డబ్బులు చెల్లిస్తేనే పేషెంట్‌ను చూడనిస్తాం

Corporate Hospital Negligence on Kidney Patient Demanding Money - Sakshi

కార్పొరేట్‌ ఆస్పత్రి నిర్వాకం 

కిడ్నీ వ్యాధితో వస్తే కరోనా పేరుతో భయపెడుతున్న వైనం   

ఆస్పత్రి ఎదుట రోగి బంధువుల ఆందోళన  

రాంగోపాల్‌పేట్‌: కిడ్నీ వ్యాధితో ఆస్పత్రికి వస్తే కరోనా సోకిందంటూ ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యులు 10 రోజుల నుంచి పేషెంట్‌ను చూపించడం లేదు. రూ. 5 లక్షల  బిల్లు పెండింగ్‌ ఉందని, అది చెల్లిస్తేనే మీ వాడిని చూపిస్తామని ఆ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన బుధవారం సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చోటు చేసికుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోరుట్లకు చెందిన రాజశేఖర్‌ (25) కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడిని కుటుంబసభ్యులు గత నెల 27న సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. చికిత్స నిమిత్తం విడతల వారీగా రూ.3 లక్షలు చెల్లించారు. అప్పటి నుంచి రోగికి చికిత్స అందిస్తున్న చెబుతున్న ఆస్పత్రి వర్గాలు అతడిని తమకు చూపించడం లేదన్నారు.

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అతడికి కరోనా సోకిందంటూ తమను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం ఆస్పత్రి ఎదుట ఆందోళను దిగారు. ఆస్పత్రి యాజమాన్యం డబ్బుల కోసం లేని రోగాన్ని అంటగడుతుందని వారు వాపోయారు. నడుచుకుంటూ ఆస్పత్రి వచ్చిన అతడికి కరోనా లక్షణాలు లేకున్నా 10 రోజుల నుంచి తమకు చూపించడం లేదన్నారు. ఆస్పత్రి యాజమాన్యం అడిగిన రూ.5 లక్షలు చెల్లించనందునే తమ కుమారుడిని చూపించడం లేదని అతడి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. కిడ్నీ చెడిపోతే తన కిడ్నీ ఇస్తానని చెప్పానని, అప్పు చేసి రూ.3లక్షలు చెల్లించామని, తాము నిరు పేదలమని అంత డబ్బు ఎలా చెల్లించాలని ఆమె ప్రశ్నించింది.

డబ్బు చెల్లిస్తేనే చూపిస్తామని కొందరు డాక్టర్లు చెప్పారని తన కుమారుడికి ఏమైనా జరిగితే ఆస్పత్రి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆస్పత్రి యాజమాన్యం తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నాలు చేసింది. బుధవారం అతడి కుటుంబ సభ్యులను లోపలికితీసుకెళ్లి చికిత్స పొందుతున్న రాజశేఖర్‌ను చూపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోగుల సహాయకులను ఆస్పత్రి లోపలికి పంపించడం లేదని ఆ విషయం తెలియక బంధువులు అలా ఆరోపిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు వివరణ ఇచ్చాయి.  కరోనా రోగులు ఉండటంతోనే వార్డులోకి ఎవరినీ అనుమతించడం లేదన్నారు. అతనికి డయాలసిస్‌ నడుస్తుందని, చికిత్సకు ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుందని వారు వివరించారు. వారు రూ.5లక్షల బిల్లు చెల్లించాల్సి ఉన్నా మానవతా దృక్పథంతో వారి ఇష్టం మేరకు డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top