జనంలోకి వ్యాక్సిన్‌

Corona Vaccination For Elders and Chronically Ill From Today - Sakshi

నేటి నుంచి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా టీకా

తొలిరోజు 93 కేంద్రాల్లో టీకాలు.. తర్వాత వెయ్యికిపైగా సెంటర్లలో..

రాష్ట్రంలో మొత్తం 50 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా ప్రణాళిక

నాలుగైదు నెలలపాటు టీకా కార్యక్రమం

ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సామాన్య ప్రజలకు కరోనా టీకా కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అవుతుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ప్రాధాన్యంగా 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల మధ్య వయసులోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా అందజేస్తామని ఆయన ప్రకటించారు. వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలసి డాక్టర్‌ శ్రీనివాసరావు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సోమవారం లాంచనంగా సాధారణ జనానికి టీకా కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఎంపిక చేసిన 48 ప్రభుత్వ, 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌ ఉంటుందని తెలిపారు. ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,200 మందికి టీకా వేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లోనే ప్రారంభం అవుతుందని, రెండో తేదీ నుంచి పూర్తిస్థాయిలో టీకా కార్యక్రమం ఉంటుందని వివరించారు. మున్ముందు వెయ్యి కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ జరుగుతుందన్నారు. రెండు ప్రాధాన్య వర్గాలకు నాలుగైదు నెలలపాటు టీకా కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. రెండో డోస్‌ కూడా అదే కేంద్రంలో వేస్తామన్నారు. ఆ మేరకు షెడ్యూల్‌ ఖరారు చేస్తామని వెల్లడించారు. వెంటనే వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ జారీచేస్తామని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. సాధారణ ప్రజల్లో 50 లక్షల మంది రెండు ప్రాధాన్య వర్గాలకు టీకాలు వేస్తామన్నారు.

‘ధ్రువీకరణ’ సమర్పించాలి...
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎంబీబీఎస్‌ డాక్టర్‌ లేదా ఆపై స్థాయి వైద్యుడి నుంచి తాము జారీ చేసే నమూనా ఆధారంగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. దాన్ని కోవిన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేశాకే టీకా వేస్తామని తెలిపారు. 20 రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తామన్నారు. లబ్ధిదారులు వారంలోగా యాప్‌లో రిజిస్ట్రేషన్‌తోపాటు దగ్గరలో ఉన్న బూత్‌కు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకొని టీకా పొందవచ్చన్నారు. అన్ని టీకాలు సురక్షితమేనని, ఎవరికి ఏ కంపెనీ టీకా ఇస్తామనేది బయటకు వెల్లడించబోమని ఆయన చెప్పారు. 45–59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సర్టిఫికెట్లు ఇచ్చేలా అనెక్జర్‌–1బీ కాపీ ఇంటర్నెట్‌లోనూ, కోవిన్‌ యాప్‌లోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఆ ఫార్మాట్‌ను ఆధారం చేసుకొని వైద్యులు సర్టిఫికేట్‌ ఇస్తారని శ్రీనివాసరావు వివరించారు. కోవిన్‌ 2.0 వెర్షన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆదివారం సాయంత్రం నుంచే అందుబాటులోకి వచ్చిందని, రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి సోమవారం టీకా ఇస్తామన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి కూడా అదే రోజు వ్యాక్సిన్‌ ఇస్తామన్నారు. ప్రతి సెంటర్‌లోనూ సాధారణ ప్రజలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులకు కూడా టీకా వేస్తామన్నారు. నిర్దేశించిన రోజున టీకా వేయించుకోలేనివారు తదుపరి రీ షెడ్యూల్‌ చేసుకోవచ్చన్నారు.

జ్వరం లేదా ఒళ్లు నొప్పులు సాధారణమే...
టీకా వేసుకున్నాక జ్వరం లేదా ఒళ్లు నొప్పులు ఉండటం చాలా మందిలో సహజమేనని డాక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు. ఎవరికైనా టీకా వేసిన అరగంటలోనే తీవ్ర దుష్ప్రభావాలు కనిపిస్తాయని, కాబట్టి వారు అరగంటపాటు తమ పరిశీలనలోనే ఉండాలన్నారు. ఇంటికి వెళ్లాక ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సమీప ఆసుపత్రికి వెళ్లాలని, లేకుంటే 104 నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు. అన్ని వసతులున్న ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే టీకా వేస్తామన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీకా కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బుధ, ఆదివారాల్లో టీకాలు వేయరని, ప్రైవేటులో మాత్రం వారమంతా వేసినా తమకు అభ్యంతరం లేదన్నారు.

దశలవారీగా కేంద్రాల పెంపు...
వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొద్ది సెంటర్లతో ప్రారంభించి దశలవారీగా విస్తరిస్తామని డాక్టర్‌ శ్రీనివాసరావు వివరించారు. మున్ముందు 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), 19 ఏరియా ఆసుపత్రులు, 29 జిల్లా ఆసుపత్రుల్లో, 9 బోధనాసుపత్రుల్లో కరోనా టీకా వేస్తామన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న 215 ప్రైవేటు ఆసుపత్రులను టీకా వేసేందుకు గుర్తించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా ఉచితమని, ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా ధర రూ. 150, సర్వీస్‌ చార్జీ రూ. 100 వరకు వసూలు చేసుకోవడానికి కేంద్రం అనుమతించిందన్నారు. అంతకంటే ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదన్నారు.

అందుబాటులో డాక్టర్‌: డీఎంఈ
టీకా కేంద్రాల్లో లబ్దిదారులు వేచి ఉండే గది వద్ద ఒక డాక్టర్, టీకా వేశాక అరగంట సేపు పరిశీలనలో ఉండే చోట మరో డాక్టర్‌ అందుబాటులో ఉంటారని డీఎంఈ రమేష్‌రెడ్డి తెలిపారు. రెండో ఫేజ్‌ కరోనా వ్యాక్సిన్‌ రెండు ప్రాధాన్య వర్గాలతో ప్రారంభం అవుతుందన్నారు. తొలుత కొన్నిచోట్ల మాత్రమే టీకా ప్రారంభిస్తామన్నారు. ఒకేసారి జనం పోటెత్తకుండా ఉండేందుకు కొన్ని సెంటర్లలోనే ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రైవేట్‌ ఆసుపత్రులు అంగీకరించాయన్నారు. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు కూడా ప్రభుత్వమే టీకాలను సరఫరా చేస్తుందన్నారు. రాష్ట్ర టీకా కేంద్రం నుంచి జిల్లా కోల్డ్‌చైన్‌ పాయింట్లకు వ్యాక్సిన్లను సరఫరా చేసి వారికి ఇస్తామన్నారు. అంతకుముందే వారు టీకాలకు డబ్బులు చెల్లించి రసీదు తీసుకుంటారని, ఆ మేరకు వాటికి పంపిణీ జరుగుతుందన్నారు.

29–42 రోజుల మధ్య రెండో డోసు
కరోనా రెండో డోసును తొలి డోసు తీసుకున్న 28వ రోజున లబ్ధిదారులు తీసుకోవాలన్న నిబంధన ఇప్పటివరకు ఉండగా కేంద్ర ప్రభుత్వం దాన్ని తాజాగా మార్చింది. తొలి డోసు వేసుకున్న 29వ రోజు నుంచి 42వ రోజు మధ్య ఎప్పుడైనా లబ్ధిదారులు రెండో డోసు తీసుకోవచ్చని తెలిపింది. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్‌ వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆసుపత్రికి రావల్సిందేనని తేల్చిచెప్పింది. ఎవరైనా ఆసుపత్రికి వచ్చే పరిస్థితి లేకపోతే వారిని అంబులెన్స్‌లో తీసుకురావాలని సూచించింది.

50 లక్షలు: టీకాలు పొందబోయే సాధారణ ప్రజానీకంలోని రెండు ప్రాధాన్య వర్గాల వారి సంఖ్య. 
4.43 లక్షలు: జనవరి 16 ఇప్పటివరకు టీకా వేసుకున్న వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల సంఖ్య.
(మొదటి డోస్‌ 2.95 లక్షల మంది, రెండో డోస్‌ 1.47 లక్షల మంది)
215: టీకా వేసేందుకు గుర్తించిన ఆరోగ్యశ్రీ జాబితాలోని ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య.
టీకాలు ఇచ్చే కేంద్రాలు...
863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ)
19 ఏరియా ఆసుపత్రులు
29 జిల్లా ఆసుపత్రులు
9 బోధనాసుపత్రులు
215 ప్రైవేటు ఆసుపత్రులు

నేటి వ్యాక్సినేషన్‌ షెడ్యూల్‌ ఇలా...

  • ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
  • 45 ప్రైవేటు ఆసుపత్రులు
  • 48 ప్రభుత్వ ఆసుపత్రులు
  • ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,600 మందికి టీకాలు
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top