ఆగస్టులో ఆగమాగం చేసింది

Corona Cases Rapidly Increased in August  in Telangan - Sakshi

గత నెలలో కరోనా వైరస్‌ స్వైరవిహారం

మార్చి నుంచి జూలై వరకు 64,786 కేసులు.. 

 ఒక్క ఆగస్టులోనే 62,911 కేసులు

 టెస్టుల సంఖ్య గణనీయంగా పెరగటంతోనే ఆ స్థాయిలో కేసుల నమోదు

ఇటు గత నెలలో కోలుకున్న వారి సంఖ్యా భారీగానే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గత నెలలో కరోనా వీరవిహారమే చేసింది. అంతకుముందు ఎన్ని కేసులు నమోదయ్యాయో, ఒక్క ఆగస్టులోనే దాదాపు అన్ని వచ్చాయి. వైరస్‌ తీవ్రత పెరగటం, ఎక్కడికక్కడ కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచడంతో కేసులు భారీగా వెలుగుచూశాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్నారు. దాదాపు 1,100 కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్ధారణ పరీక్షలు, కేసుల పెరుగుదలతో పాటు అదేస్థాయిలో మరణాల సంఖ్య కూడా భారీగా ఎక్కువైంది. దీంతో ప్రస్తుత సెప్టెంబర్‌లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనన్న ఆందోళన జనంలో నెలకొంది. పైగా ఈ సెప్టెంబర్‌లో 15 లక్షల ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించనున్నారు. అలాగే మరో 3 లక్షల వరకు ఆర్‌టీ–పీసీఆర్‌ పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది.

గత నెలలో 62,911 కేసులు..
రాష్ట్రంలో మొదటి కరోనా కేసు ఈ ఏడాది మార్చి 2న నమోదైంది. అప్పట్నుంచి ఇప్పటివరకు 1,27,697 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జూలై చివరి నాటికి 64,786 కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత ఒక్క ఆగస్టులోనే 62,911 కరోనా కేసులు వచ్చాయి. కరోనా టెస్టుల సంఖ్య గణనీయంగా పెరగటంతో కేసులు ఈ స్థాయిలో నమోదవుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 14,23,846 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో జూలై వరకు అంటే 5 నెలల్లో రాష్ట్రంలో 4,58,593 పరీక్షలు చేయగా, ఒక్క ఆగస్టులోనే 9,65,253 పరీక్షలు చేశారు.

ఒక్క నెలలోనే 306 మంది మృతి..
ఇక గత నెలలో కరోనా పరీక్షలు, కేసులు ఏ విధంగా పెరిగాయో అలాగే కోవిడ్‌ మరణాలు కూడా అధికంగా నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 836 మంది చనిపోయారు. అందులో మార్చి నుంచి జూలై వరకు 530 మంది మరణిస్తే, ఒక్క ఆగస్టులోనే 306 మంది చనిపోయినట్లు సర్కారు లెక్కలు చెబుతున్నాయి.

కోలుకున్నవారూ అధికమే
రాష్ట్రంలో ఇప్పటివరకు 95,162 మంది కోలుకున్నారు. అందులో మార్చి–జూలై మధ్య 46,502 మంది కోలుకోగా, ఒక్క ఆగస్టులోనే అంతకుమించి 48,660 మంది కోలుకున్నారు. ఇక జూలై చివరినాటికి 56 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలందగా.. ఇప్పుడు వాటి సంఖ్య 42కే పరిమితమైంది. జూలై చివరినాటికి 94 ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు జరగ్గా, తాజాగా ఆ సంఖ్య 184 కు పెరిగింది. అంటే ఆగస్టులో రెట్టింపు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు అందుబాటులోకొచ్చాయి.అప్పుడు రికవరీ రేటు 71.7% ఉంటే, గతనెల రోజు ల్లో 74.5%కి పెరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. జూలై చివరికి మరణా ల రేటు 0.81 శాతముంటే, తాజాగా అది 0.65 శాతానికి తగ్గింది.

చదవండి: 38 లక్షలకు చేరువలో టెస్టులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top