర్టు నాకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సీఐ, ఎస్‌ఐ నన్ను బెదిరించారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలు, ఆధారాలను సీపీ మహేష్‌ భగవత్‌కు అందజేయగా విచారణ నిర్వహించి చర్యలు తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top