తెలంగాణలో తగ్గిన వై‘రష్‌’

Coronavirus Positive Cases Recording Low Level In Telangana - Sakshi

సరిగ్గా నెల కిందట పాజిటివిటీ రేటు 3.59%, తాజాగా 1.1 % 

రాష్ట్రంలో తగ్గిన కరోనా ఉధృతి: ఆరోగ్యశాఖ

నెలలోనే మూడింతలు తగ్గిన పాజిటివిటీ రేటు

దసరా, దీపావళి పండుగల తర్వాత పెరగని కేసులు

జాగ్రత్తలు తీసుకోవడం వల్లే సాధ్యమైందని విశ్లేషణ

రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

‘సెకండ్‌ వేవ్‌’ ముప్పుపై నిర్లక్ష్యం తగదని హెచ్చరిక

వైరస్‌ జినోమ్‌లో మార్పుల వల్లే వ్యాప్తి తగ్గిందంటున్న వైద్య నిపుణులు  

సాక్షి, హైదరాబాద్‌: అక్టోబర్‌లో దసరా.. నవంబర్‌లో దీపావళి.. మరోవైపు చలికాలం.. ఆయా సందర్భాల్లో కరోనా తీవ్రంగా పెరుగుతుందని సర్కార్‌ తీవ్ర ఆందోళన చెందింది. కానీ రాష్ట్రంలో వైరస్‌ ఉధృతి తగ్గిందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు గణాంకాలతో సహా సర్కారుకు విన్నవిం చింది. కీలక పండుగల సందర్భంగా ప్రజలు తీసుకున్న జాగ్రత్తలు, ప్రభుత్వ ముందస్తు చర్యలతో వైరస్‌ను నియంత్రించగలిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తూ నివేదిక తయారు చేసింది. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గింది. దసరా తర్వాత కేసుల సంఖ్య పెరగలేదు. దీపావళి తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని  తెలిపింది. అక్టోబర్‌ ఒకటో తేదీన 54,098 కరోనా పరీక్షలు చేయగా, 2,009 మందికి పాజిటివ్‌ వచ్చింది. అంటే పాజిటివిటీ రేటు 3.71 శాతం నమోదైంది. ఆ నెలలోనే దసరా వచ్చిపోయింది. 

తర్వాత నవంబర్‌ ఒకటో తేదీన 25,643 పరీక్షలు చేయగా, 922 కేసులు నమోదయ్యాయి. అంటే పాజిటివిటీ రేటు 3.59 శాతంగా నమోదైంది. అంతకు ముందు నెలతో పోలిస్తే కాస్తంత తగ్గింది. ఇక నవంబర్‌ రెండో వారంలో దీపావళి వచ్చింది. ఆ తర్వాత కేసుల సంఖ్య పెరగలేదని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. దీపావళి అయిన 16 రోజుల తర్వాత ఇప్పుడు డిసెంబర్‌ ఒకటో తేదీన 51,562 కరోనా పరీక్షలు చేస్తే, అందులో 565 మందికి పాజిటివ్‌ వచ్చింది. అంటే పాజిటివిటీ రేటు 1.1 శాతంగా నమోదైందని నివేదిక తెలిపింది. ఈ పరిస్థితుల్లో నెల రోజుల వ్యవధిలో పాజిటివిటీ రేటు ఏకంగా మూడు రెట్లు తగ్గిందని నివేదిక వెల్లడించింది. వాస్తవంగా ఆగస్టు ఒకటో తేదీన కరోనా పాజిటివిటీ రేటు 9.84 శాతం ఉండగా, సెప్టెంబర్‌ నెలలో 4.87 శాతంగా ఉంది. ఇప్పుడు గణనీయంగా తగ్గిపోవడం ఊరట కలిగిస్తోందని నివేదిక తెలిపింది.

88 శాతం కరోనా పడకలు ఖాళీ..
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిందనడానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా పడకలు ఖాళీగా ఉండటం కూడా కారణంగా చెప్పవచ్చని నివేదిక తెలిపింది. సరిగ్గా నాలుగు నెలల క్రితం ఆగస్టు ఒకటో తేదీన ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 56.40 శాతం కరోనా పడకలు ఖాళీగా ఉండగా, ఈ నెల ఒకటో తేదీన కరోనా పడకలు 88 శాతం ఖాళీగా ఉన్నాయని వైద్య, ఆరోగ్య నివేదిక తెలిపింది. కేసులు తగ్గడం, ప్రజల్లో వైరస్‌ పట్ల అవగాహన ఏర్పడటంతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని నివేదిక తెలిపింది. 

ఈ నెల ఒకటో తేదీన 61 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,561 కరోనా పడకలున్నాయి. అందులో 757 నిండిపోగా, ఇంకా 7,804 పడకలు ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏకంగా 91.15 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయని నివేదిక తెలిపింది. అలాగే 220 ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 8,509 కరోనా పడకలు ఉండగా, వాటిల్లో 1,290 కరోనా రోగులతో నిండిపోయాయి. ఇంకా 7,219 పడకలు ఖాళీగా ఉన్నాయి. అంటే 84.84 శాతం ఖాళీగా ఉన్నాయని తెలిపింది.

87 ఆసుపత్రుల్లో సాధారణ పడకల ఎత్తివేత..
ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా కోసం ప్రత్యేకంగా కేటాయించిన పడకలను ఎత్తేస్తున్నాయి. కరోనా ఉధృతి తగ్గడం, పడకలు నిండకపోవడంతో ఆసుపత్రులు సాధారణ చికిత్సలకు మరలిపోతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం 61 ప్రభుత్వ, 220 ప్రైవేట్‌ ఆసుపత్రులు కరోనా చికిత్సలు అందిస్తున్నాయి. వాటిల్లో సాధారణ ఐసోలేషన్‌ పడకలు, ఆక్సిజన్‌ పడకలు, ఐసీయూ పడకలుగా విభజించి కరోనాకు కేటాయించాయి. అయితే వాటిల్లో సాధారణ ఐసోలేషన్‌ పడకలను చాలా ఆసుపత్రులు ఎత్తేశాయి. 68 ప్రైవేట్‌ ఆసుపత్రులు, 19 ప్రభుత్వ ఆసుపత్రులు సాధారణ కరోనా పడకలను ఎత్తేశాయి. అలాగే ఆక్సిజన్‌ పడకలను నాలుగు ప్రభుత్వ, 10 ప్రైవేట్‌ ఆసుపత్రులు ఎత్తేశాయి. అలాగే కీలకమైన ఐసీయూ పడకలను 9 ప్రైవేట్‌ ఆసుపత్రులు, 15 ప్రభుత్వ ఆసుపత్రులు సైతం ఎత్తేశాయి. వీటిని ఇతర వ్యాధులకు సంబంధించిన రోగుల కోసం కేటాయించాయి. 

పొంచివున్న ‘సెకండ్‌ వేవ్‌’..
ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినా రాబోయే రెండు నెలలు అత్యంత కీలకమని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా, దేశంలో అక్కడక్కడ సెకండ్‌ వేవ్‌ వణికిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. సెకండ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని, జాగ్రత్తలు తీసుకోకుంటే అది ప్రతాపం చూపిస్తుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే కిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, ఆ తర్వాత సంకాంత్రి పండుగ సందర్భంగా మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు. ఇంకా పెళ్లిళ్ల వేడుకల్లోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

జాగ్రత్తలు తీసుకోకుంటే మళ్లీ వ్యాప్తి..
రాష్ట్రంలో కరోనా ఉధృతి గణనీయంగా తగ్గింది. పాజిటివిటీ రేటు నెలలోనే మూడు రెట్లు తగ్గింది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా కేసులు అధికంగా పెరుగుతాయని భయపడ్డాం.. కానీ ప్రభుత్వం అప్రమత్తం చేయడం, ప్రజలు జాగ్రత్తగా ఉండటంతో అటువంటి పరిస్థితి లేకపోగా, కేసుల సంఖ్య తగ్గడం ఊరటనిచ్చే విషయం.. అయితే రాబోయే రెండు నెలలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సెకండ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ వైరస్‌ విజృంభిస్తుంది.
– డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు

వైరస్‌ జీనోమ్‌లో మార్పుల వల్లే...
కరోనా కేసులు తగ్గడానికి పలు కారణాలున్నాయి. వైరస్‌ జీనోమ్‌లో మార్పుల వల్ల కరోనా కాస్తంత బలహీనపడి తీవ్రత తగ్గింది. అలాగే కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగింది. గతంలో కంటే ప్రజలు ఎక్కువగా డీ, సీ విటమిన్లు వాడారు. జింక్‌ సంబంధిత మాత్రలూ వేసుకున్నారు. డీ విటమిన్‌ 60 నుంచి 70 యూనిట్ల వరకుంటే, 95 శాతం మేరకు కరోనా వైరస్‌ వచ్చే చాన్సే లేదు.. ఇటు బలవర్ధక ఆహారం తీసుకోవడం, పరిశుభ్రత పెరగడం వంటివి కారణాలుగా ఉన్నాయి. అయితే వైరస్‌ మళ్లీ తన ప్రతాపం చూపదని అనుకోలేం. ఎందుకంటే అది ఎప్పటికప్పుడు తనకు తాను మార్పు చేసుకుంటోంది. అది ఎలాంటి మార్పులకు లోనవుతుందో చెప్పలేం..
– డాక్టర్‌ మధుమోహన్‌రావు, శాస్త్రవేత్త, నిమ్స్‌ పరిశోధన అభివృద్ధి విభాగం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top