పల్లెల్లోకి కరోనా

Coronavirus Reached To Towns And Villages In Telangana - Sakshi

నగర, పట్టణవాసులు పల్లెలకు వెళ్లడమే కారణం

ద్వితీయశ్రేణి పట్టణాలు, మున్సిపాలిటీల్లో పూర్తిగా వ్యాప్తి

వచ్చే నెలలో 5 వేల గ్రామాల్లోకి వెళుతుందని అంచనా

ప్రభుత్వానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా నివేదిక

జిల్లాల్లో వెంటిలేటర్లు లేక హైదరాబాద్‌కు పరుగులు

270 మండలాలు, 1,500 గ్రామాల్లోకి విస్తరణ

సాక్షి, హైదరాబాద్‌ : నగరాలు, పట్టణాలను చుట్టేసిన కరోనా ఇప్పుడు పల్లెల్లోకి చొచ్చుకెళ్తోంది. మొదట్లో హైదరాబాద్‌ నగరం సహా కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో మాత్రమే కేసులు నమోదయ్యేవి. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా, ఆ తర్వాత మర్కజ్‌కు వెళ్లొచ్చినవారి ద్వారా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉండి వచ్చిన వలస కార్మికుల ద్వారా కేసులు విస్తరించాయి. తద్వారా హైదరాబాద్‌ నగరం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేసులు నమోదయ్యాయి.

ఆ తర్వాత పల్లెల నుంచి పట్టణాలు, నగరాల్లో ఉపాధి కోసం వచ్చినవారు, లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి తిరిగి గ్రామాలకు వెళ్లారు. దీంతో పల్లెల్లో కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 270 మండలాలు, 1,500 గ్రామాల్లోకి వైరస్‌ వ్యాప్తి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. వచ్చేనెలలో దాదాపు ఐదు వేల గ్రామాల్లో వైరస్‌ వ్యాప్తి జరుగుతుందని అంచనా వేసింది. సామాజిక వ్యాప్తి కారణంగా ఈ పరిస్థితి నెలకొందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ద్వితీయశ్రేణి పట్టణాలు, అన్ని మున్సిపాలిటీల్లోనూ వైరస్‌ వ్యాప్తి చెందిందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో 1,100 కేంద్రాల్లో యాంటిజెన్‌ కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తుండటంతో కూడా పెద్ద ఎత్తున కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇదిలావుంటే గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో కేసులు పెరుగుతుండటంతో ఆ మేరకు వైద్య వసతులు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రాల్లోనూ కరోనాకు సంబంధించిన చికిత్స కోసం అవసరమైన వైద్య వసతులు, వెంటిలేటర్లు లేక సీరియస్‌ కేసులను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. కొందరు వైద్యులు కూడా బాధితులకు సీరియస్‌గా ఉంటే హైదరాబాద్‌కే పంపిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో రద్దీ పెరిగింది. 

ఫీవర్‌ సర్వే...
గ్రామాల్లోనూ కరోనా బాధితులు పెరుగుతుండటంతో క్షేత్రస్థాయి వైద్య సిబ్బందితో ఫీవర్‌ సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి గ్రామంలో 150 వరకు కొత్త ముఖాలు ఉన్నట్లు గుర్తించారు. వారంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని, ఇప్పటిదాకా ఉపాధి ఉద్యోగాల రీత్యా నగరాలకు వెళ్లి వచ్చినట్లుగా తేల్చారు. చాలా ఏళ్ల తర్వాత వారు స్వగ్రామాలకు వచ్చినట్లు తేలింది. ఫలితంగా గ్రామాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది.

ప్రస్తుతం ద్వితీయ శ్రేణి పట్టణాల్లో వైరస్‌ కేసులు పెరుగుతున్నాయని, ఆగస్టు చివరి నాటికి మరింత పెరుగుతాయని అంచనా వేశారు. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ కేసులు నమోదుకాకపోవడంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ పెద్దగా దెబ్బతినలేదు. వ్యవసాయ రంగంపైనా పెద్దగా ప్రభావం పడలేదు. మున్ముందు కేసులు పెరిగితే ఎలా ఉంటుందోనన్న ఆందోళన వైద్య వర్గాలను కలవరపెడుతోంది. అయితే పట్టణాలు, నగరాలతో పోలిస్తే పల్లెల్లో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. వ్యవసాయ క్షేత్రాల్లో దగ్గర దగ్గరగా ఉండి పనిచేయాల్సిన పరిస్థితి కూడా ఉండదు.

దీనివల్ల వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉండొచ్చని అంటున్నారు. ఒకవేళ వైరస్‌ వ్యాపిస్తే మాత్రం వైద్య ఆరోగ్య సదుపాయాలు పట్టణాల్లో మాదిరిగా ఉండవని ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా స్థానిక వైద్యులు, ప్రైవేట్‌ ప్రాక్టీషనర్లపైనే ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. వైరస్‌ను సరైన సమయంలో అంచనా వేయకపోతే ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి పల్లెల్లో కేసుల నియంత్రణ, చికిత్స, ముందస్తు గుర్తింపుపై ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. 

వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయాలు...
కరోనా లక్షణాలుంటే స్థానిక ప్రైవేట్‌ ప్రాక్టీషనర్లు వెంటనే అప్రమత్తం అవ్వాలి. అలాగే ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు వారిని గుర్తించాలి. 
అనుమానితులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలి. అవసరమైతే వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. 
దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ముందుగానే చికిత్స అందించాలి. అందుకోసం మందులను 104 సర్వీసు ద్వారా అందించాలి. 
పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రులను మరింత బలోపేతం చేయాలి. అన్నిచోట్లా యాంటిజెన్‌ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి. 
గ్రామాల్లో భయాందోళనలు తలెత్తకుండా వారిలో చైతన్యం తీసుకురావాలి. అందుకోసం ప్రచారం నిర్వహించాలి. కరపత్రాలు వేయాలి. స్థానిక మీడియాను ఉపయోగించుకోవాలి. 
కొత్తగా తీసుకువచ్చే వంద ‘108’ అంబులెన్స్‌లను గ్రామాల్లో కరోనా సేవలకే కేటాయించాలి. 
అత్యవసర కేసులను సమీప ఆసుపత్రికి తీసుకొచ్చేలా జిల్లా వైద్యాధికారులు, స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top